13 రోజుల్లో ఆరుగురు చిన్నారుల మృత్యువాత | Dengue Fever Danger Bells in Hyderabad | Sakshi
Sakshi News home page

డెంగీ క్యూ

Published Sat, Sep 14 2019 9:01 AM | Last Updated on Mon, Sep 23 2019 9:52 AM

Dengue Fever Danger Bells in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో/గాంధీ ఆస్పత్రి: డెంగీ దోమలు  పసిపిల్లలపై పంజా విసురుతున్నాయి. తీవ్రమైన జ్వరం, జలుబుతో బాధపడుతూ ఆస్పత్రులకు చేరుతున్న చిన్నారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిలోఫర్‌ ప్రభుత్వ నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రం సహా నగరంలోని పలు ప్రైవేటు చిన్నపిల్లల ఆస్పత్రులు సైతం జ్వర బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని పీడియాట్రిక్‌ విభాగాలన్నీ హౌస్‌ఫుల్‌ కావడంతో పడకల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. వైద్యం అటుంచి.. కనీసం పడుకునేందుకు బెడ్‌ దొరికితే చాలు అన్నట్లుగా ఉంది. గ్రేటర్‌లో పది రోజుల్లో 1767 కేసులు నమోదు కాగా, బాధితుల్లో 50 శాతం మంది 14 ఏళ్లలోపు పిల్లలే కావడం గమనార్హం. జ్వర పీడితులతో నిలోఫర్, గాంధీ పీడియాట్రిక్‌ వార్డులు నిండిపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు విధిలేని పరిస్థితిలో ప్రైవేటు ఆస్పత్రులు, క్లీనిక్స్‌ను ఆశ్రయిస్తున్నారు. తీరా అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురవుతోంది. రోజురోజుకు పెరుగుతున్న రోగుల రద్దీ దృష్ట్యా జ్వరం పూర్తిగా తగ్గకుండానే బాధితులను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసి, కొత్తవారిని అడ్మిట్‌ చేసుకోవాల్సి వస్తుందని ప్రైవేటు వైద్యులు పేర్కొంటున్నారు. 

13 రోజుల్లో ఆరుగురు చిన్నారుల మృత్యువాత
నిలోఫర్‌ ఆస్పత్రిలో జులై నుంచి ఇప్పటి వరకు సుమారు 900 డెంగీ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గాంధీ జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో కేవలం 12 రోజుల్లో 471 మంది జ్వరపీడితుల నుంచి రక్తపు నమూనాలను పరీక్షించగా వారిలో 109 మందికి డెంగీకి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆస్పత్రిలో 32 మంది డెంగీ బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 25 మంది చిన్నారులే. డెంగీతో మృతి చెందిన వారిలో ఆరుగురు చిన్నపిల్లలే ఉండటం గమనార్హం. అయితే మృతుల వివరాలను ఆస్పత్రి పాలనా యంత్రంగా గోప్యంగా ఉంచుతుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డెంగీతో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 31న ఫలక్‌నుమాకు చెందిన మహ్మద్‌ నబీల్‌(9) మృతి చెందగా, సెప్టెంబర్‌ 5న గోషా మహల్‌కు చెందిన అపూర్వ(3), 7న సింగరేణి కాలనీకి చెందిన రాకేష్‌(9), 10న గాంధీనగర్‌కు చెందిన వర్షిణి(8), 11న బడంగ్‌పేటకు చెందిన హర్షిత(4), 12న మాణికేశ్వర్‌ నగర్‌కు చెందిన నవీన్‌కుమార్‌(12) మృతి చెందారు. కేవలం 13 రోజుల వ్యవధిలోనే ఆరుగురు చిన్నారులు మృతి చెందడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

