వాయుగుండంగా మారనున్న అల్పపీడనం | Depression To change Low pressure | Sakshi
Sakshi News home page

వాయుగుండంగా మారనున్న అల్పపీడనం

Published Sat, Jun 20 2015 8:08 AM | Last Updated on Sun, Sep 3 2017 4:01 AM

వాయుగుండంగా మారనున్న అల్పపీడనం

వాయుగుండంగా మారనున్న అల్పపీడనం

* ఊపందుకున్న రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
* మరో రెండు మూడు రోజులపాటు విస్తారంగా వానలు

సాక్షి, విశాఖపట్నం, హైదరాబాద్: వాయవ్య బంగాళాఖాతంపై ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి ఆవల కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడనుంది. శనివారం నాటికి ఇది వాయుగుండంగా మారనుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. మరోవైపు అల్పపీడనం వల్ల నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించి, తెలంగాణలోనూ బలంగా మారాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది.

దీంతో రానున్న రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో.. అలాగే ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రాయలసీమతో పాటు మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.

అదే సమయంలో దక్షిణ కోస్తాలో పశ్చిమ దిశగా, ఉత్తర కోస్తాలో వాయవ్య దిశగా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉంటుందని, చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గడచిన 24 గంటల్లో వరంగల్ జిల్లా ఖానాపూర్‌లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మంథనిలో 13, డోర్నకల్, గూడూరు, నర్సంపేటల్లో 10 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. చెన్నారావుపేట, ఏటూరునాగారం, ఆత్మకూర్‌లో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. కొత్తగూడెం, చింతకాని, ములుగు, భూపాల్‌పల్లి, చంద్రుగొండ, నల్లబెల్లిలో 8 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. వెంకటాపూర్, ములకలపల్లి, బూర్గంపాడు, శ్యాంపేట్, బోనకల్, గుండాల, గోవర్థన్‌పేటల్లో 7 సెంటీమీటర్ల చొప్పున పడింది. ఇక ఏపీలోని అమలాపురంలో 11, అవనిగడ్డ, అంబాజీపేట, నర్సీపట్నం, విజయవాడల్లో 7, నందిగామ, నూజివీడులలో 6, గుడివాడ, తిరువూరులలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
 
ఇది రుతుపవనాల వాయుగుండం
ఈ సీజన్‌లో సముద్ర తీరానికి ఆనుకుని బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు వాయుగుండంగా బలపడతాయి. అయితే అవి భూమికి సమీపంలో ఏర్పడడం వల్ల తుపానుగా మారే అవకాశం ఉండదు. అందుకే వాతావరణ నిపుణులు వీటిని రుతుపవనాల వాయుగుండం(మాన్సూన్ డిప్రెషన్)గా వ్యవహరిస్తారు. శనివారం నాటికి ఏర్పడబోయే వాయుగుండం ఇలాంటిదేనని రిటైర్డ్ వాతావరణ శాస్త్రవేత్త ఆర్.మురళీకృష్ణ తెలిపారు. ఈ వాయుగుండం వాయవ్య దిశగా సముద్రం నుంచి భూమిపైకి వచ్చి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ వైపు పయనిస్తుందన్నారు. మరోవైపు అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వచ్చే మూడురోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి కూడా వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement