మరింత చిత్తశుద్ధితో పనిచేయాలి
తెలంగాణ డాక్టర్లకు డిప్యూటీ సీఎం రాజయ్య పిలుపు
హైదరాబాద్: సీమాంధ్ర వైద్యుల అహంభావం, గర్వం అణచాలంటే తెలంగాణ వైద్యులు మరింత చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి. రాజయ్య సూచించారు. సికింద్రాబాద్ గాంధీ కళాశాల మినీ ఆడిటోరియంలో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్థీషియాలజిస్ట్ తెలంగాణ శాఖను ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైద్యసేవలందించడంలో తామే నిష్ణాతులమని, తామంతా వెళ్లిపోతే తెలంగాణలో వైద్యసేవలు కుంటుపడతాయని కొందరు సీమాంధ్ర వైద్యులు అహంకారపూరితంగా మాట్లాడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కోల్పోయిన 200 మెడికల్ సీట్లను తిరిగి సాధించుకోగలిగామన్నారు. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు రూ.150 కోట్లు మంజూర య్యాయన్నారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. తెలంగాణలో వైద్యుల కొరతను అధిగమించేందుకు త్వరలోనే ప్రమోషన్లు, ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం తెలంగాణ అనస్థీషియా వైద్యుల సంఘం లోగోను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్థీషియా ప్రతినిధులు ఎస్‌ఎస్‌సీ చక్రరావు, వి.కుచేలబాబు, ఎంవీ భీమేశ్వర్, మురళీధర్‌జోషి, తెలంగాణ అనస్థీషియా వైద్యుల సంఘం అధ్యక్షుడు ఎం. చంద్రశేఖర్, కార్యదర్శి చింతల కిషన్, తెలంగాణ డీఎంఈ పుట్టా శ్రీనివాస్, ఉస్మా నియా సూపరింటెండెంట్ సీజీ రఘరాం, గాంధీ ప్రిన్సిపాల్ ఎస్. శ్రీలత, వైస్ ప్రిన్సిపాల్ మహేష్‌చంద్ర, గాంధీ అనస్థీషియా హెచ్‌ఓడీ ఉపేంద్రగౌడ్ పాల్గొన్నారు.