బాధితుల్లో చిన్నపిల్లలే ఎక్కువ..
పెద్దలతో పోలిస్తే చిన్నప్లిలల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. సీజన్‌ మారినప్పుడు పలువురు చిన్నారులు  జ్వరం, దగ్గు, జలుబు, నిమోనియాతో బాధ పడుతుంటారు. డెంగీ దోమలు ఎక్కువగా పగటిపూట కుడుతుంటాయి. మూడేళ్లలోపు చిన్న పిల్లలు ఎక్కువగా పగటిపూట నిద్రపోతుంటారు. కాళ్లు, చేతులు పూర్తిగా కవర్‌ చేసే దుస్తులకు బదులు ఆఫ్‌షర్ట్స్, షార్ట్స్‌ ధరిస్తుంటారు. వీరిని దోమలు కుట్టడంతో త్వరగా డెంగీ బారిన పడుతుంటారు. ఇక  స్కూలు పరిసరాల్లో పారిశుద్ధ్య లోపంతో విద్యార్థులకు జ్వరాలు వస్తున్నాయి.

డెంగీ లక్షణాలు గుర్తించడం ఇలా
ఈడిన్‌ ఈజిఫ్టై(టైగర్‌ దోమ) కుట్టడం ద్వారా డెంగీ సోకుతుంది.  
కేవలం పగటి పూట మాత్రమే కుట్టే ఈ దోమ...ప్రస్తుతం లైటింగ్‌ ఎక్కువగా ఉండటంతో రాత్రిపూట కూడా కుడుతుంది.
దోమ కుట్టిన 78 రోజులకు హఠాత్తుగా తీవ్రమైన జ్వరం రావడంతో పాటు కళ్లు కదలించలేని పరిస్థితి ఉంటుంది.
ఎముకలు, కండరాల్లో భరించ లేని నొప్పి, శరీరంపై ఎర్రటి పొక్కులు వస్తాయి.
సాధారణంగా మనిషి రక్తంలో 1.50 నుంచి 4.50 లక్షల వరకు ప్లేట్‌లెట్స్‌ ఉంటాయి.
డెంగీ బాధితుల్లో రక్త కణాలు(ప్లేట్స్‌ లెట్స్‌) సంఖ్య 40 వేలలోపు పడిపోతుంది.  
20 వేలలోపు పడిపోతే ప్రమాదం. ఆ సమయంలో తిరిగి ఎక్కించాల్సిఉంటుంది.  
లేదా అవయవాలు పనిచేయడం మానేసి, మృత్యువాతపడే ప్రమాదం ఉంది.  
లక్షణాలు గుర్తించిన వెంటనే చికిత్స తీసుకోవడం వల్ల డెంగీ నుంచి బయటపడొచ్చు.  – డాక్టర్‌ రమేష్‌ దంపూరి,చిన్నపిల్లల వైద్యనిపుణుడు

తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ
పిల్లలకు సాధ్యమైనంత వరకు కాళ్లు, చేతులు పూర్తిగా కవర్‌ చేసే దుస్తులు వేయాలి.
పిల్లలు పగలు నిద్ర పోయే సమయంలో పడకపై రక్షణ కోసం దోమ తెరలు వాడాలి.  
మస్కిటో మ్యాట్, మస్కిటో కాయిల్స్, ఆల్‌ అవుట్‌ వంటి వాటితో దోమల నియంత్రించాలి.
ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా పారిశుద్ధ్యలోపం లేకుండా చూసుకోవాలి.
ఇంట్లోని పూల కుండీలను, వాటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.  
పాఠశాల ఆవరణతో పాటు ఆ చుట్టూ పక్కల పరిసరాల్లో పారిశుద్ధ్య లోపం లేకుండా చూడాలి.
ఫాగింగ్, యాంటీ లార్వా చర్యల ద్వారా ఎప్పటికప్పుడు దోమలను నియంత్రించాలి.
ఇంట్లోని మంచినీటి ట్యాంకులపై మూతలు పెట్టడం ద్వారా డెంగీ దోమలను దరి చేరకుండా చూడొచ్చు.– డాక్టర్‌ రాజన్న,చిన్నపిల్లల వైద్యనిపుణుడు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement