అక్రమ నిర్మాణాల కూల్చివేత
జవహర్‌నగర్‌లో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు
జవహర్‌నగర్: జవహర్‌నగర్‌లోని సర్వే నం.917, 918, 919, 920, 921, 922లలో వెలసిన అక్రమ నిర్మాణాలను, అక్రమ లేఅవుట్లను రెవెన్యూ అధికారులు తొలగించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వెలసిన లేఅవుట్లను, నిర్మాణాలను సోమవారం సాయంత్రం శామీర్‌పేట్ తహసీల్దార్ దేవుజా ఆధ్వర్యంలో జేసీబీతో కూల్చివేశారు.
ఈ సందర్భంగా దేవుజా మాట్లాడుతూ.. జవహర్‌నగర్‌లో చాలా మంది తప్పుడు పత్రాలతో ప్రభుత్వ భూములు కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని, గ్రామంలోని ఫైరింగ్ రేంజ్ సమీపంలో సర్వే నం.917, 918, 919, 920, 921, 922లలో కొందరు నకిలీ పత్రాలు సృష్టించి దాదాపు 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని ప్రత్నిస్తున్నారన్నారు. 30 ఏళ్ల క్రితం పట్టాలు ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ లేఅవుట్ తయారు చేస్తున్నారన్నారు. త్వరలోనే వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా గ్రామంలో చాలా మంది నకిలీ డాక్యుమెంట్లతో పేదప్రజలను మోసం చేస్తున్నారని, వాటిని స్వాధీనం చేసుకుని కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఆర్‌ఐ రాజు తదితరులు ఉన్నారు.