రాచకొండ గుట్టలను అభివృద్ధి చేస్తాం
భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్
మంచాల: రాచకొండ గుట్టలను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. సీఎం పర్యటన అనంతరం ఆయన సోమవారం రాచకొండ గుట్టల్లో మీడియాతో మాట్లాడారు. రాచకొండ గుట్టల పరిసర ప్రాంతాలు 40 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయన్నారు. 30 వేల ఎకరాలను సర్వే చేయించి పారిశ్రామిక వాడగా అభివృద్ధి పరుస్తామని ఎంపీ తెలిపారు. మొదటగా భూమిని సర్వే చేసి ప్రభుత్వ భూములను గుర్తిస్తామని చెప్పారు. అనంతరం క్లస్టర్లుగా విభజించి సోలార్ కంపెనీ, ఫార్మాసీటీ, ఫిలింసిటితో పాటు అన్ని విధాలుగా రాచకొండ గుట్టలను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
నగరానికి కూత వేటు దూరంలో ఉన్న రాచకొండ గుట్టలను చూసిన సీఎం కేసీఆర్ చాలా సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా పదకొండు నిమిషాల్లో ఇక్కడికి చేరుకున్నారని, రోడ్డు మార్గంలో కూడా 45 నిమిషాల్లో చేరుకునే విధంగా రహదారులను విస్తరించనున్నట్లు చెప్పారు. స్థానిక ప్రజలకు కూడా జీవనోపాధి కల్పించేలా చూస్తామని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెలియజేశారు. సమావేశంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్, భువనగిరి ఎమ్మెల్యే చంద్ర శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.