దేశంలోనే అత్యుత్తమం | DGP anurag sharma prices telangana police department | Sakshi
Sakshi News home page

దేశంలోనే అత్యుత్తమం

Published Wed, Jun 1 2016 2:32 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

దేశంలోనే అత్యుత్తమం

దేశంలోనే అత్యుత్తమం

రెండేళ్ల కాలంలోనే యావత్ దేశంలో తెలంగాణ పోలీసు శాఖ అత్యుత్తమ గుర్తింపు తెచ్చుకుందని రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ పేర్కొన్నారు.

తెలంగాణ పోలీసుకు గుర్తింపు వచ్చిందన్న డీజీపీ అనురాగ్‌శర్మ
శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో విజయం సాధించాం
రెండేళ్ల కాలంలో ప్రజలకు పోలీసుల పట్ల నమ్మకం పెరిగింది
టెక్నాలజీని విస్తృతంగా వినియోగంలోకి తీసుకొచ్చాం
పోలీసు అధికారులు లంచం తీసుకుంటే సస్పెండ్ చేస్తాం

సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల కాలంలోనే యావత్ దేశంలో తెలంగాణ పోలీసు శాఖ అత్యుత్తమ గుర్తింపు తెచ్చుకుందని రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకూ తావివ్వకుండా శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో పోలీసులు విజయం సాధించారని, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతోనే రాష్ట్ర పోలీసులకు దేశంలోనే పేరుప్రతిష్టలు వచ్చాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా డీజీపీ అనురాగ్‌శర్మ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శాంతిభద్రతలు అదుపులో ఉండి ప్రశాంత వాతావరణం ఉంటేనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి అభివృద్ధి చెందవచ్చన్నారు.

సీఎం కేసీఆర్ పోలీసు శాఖకు ఇస్తున్న ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా శాంతిభద్రతలను అదుపులో ఉంచగలిగామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పోలీస్ స్టేషన్ల నిర్వహణకు ప్రతి నెలా డబ్బులు విడుదల చేస్తున్నామన్నారు. పోలీసు ఎమర్జెన్సీ నంబర్ ‘100’కు భారీగా కాల్స్ వస్తున్నాయని, వాటన్నింటినీ పరిష్కరిస్తున్నామని తెలిపారు. మహిళల భద్రతకు ప్రత్యేకంగా ‘షీ’ టీమ్స్ ఏర్పాటు చేయడంతో పాటు ఇటీవల భరోసా సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసు కోసం థర్డ్‌పార్టీ చేత విచారణ జరుపుతున్నామని డీజీపీ తెలిపారు. పాస్‌పోర్టు వెరిఫికేషన్, ఠాణాల్లో ప్రజలతో పోలీసు సిబ్బంది వ్యవహరించే తీరును ఎప్పటికప్పుడు థర్డ్‌పార్టీ ద్వారా నివేదికలు తెప్పించుకుని పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.

పోలీసులెవరైనా లంచం తీసుకున్నట్లు తమ దృష్టికి వస్తే వారిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ విభాగంలో ఈ-చలాన్, బాడీ కెమెరాలను తీసుకొచ్చి పారదర్శకతను పాటిస్తున్నట్లు చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసులు చేస్తున్న ప్రత్యేక డ్రైవ్ వల్ల పరిస్థితి మెరుగుపడిందన్నారు. కార్డన్ సెర్చ్ ద్వారా నేరగాళ్లను అదుపు చేయడమే కాక.. చట్టవిరుద్ధంగా జరిగే కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశామని చెప్పారు. ఇటీవల స్టడీ టూర్‌లో భాగంగా అమెరికా, బ్రిటన్‌లో పోలీసు ఉన్నతాధికారుల పర్యటన విషయాలను వివరించారు. అక్కడ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్, అడిషనల్ డీజీలు పూర్ణచందర్‌రావు, గోపీకృష్ణ, కృష్ణప్రసాద్ తదితర సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement