
జవహర్‌నగర్‌లో ఇళ్ల కూల్చివేత
ముగ్గురు ఆత్మహత్యాయత్నం, ఉద్రిక్తత..
రోడ్డున పడిన వందకుపైగా కుటుంబాలు
జవహర్‌నగర్: గూడు కోల్పోయిన బాధితు లకు చివరికి గోడు మిగిలింది. కాళ్లావేళ్లా పడ్డా అధికారులు కనికరించలేదు. ఆశల సౌధా లను నేలకూల్చి నిరాశ్రయులను చేశారు. దీంతో చాలా కుటుంబాలు రోడ్డుపాలయ్యా యి. పిల్లలు, వృద్ధులకు తలదాచుకునే దిక్కు లేక ఇబ్బందిపడ్డారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించుకున్నారంటూ వందకుపైగా ఇళ్లను సోమవారం రెవెన్యూ అధికారులు జేసీబీలతో నేలమట్టం చేశారు. దీంతో బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. ముగ్గురు మహిళలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ పరిధిలోని చెన్నాపురంలో చోటుచేసుకుంది. జవహర్‌నగర్‌లోని ప్రభుత్వ స్థలంలో సుమారు వంద కుటుంబాలు కొన్నేళ్లుగా నివాసముంటున్నాయి. ప్రభుత్వం ఇటీవల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వడంతో వీరంతా దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ.. జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ, మల్కాజిగిరి ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి, అల్వాల్ ఏసీపీ రఫీక్, శామీర్‌పేట తహసీల్దార్ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ఈ ఇళ్లను జేసీబీలతో కూల్చివేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు అని కూడా చూడకుండా పోలీసులతో బయటికి నెట్టేశారు.
కళ్లెదుటే తమ ఇళ్లను కూల్చివేస్తే ఉన్నపళంగా తామెక్కడికి వెళ్లాలని బాధితులు విలపించారు. ఐదు గంటలపాటు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం వస్తే తమ బతుకులు మారుతాయనుకుంటే.. ఇప్పుడు ఇళ్లే లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గ్రామ కంఠం, ప్రజలు నివాసముంటున్న కాలనీల్లో ఏ ఇంటినీ కూల్చలేదని తహశీల్దార్ రవీందర్‌రెడ్డి చెప్పారు. ఇకపై ప్రభుత్వ స్థలంలో నూతనంగా ఏ ఇంటిని నిర్మించినా సహించబోమని ఆయన హెచ్చరించారు.