మరణ కారకులు!
సోనియాపై రాజయ్య వ్యాఖ్యలు... సభలో రగడ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ మరోమారు దద్దరిల్లింది. బడ్జెట్ సమావేశాల చివరి రోజైన శనివారం కూడా అధికార, విపక్ష సభ్యులు ఆరోపణలు, ప్రత్యారోపణలు... నిరసనలు, ఆందోళనలతో సభను హోరెత్తించారు. ‘ఇంతమంది తెలంగాణ బిడ్డల మరణాలకు కారణం వారే’ అని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వాటిని ఉపసంహరించుకోవాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. రాజయ్య మాత్రం తన వ్యాఖ్యలకే కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించడంతో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దాంతో స్పీకర్ మధుసూదనాచారి సభను రెండుసార్లు వాయిదా వేశారు.
బడ్జెట్ సమావేశాల చివరి రోజు కావడంతో శనివారం సభలో ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశమివ్వాలని స్పీకర్ నిర్ణయించారు. ఆ మేరకు జీరో అవర్‌లో ఒక్కో సభ్యుడికీ అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడుతూ... ‘నేను చనిపోయినా ఈ బిడ్డ(తెలంగాణ)కు జన్మనిస్తా’నని సోనియమ్మ నిర్ణయం తీసుకోవడంతోనే తెలంగాణ వచ్చిందన్నారు. పార్టీ భేదాలు మరచి సహృదయంతో ఆ తల్లిని స్మరించుకుందామని సూచించారు. దానిపై రాజయ్య స్పందిస్తూ, ‘సోనియా పట్ల కృతజ్ఞతాభావం ఉంది. తెలంగాణ ఇచ్చిన వారిని మరువం. కానీ ప్రకటన చేసిన వెంటనే తెలంగాణ ఇస్తే ఇంతమంది బిడ్డలు చనిపోయేవారు కాదు. ఇందరి చావులకు వారే కారణం’ అని వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. వాటిని వెనక్కు తీసుకుని క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గీతారెడ్డి, డీకే అరుణ, సంపత్, భాస్కర్‌రావు, వంశీచంద్‌రెడ్డి స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు.
సభలో నిరాధార ఆరోపణలు చేయకూడదని ముఖ్యమంత్రే చెబుతుంటే డిప్యూటీ సీఎం ఇలా అంటే ఎలాగని ప్రశ్నించారు. సభను స్పీకర్ 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. గంట తర్వాత సభ మళ్లీ ప్రారంభమవగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరోసారి స్పీకర్ పోడియం వద్దకు చేరి ఆందోళన కొనసాగించారు. దాంతో కాంగ్రెస్ నుంచి మాట్లాడేందుకు మల్లు భట్టి విక్రమార్కకు స్పీకర్ అవకాశమిచ్చారు. పాండవుల విజయం వెనక శ్రీకృష్ణ పరమాత్ముడున్నట్లే తెలంగాణ ఏర్పాటు వెనక సోనియా ఉన్నారని భట్టి అన్నారు. తాము ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ కూడా బడ్జెట్ పద్దు ఆమోదంలో ప్రభుత్వానికి పూర్తిగా సహకరించామని గుర్తు చేశారు.
కాంగ్రెస్, సోనియా లేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. రాజయ్య తన మాటలను ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలని కోరారు. బదులుగా కాంగ్రెస్ సభ్యులపై రాజయ్య ఎదురుదాడికి దిగారు. ‘సోనియాపై నాడూ నేడూ నాకు గౌరవముంది. తెలంగాణ ఏర్పాటు ప్రకటన తర్వాత అప్పటి ఆ ప్రాంత మంత్రులు సోనియా వద్ద గట్టిగా వాదించకుండా సీమాంధ్రులకు తలొగ్గారు. వారే గనక సోనియా వద్ద గట్టిగా ప్రయత్నిస్తే ఇందరు బిడ్డలు చనిపోయేవారు కాదు. ఆలస్యం చేయడం వల్లే మా బిడ్డలు చనిపోయారు’ అన్నారు. దాంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్లీ స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. అదే సమయంలో బీజేపీ నేత కిషన్ రెడ్డి కాంగ్రెస్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. 1,200 మంది మరణాలకు కాంగ్రెసే కారణమని ఆక్షేపించారు. ‘‘రాష్ట్రం ఇచ్చేందుకు సోనియా ఎవరు? తెలంగాణ ప్రజలే పోరాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 369 మందిని పిట్టల్ని కాల్చినట్లు కాల్చిచంపింది’’ అంటూ దుయ్యబట్టారు. అందుకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బల్లలు చరుస్తూ అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ సభ్యుల గొడవ నడుమ సభ రెండోసారి వాయిదా పడింది.
అధికారపక్షానిది దురహంకారం: భట్టి
మూడోసారి సభ సమావేశమయ్యాక భట్టి మాట్లాడారు. టీఆర్‌ఎస్ దురహంకారపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ‘‘మేమంతా కాంగ్రెస్‌లో ఉండి కూడా రాష్ట్ర ఏర్పాటు కోసం పదవులను త్యాగం చేశాం. ఎక్కడ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందేమోనని కనిపించకుండా పోయిన కిషన్‌రెడ్డికి సోనియా గురించి, తెలంగాణ ఆవిర్భావం గురించి మాట్లాడే హక్కు లేదు. సోనియాను నిందించిన బీజేపీ, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ తప్పొప్పుకొని క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యుల వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సోనియా అంటే తమకు అభిమానముందని సభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ సభ్యుల అభ్యంతరకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. వాటర్‌గ్రిడ్, చెరువుల పునరుద్ధరణ తదితరాలపై చర్చకు విపక్షాలు సహకరించాలని కోరారు. గొడవ సద్దుమణగకపోవడంతో సభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేశారు.
రాజ్యాంగ సవరణకు తీర్మానం
ఎస్సీ వర్గీకరణ నిమిత్తం రాజ్యాంగాన్ని సవరించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అన్ని పార్టీల మద్దతుతో దాన్ని ఆమోదించినట్టు స్పీకర్ ప్రకటించారు.