‘ఓపెన్‌ చాలెంజ్‌’ తేలకుండా శిక్షణా? | DGP office siege Constable | Sakshi
Sakshi News home page

‘ఓపెన్‌ చాలెంజ్‌’ తేలకుండా శిక్షణా?

Published Fri, Apr 7 2017 1:03 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

‘ఓపెన్‌ చాలెంజ్‌’ తేలకుండా శిక్షణా? - Sakshi

‘ఓపెన్‌ చాలెంజ్‌’ తేలకుండా శిక్షణా?

సాక్షి, హైదరాబాద్‌: పోలీస్‌ కానిస్టేబుల్‌ ఫలితాలపై అనుమానాలు వ్యక్తంచేస్తున్న పలువురు అభ్యర్థులు గురువారం డీజీపీ కార్యాలయ ముట్టడికి యత్నించారు. హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండటంతో పాటు ఓపెన్‌ చాలెంజ్‌ కింద 153 మంది అభ్యర్థులు సందేహాలు వ్యక్తం చేయగా, ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదన్నారు.

మార్చి 15నే క్లారిటీ ఇస్తామని ప్రకటించిన బోర్డు అధికారులు ఇప్పటికీ స్పందించడం లేదని, ఈ రెండు అంశాల్లో క్లారిటీ రాకముందే ఈ నెల 10 నుంచి కానిస్టేబుల్‌ శిక్షణ కార్యక్రమాలు ఎలా మొదలుపెడతారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. 40మంది అభ్యర్థులు డీజీపీ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం జరిగేవరకు ఎట్టి పరిస్థితుల్లో శిక్షణ కార్యక్రమాలు మొదలుపెట్టడానికి వీలులేదని, ఫలితాల్లో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

అభ్యర్థులు ఎత్తిచూపుతున్న అంశాలు..
కటాఫ్‌ మార్కుల కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం రాకపోవడం. రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసిన మెరిట్‌ లిస్ట్‌లో ర్యాంకుల కేటాయింపులో తప్పిదాలు. అసలు అభ్యర్థుల పేర్లు లేకుండా ప్రకటించడం. ఫిజికల్‌ టెస్టుల్లో కొన్ని ప్రాంతాల్లో నిర్వహణ లోపం వల్ల అభ్యర్థులు నష్టపోయారని ఆరోపణ. ఎన్‌సీసీ కోటాలో కటాఫ్‌ జనరల్‌ వారి కటాఫ్‌ కంటే ఎక్కువగా ఉండటం.

ఎన్‌సీసీ ఏ సర్టిఫికేట్‌కే మొదటి ప్రాధాన్యత ఇవ్వటం. నాన్‌లోకల్‌ అభ్యర్థులకు కూడా రిజర్వేషన్‌ వర్తింపజేయడం. డ్రైవింగ్‌ టెస్ట్‌ పెట్టకుండా లైసెన్స్‌ ఉన్న వారికి 3 నుంచి 6 మార్కులు కలపడం. ద్విచక్రవాహన లైసెన్స్‌ ఉన్నవారికి కూడా మార్కులు కలపడం. సైబరాబాద్, రంగారెడ్డిలోని పోస్టులను నోటిఫికేషన్‌లో వేర్వేరుగా చూపించి, కటాఫ్‌ మాత్రం కలిపి ఇవ్వడం. కనీస అర్హత మార్కులు రాని హోంగార్డులను ఎంపిక చేయటంపై ఆశావహ అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

15 రోజుల్లో క్లారిటీ: ఐజీ
నియామక ఫలితాలపై ఓపెన్‌ చాలెంజ్‌ ద్వారా సందేహం వ్యక్తం చేసిన 153 మంది అభ్యర్థులకు పదిహేను రోజుల్లో బోర్డు అధికారులు క్లారిటీ ఇస్తామని చెప్పినట్టు ఐజీ కల్పనా నాయక్‌ అభ్యర్థులకు సూచించారు. పదిహేను రోజుల్లో క్లారిటీ ఇచ్చిన అనంతరం ఎంత మంది సెలక్ట్‌ అయినా వారిని తదుపరి బ్యాచ్‌లో శిక్షణకు పంపిస్తామని ఐజీ చెప్పినట్టు అభ్యర్థులు మీడియాకు తెలిపారు. అప్పటివరకు తాము పోరాటం ఆపమని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement