పోలింగ్‌కు రెడీ ఏర్పాట్లు చేశాం.. ఓట్లు వేయండి | Dhana Kishor Ready For Lok Sabha Election | Sakshi
Sakshi News home page

పోలింగ్‌కు రెడీ ఏర్పాట్లు చేశాం.. ఓట్లు వేయండి

Published Wed, Apr 10 2019 8:41 AM | Last Updated on Sat, Apr 13 2019 12:31 PM

Dhana Kishor Ready For Lok Sabha Election - Sakshi

సాక్షి,సిటీబ్యూరో :  గురువారం జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ తెలిపారు. పోలింగ్‌కు అవసరమైన ఈవీఎంలు, వీవీప్యాట్లతో సహా ఎన్నికల సిబ్బంది బుధవారం రాత్రికల్లా వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుంటారన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన సదుపాయాలు, తగిన భద్రత కల్పించామన్నారు.  దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 50 శాతం పోలింగే నమోదైందని, ఈసారి ఎక్కువ మంది పోలింగ్‌లో పాల్గొని మంచి అభ్యర్థులను ఎన్నుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలింగ్‌ ఏర్పాట్లకు సంబంధించి మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సమావేశంలో ఎన్నికల విభాగం అడిషనల్‌ కమిషనర్‌ జయరాజ్‌ కెనెడీ, జాయింట్‌ కమిషనర్‌ ఎస్‌.పంకజ  పాల్గొన్నారు. 

మంగళవారం సాయంత్రం 5 గంటలతో రాజకీయ పార్టీల ప్రచార గడువు ముగిసింది. ఇక ఎవరూ ఎలాంటి ప్రచారాలు చేయడానికి వీల్లేదు.  
జిల్లాలోని 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో 3976 పోలింగ్‌ కేంద్రాల్లో ఓట్లు వేసేందుకు వచ్చే ప్రజల సదుపాయార్థం టాయిలెట్లు, తాగునీరు, ఎండ ఉండే ప్రాంతాల్లో టెంట్లు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో మజ్జిగ, నిమ్మరసం వంటి సదుపాయాలు. డీఆర్‌సీ కేంద్రాల్లో  ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లతోపాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, డాక్టర్, నర్సులతో సహా వైద్యకేంద్రం ఏర్పాటు.బుధ, గురువారాల్లో  అత్యవసర మందులతోపాటు అంబులెన్సు, ఫైరింజన్‌ కూడా ఉంటుంది. 
గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌.
అసెంబ్లీ ఎన్నికల్లో పోల్‌స్లిప్‌ చూపినా ఓటు వేసేందుకు అనుమతించారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. పోల్‌స్లిప్‌ కేవలం పోలింగ్‌ స్టేషన్‌ను గుర్తించేందుకే. పోల్‌ స్లిప్‌ ఉన్నా, లేకపోయినా ఓటరు గుర్తింపుకార్డు (ఎపిక్‌) ఉండాలి. అది లేని వారు  ఎన్నికల సంఘం గుర్తించిన 11  గుర్తింపు పత్రాల్లో (ఫొటోతో కూడిన) ఏదో ఒకదాన్ని తీసుకురావాలి.  
పోలింగ్‌ సిబ్బందికి, మైక్రో అబ్జర్వర్లకు ఇప్పటికే రెండు విడతల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాం. బుధవారం మరోమారు నిర్వహిస్తాం.పదిశాతం సిబ్బంది రిజర్వుగా ఉన్నారు.  
ఈవీఎంలు, వీవీప్యాట్లు కూడా తగినన్ని రిజర్వులో ఉన్నాయి. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే దాదాపు 20 నిమిషాల్లో చేరుకునేలా రూట్‌ ఆఫీసర్లను నియమించాం.  
దివ్యాంగుల సదుపాయార్థం 2వేల మంది వలంటీర్లు, 145 వాహనాలు వినియోగిస్తున్నాం. పోలింగ్‌ కేంద్రాల వద్ద  అవసరమైనవారికి వీల్‌చైర్లు, ర్యాంపులు ఉంటాయి. పోలింగ్‌ కేంద్రంలో సహకరించేందుకు, వాహనం నుంచి దింపేందుకు వలంటీర్లు సేవలందిస్తారు. వాదా యాప్‌ ద్వారా తమకు ఎలాంటి సదుపాయం కావాలో నమోదు చేసుకున్నవారికి సదుపాయాలందజేస్తారు. దివ్యాంగుల పోలింగ్‌ శాతాన్ని ప్రత్యేకంగా నమోదు చేస్తాం.
పోలింగ్‌ కేంద్రాల వద్ద పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన ప్రాంతాల్లో చర్యలు తీసుకునేందుకు  ఈవీడీఎం డైరెక్టర్‌ విశ్వజిత్‌ నేతృత్వంలో కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌ పనిచేస్తుంది. పోలింగ్‌ సందర్భంగా ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగినా పౌరులు సీవిజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.  
నియమావళి ఉల్లంఘనలు జరగకుండా ఫ్లైయింగ్‌స్క్వాడ్స్, స్టాటిక్‌ సర్వైలెన్స్‌ టీమ్స్, వీడియో టీమ్స్‌ తదితరమైనవి మరింత అప్రమత్తంగా విధుల్లో ఉంటాయి.
ఎన్నికలకు సంబంధించిన సమాచారం ఇచ్చేందుకు 1950 నంబర్‌ పనిచేస్తుంది. మైజీహెచ్‌ఎంసీ యాప్‌ ద్వారా, నా ఓట్‌ యాప్‌ ద్వారా పోలింగ్‌ కేంద్రం వివరాలు, తెలుసుకోవచ్చు.
పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లేవారికి  స్టేషనరీ, ఫారాలు, రిజిస్టర్లు , వివిధ రకాల కవర్లతోకూడిన పోలింగ్‌ ఆఫీసర్‌ కిట్‌తోపాటు ఎన్నికలకు సంబంధించిన  మరో 77 రకాల  సామగ్రితో సహ  రెండు బ్యాగులందజేస్తాం.  
ఈ ఎన్నికల నిర్వహణకు ప్రత్యక్షంగా పరోక్షంగా 35వేల మంది అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.  
పోలింగ్‌లో పాల్గొనాల్సిందిగా ఆస్తిపన్ను చెల్లింపుదారులు 10.20 లక్షల మంది ఆస్తిపన్ను చెల్లింపుదారులకు మంగళ, బుధ, గురువారాల్లో మూడు పర్యాయాలు ఎస్‌ఎంఎస్‌లు.  
పోలింగ్‌ సందర్భంగా గురువారం సెలవు ప్రకటించినందున ప్రజలంతా ఓట్లు వేయాలని దానకిశోర్‌ కోరారు. 

25 శాతం పోలింగ్‌ కేంద్రాల్లోవెబ్‌కాస్టింగ్‌..
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 10 శాతం పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింట్‌ ఏర్పాట్లు చేయాలి. కానీ జిల్లాలో 25 శాతం కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాట్లు చేశాం. వెయ్యిపోలింగ్‌ కేంద్రాల్లో ఈ ఏర్పాట్లు ఉంటాయి. మిగతా పోలింగ్‌ కేంద్రాల్లో స్టాటిక్‌ కెమెరాలు మాక్‌ పోలింగ్‌ నుంచి పోలింగ్‌ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేంతదాకా పనిచేస్తాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో మాక్‌ పోలింగ్‌ సందర్భంగా  తలెత్తిన ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా శిక్షణ నిచ్చాం.  
ప్రతి పోలింగ్‌ కేంద్రంలో 1+3 పోలింగ్‌ సిబ్బంది ఉంటారు. వీరిలో ఒక మహిళ ఉంటారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బురఖాలతో వచ్చిన వారిని గుర్తించేందుకు ఇబ్బంది లేకుండా ఈ చర్యలు తీసుకున్నాం.  
పోలింగ్‌ అనంతరం ఈవీఎంలు డీఆర్‌సీ కేంద్రాలకు చేర్చాక స్ట్రాంగ్‌రూమ్స్‌ వద్ద మూడంచెల పటిష్ట భద్రత. ఒక వలయంలో కేంద్ర పారామిలటరీ కంపెనీల సిబ్బంది, మరో వలయంలో రాష్ట్ర పోలీసు బలగాల సిబ్బంది, మూడో వలయంలో సిటీ పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారు. 24 గంటల నిఘాతో కూడిన ఈ భద్రత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఉంటుంది. దాదాపు 9వేల పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో పనిచేస్తున్నారు.  
గతంలో తొలగించిన దాదాపు ఏడు లక్షల ఓటర్ల ఇళ్లను పరిశీలించి, వారిలో స్థానికంగా ఉన్న 25వేల మందిని తిరిగి జాబితాలో చేర్చినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
జాబితాలో  ప్రముఖుల ఓట్లు ఉన్నట్లు ఈఆర్‌ఓలు నిర్ధారించుకున్నట్లు పేర్కొన్నారు.   
35వేల మంది సిబ్బంది ..
ఎన్నికల విధుల్లో మొత్తం 35వేల మంది సిబ్బంది పాల్గొంటుండగా, వీరిలో 18,500 మంది పోలింగ్‌ సిబ్బంది, 9వేల మంది పోలీసు సిబ్బంది, 2వేల మంది వాదా వలంటీర్లు, 3వేల మంది డ్రైవర్లు ఉన్నారు.  
మూడు అనుబంధ పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సంఘం అనుమతించకపోవడంతో మొత్తం 3976 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ జరుగుతుంది.

ఇదీ లెక్క..
పోలింగ్‌ లొకేషన్ల సంఖ్య 1583
క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 15, వర్నలబుల్‌ పోలింగ్‌ కేంద్రాలు 13
పోలింగ్‌ ప్రక్రియలో పాల్గొనే ప్రిసైడింగ్‌ అధికారులు 4,378, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు 4,378, ఓపీఓలు  8,756, మైక్రో అబ్జర్వర్లు 519
వెయ్యి సెన్సిటివ్‌  పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహణ
మొత్తం పోస్టల్‌ బ్యాలెట్ల పంపిణీ 17,581
14 డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల్లో పోస్టల్‌ బ్యాలెట్ల స్వీకరణకు ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు
ఇప్పటి వరకు  జిల్లాలో 95శాతానికి పైగా ఓటరు స్లిప్‌ల పంపిణీ పూర్తి
సీ –విజిల్‌ ద్వారా ఇప్పటి వరకు 131 ఫిర్యాదులు అందాయి. చర్యలు తీసుకున్నారు.
హైదరాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు రూ. 19.22 కోట్లు స్వాధీనం
ఎక్సైజ్‌ శాఖ ద్వారా రూ. 6.90 లక్షల విలువైలన మద్యం స్వాధీనం    

హైదరాబాద్‌ జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య    41,77,703
పోలింగ్‌ కేంద్రాలు    3,976
ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది    35,000

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement