
సాక్షి, సిటీబ్యూరో/గాంధీ ఆస్పత్రి: గాంధీ ఆస్పత్రి వైరాలజీ ల్యాబ్ ఇన్‌చార్జి నాగమణిపై వేటు పడింది. ఆమెను డిప్యుటేషన్‌పై ఫీవర్ ఆస్పత్రికి బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో ఉస్మానియా మెడికల్ కాలేజీ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ జ్యోతిలక్ష్మికి బాధ్యతలు అప్పగించారు. కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణ, రిపోర్టుల జారీలో తీవ్ర జాప్యానికి తోడు, ఇటీవల ఇద్దరు రోగులకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ కావడం, ఆ తర్వాత పుణె వైరాలజీ ల్యాబ్ పరీక్షల్లో నెగిటివ్‌గా రావడంతో గాంధీ వైరాలజీ ల్యాబ్ వైద్య సిబ్బంది పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం సంబంధిత ఇన్‌చార్జిపై చర్యలకు ఉపక్రమించింది. అయితే.. ఇది సాధారణ మార్పేనని వైద్య ఆరోగ్య శాఖ కొట్టిపారేస్తోంది. ప్రొఫెసర్ నాగమణి బదిలీని నిరసిస్తూ గాంధీ వైరాలజీ ల్యాబ్‌లో విధులు నిర్వహించే పలువురు వైద్యులు, పారామెడికల్, కాంట్రాక్టు సిబ్బంది గురువారం విధులకు గైర్హాజరైనట్లు తెలిసింది. వైరాలజీ ల్యాబ్‌లో పని చేస్తున్న ఇతర పార మెడికల్ స్టాఫ్ సెలవులో వెళ్లడంతో వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో జాప్యం జరుగుతోంది.
అసలేమైందంటే?
చైనాలోని వూహాన్ నగరంలో కరోనా వైరస్ వెలుగు చూసిన అనంతరం సత్వర వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ప్రభుత్వం గాంధీ జనరల్ ఆస్పత్రి, మైక్రో బయాలజీ విభాగంలో వైరాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. గాంధీ మెడికల్ కాలేజీ మైక్రోబయోలజీ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ డాక్టర్ నాగమణిని ల్యాబ్ ఇన్‌ఛార్జిగా నియమించారు. తొలుత పుణె వైరాలజీ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించారు. అనంతరం గాంధీకి కిట్స్ సరఫరా చేసి, ఇక్కడే వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయిస్తున్నారు. గాంధీలో నిర్వహించిన పరీక్షల్లో అనుమానం ఉంటే రెండోసారి పరీక్ష నిమిత్తం ఆయా నమూనాలను పుణెకు పంపుతున్నారు. రెండు చోట్ల పాజిటివ్‌గా నిర్ధారణ అయితేనే ప్రకటిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు స్వదేశంలో వారికి క్లోజ్ కాంటాక్ట్‌లో ఉన్నవారు అనుమానంతో ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. తాజాగా రోగుల సంఖ్య భారీగా పెరిగింది. ఇటలీ నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, అపోలో ఆస్పత్రి వర్కర్‌తోపాటు మొత్తం 13 మందికి చేసిన పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌కు దగ్గరగా వచ్చినట్లు గాంధీ వైరాలజీ ల్యాబ్ తన నివేదికలో పేర్కొంది. నివేదికలతో పాటు ఆయా అనుమానితుల నుంచి రెండోసారి శాంపిల్స్ సేకరించి పుణెకు పంపగా మొత్తం నెగిటివ్ వచ్చాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షల ఫలితాలు సరిగా లేకపోవడం, పరీక్షల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతుండటం, గాంధీ రిపోర్టులకు, పుణె రిపోర్టులకు తేడా ఉండటంతో ఇన్‌చార్జిపై వేటుకు ప్రధాన కారణంగా తెలిసింది. ఇదిలా ఉండగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ జ్యోతిలక్ష్మికి వైరాలజీ ల్యాబ్‌పై పూర్తి అవగాహన లేకపోవడం, ల్యాబ్‌లోని సిబ్బంది గురువారం విధులకు గైర్హాజరు కావడంతో వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది.
రిపోర్టుల కోసం పడిగాపులు
కరోనా నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాం«ధీ ఆస్పత్రిలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, నివేదికల జారీలో తీవ్ర జాప్యం జరగడంతో అనుమానితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఐసోలేషన్ వార్డులో ఎంతసేపు ఉండాలంటూ పలువురు వైద్యులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ నెల 4న గాంధీ ఐసోలేషన్‌కు వచ్చిన అనుమానితులకు చెందిన నివేదికలు ఇప్పటి వరకు అందలేదని తెలిసింది. ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో గురువారం అడ్మిట్ అయిన 13 మందితో కలిసి మొత్తం 31 మంది రిపోర్టుల కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పటి వరకు వారి రిపోర్టులు రాకపోవడంతో ప్రస్తుతం వారందరినీ ఐసోలేషన్ వార్డులో ఉంచినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment