
సాక్షి, హైదరాబాద్: బాలలను రకక్షించడం వృత్తిపరంగా ఎంతో సంతృప్తినిస్తుందని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. అయితే బాలకార్మికులను కాపాడటమే కాకుండా పదేళ్లపాటు వాళ్ల బాగోగులను చూసేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం ఆయన డీజీపీ కార్యాలయంలో ‘ఆపరేషన్ స్మైల్’పై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్వర్, పోలీసు ఉన్నతాధికారులు జితేందర్, స్వాతి లక్ర, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, పలు శాఖల అధికారులు, అన్ని జిల్లాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అభం శుభం తెలియని చిన్నారులు విధి లేని పరిస్థితుల్లో బాలకార్మికులుగా మారుతున్నారన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అనేది సామాజిక సేవగా అభివర్ణించారు.
వృత్తిలో భాగంగా ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఆపదలో ఉన్న బాలలను కాపాడంలో ఉండే ఆనందమే వేరన్నారు. బాల కార్మిక వ్యవస్థ, అక్రమ రవాణా చేసే వాళ్లను చట్టపరంగా కఠినంగా శిక్షించాలన్నారు. పిల్లలను అక్రమ రవాణా చేసేవాళ్లు జనవరి, జూన్ మాసాల్లో అప్రమత్తంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ రెండు నెలల్లో ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ ఉంటుందని వారు ముందే జాగ్రత్తపడతారని తెలిపారు. పోలీస్ శాఖ మిగతా శాఖలతో సమన్వయం చేసుకొని అందరూ ఒకే లక్క్ష్యంతో ముందుకెళితే ఆశయం నెరవేరుతుందని వివరించారు. కేవలం రెండు నెలలు కాకుండా ఏడాది మొత్తం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాగా బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా లేకుండా చేసేందుకు 2015 నుంచి ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది.