హీరోయిన్ అవుదామని 'పూరీ' ఇంటికి వెళ్లి...
బంజారాహిల్స్ : సినిమా హీరోయిన్ కావాలనే మోజుతో పూరి జగన్నాథ్ ఇంటి ముందు తచ్చాడుతున్న ఓ యువతి ఖాకీలకు చెమటలు పట్టించిన సంఘటన జూబ్లీహిల్స్‌లో గురువారం జరిగింది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన ఓ యువతి(19) నర్సంపేటలోని ఆచార్య డిగ్రీ కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతుంది. వెండితెర మీద వెలిగిపోవాలనే కోరిక ఎప్పటి నుంచో ఉన్న ఆమెకు.. దర్శకుడు పూరి జగన్నాథ్ అంటే అభిమానం. ఆయన సినిమాలతోనే హీరోయిన్ అవ్వాలని భావించి.. బుధవారం సాయంత్రం ఇంట్లో చెప్పకుండా వరంగల్ నుంచి నేరుగా ఫిలింసిటీకి వచ్చింది. అర్ధరాత్రి 11.30 గంటల ప్రాంతంలో రోడ్డు పక్కన ఒంటరిగా ఉన్న యువతిని అటు వైపు నుంచి వస్తున్న ఆనంద్ అనే ట్యాక్సీ డ్రైవర్ చూసి వివరాలు అడిగాడు.
తాను పూరి జగన్నాథ్ నివాసానికి వెళ్లాలని చెప్పడంతో అదే రాత్రి 1 గంట ప్రాంతంలో ట్యాక్సీలో ఆమెను జూబ్లీహిల్స్ రోడ్ నెం.31లోని పూరి ఇంటి వద్ద దిగబెట్టాడు. తెల్లవారే వరకు నిద్రాహారాలు మాని పూరీ కోసం వేచి చూసిన ఆమెకు 10 గంటల వరకు కూడా ఆయన కనిపించలేదు. అయితే రాత్రి నుంచి అనుమానాస్పదంగా యువతి అక్కడ తచ్చట్లాడుతుండటం గమనించిన సెక్యూరిటీ గార్డులు పోలీసులకు సమాచారం అందించారు. జూబ్లీహిల్స్ పోలీసులు యువతిని అదుపులోకి తీసుకొని తండ్రి హనుమాన్‌సింగ్‌కు ఫోన్ చేసి రప్పించారు. అర్ధరాత్రి యువతి ఒంటరిగా నేషనల్ హైవేపై నిల్చోవడమే కాకుండా అదే రాత్రి జూబ్లీహిల్స్‌లోని దర్శకుడి నివాసానికి రావడం పోలీసులను కంగారు పెట్టించింది.