సీఎం కేసీఆర్‌ను కలసిన అనంతరం బయటకు వస్తున్న ఎంపీ కవిత, సింగరేణి ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు
• నియామక విధానం పునరుద్ధరణకు కేసీఆర్ నిర్ణయం
• కార్మికులకు దీపావళి బోనస్ రూ.54 వేలు, లాభాల్లో 23 శాతం వాటా
• మొత్తంగా ఒక్కో కార్మికుడికి అందే అదనపు మొత్తం రూ.97 వేలు
సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల నియామక విధానాన్ని పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి పొందిన లాభాల్లో 23 శాతాన్ని కార్మికులకు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛంద పదవీ విరమణ పథకం(వీఆర్‌ఎస్) ద్వారా లబ్ధిపొందిన వారి కి కూడా డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని సూచించారు. సింగరేణి బొగ్గు గని కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కవిత ఆధ్వర్యంలో సింగరేణి ప్రాంతానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్మిక సంఘాల నేతలు గురువారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు.
మంత్రి హరీశ్‌రావు, సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, విప్ నల్లా ఓదెలు, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎంపీలు వినోద్, బాల్కసుమన్, సీతారాం నాయక్, మాజీ ఎంపీ జి.వివేక్, ఎమ్మెల్యేలు కనకయ్య, దివాకర్ బాబు, దుర్గం చిన్నయ్య, టీబీజీకెఎన్ నాయకులు వెంకట్రావు, కింగర్ల మల్లయ్య, రాజిరెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు, బోనస్, లాభాల్లో వాటా తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
కుటుంబంలో కోరిన వారికి ఉద్యోగం
సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులు, దినదిన గండంగా విధు లు నిర్వహిస్తూ జాతి సంపదను సృష్టిస్తున్న గని కార్మికులు సమానమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సైనికుల పట్ల ఎంత గౌరవభావం కలిగి ఉంటామో కార్మికుల పట్ల అంతే సహృదయత ప్రదర్శించాలన్నారు. ఎన్నో ఏళ్లుగా గనుల్లో బొగ్గును వెలికితీసి అనారోగ్యం పాలైన కార్మికుల కుటుంబ సంక్షేమాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలన్నారు. అనారోగ్యం పాలైన, గాయపడిన, వీఆర్‌ఎస్ తీసుకున్న కార్మికుల కుటుంబాల్లో వారు కోరిన వారికి ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. ఏళ్ల తరబడి కార్మికులు చేసిన సేవలకు గుర్తింపుగా వారు కోరిన వారికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ప్రభుత్వం, యాజ మాన్యం మానవత్వంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. సింగరేణిలో 1998లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం డిపెండెంట్ ఉద్యోగాల నియామక విధానాన్ని రద్దు చేసింది.
లాభాల్లో 23 శాతం వాటా
సింగరేణి సంస్థ 2015-16లో రూ.1,066.13 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇందులో 23 శాతం వాటాను కార్మికులకు చెల్లించాలని సీఎం ఆదేశించారు. అంటే కార్మికులకు రూ.245.21 కోట్లు ఇవ్వనున్నారు. సగటున ఒక్కో కార్మికుడికి రూ.43,078 అందుతాయి. గతేడాది కూడా ప్రభుత్వం లాభాల్లో 21 శాతం వాటాను కార్మికులకు పంచింది. అదే సమైక్య రాష్ట్రంలో అయితే 2012-13లో ఇచ్చిన 18 శాతం వాటానే అత్యధికమని సీఎంవో పేర్కొంది. ఇక సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌గా రూ.54 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. ఈ లెక్కన సింగరేణి కార్మికులకు ఈ నెలలో రూ.97 వేల చొప్పున అందనున్నాయి.
సీఎండీకి ప్రశంసలు
తెలంగాణవారికి పాలన, నిర్వహణ చేతకాదని విమర్శించిన వాళ్ల నోళ్లు మూయించేలా తెలంగాణలో పాలన సాగుతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అందుకు సింగరేణి లాభాలు ఓ ఉదాహరణ అని.. సింగరేణిని తెలంగాణ అధికారులే గాడిన పెట్టారని చెప్పారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.నర్సింగ్‌రావు సీఎండీగా ఉన్నప్పుడు సింగరేణి బాగుపడిందని.. ఇప్పుడు ఎన్.శ్రీధర్ నేతృత్వంలో గరిష్ట లాభాలు ఆర్జించిందని ప్రశంసించారు. కార్మికులు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.