
డిజిటల్ టీవీని సెల్‌ఫోన్‌తో ఆపరేట్ చేస్తూ విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయుడు
ఖమ్మంఅర్బన్ : నగరంలోని 8వ డివిజన్ గోపాలపురం పాఠశాల వివిధ ప్రత్యేకతలతో ఆకట్టుకుంటోంది. ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవతో ఆవరణలో మొక్కలు నాటి..వాటిని సంరక్షిస్తూ ఆహ్లాదాన్ని నింపారు. దాతల సహకారంతో డిజిటల్ తరగతుల బోధన సాగుతోంది. బడి నగరంలో ఉండడంతో వికలాంగ ఉపాధ్యాయులు సమీపంలో ఉంటుందని ప్రత్యేక విజ్ఞప్తితో ఇక్కడ పనిచేస్తుండగా..వీరు ఎంతో శ్రద్ధతో పాఠశాల రూపురేఖలనే మార్చి..శెభాష్ అనిపించుకుంటున్నారు. పాఠశాలలో 1నుండి 5వ తరగతి వరకు 69మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
ప్రధానోపాధ్యాయులు వీవీ.సత్యనారాయణ, ఉపాధ్యాయులు బండి నాగేశ్వరరావు, కె.శ్రీనివాసరావు, సీహెచ్.శివరామకృష్ణ పర్యవేక్షణలో విద్యా బోధన, పాఠశాల పర్యవేక్షణ సాగుతోంది. తరగతి గదుల గోడలన్నీ వివిధ దేశనాయకులు, విద్యావంతుల చిత్రపటాలు, వాల్ రైటింగ్‌లు, పాఠశాలకు సంబంధించిన వివరాలతో నిండి ఉంటాయి. పద్మశ్రీ వనజీవి రామయ్య చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. ఇంకుడు గుంతను రూపొందించి నీటి పొదుపు ప్రాధాన్యం వివరిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలను చూస్తే కార్పొరేట్ స్కూల్ ఏమో అనేట్లు తీర్చిదిద్దారు.
డిజిటల్ తరగతుల కోసం ఎల్‌ఈడీ టీవీ ఉంది. రోజూ డిజిటల్ పాఠాలు బోధిస్తున్నారు. పాఠశాలలో ప్రతి ఏటా విద్యార్థులకు అవసరమైన నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, షూలను అందించేందుకు ఉపాధ్యాయుడు బండి నాగేశ్వరరావు విశేషంగా కృషి చేస్తున్నారు. హరితహారంలో భాగంగా పాఠశాలలో మొక్కలు నాటడమే కాకుండా ప్రతి విద్యార్థి ఇంట్లో ఒక గులాబీ, ఒక పండ్ల, ఒక నీడనిచ్చే మొక్కలను నాటించారు.
బడిలో వాటిని కాపాడుకోవడంతో అవన్నీ పెరిగి పచ్చదనం నింపాయి. ఉపాధ్యాయుడు నాగేశ్వరరావుతోపాటు అంటెండర్‌గా తాత్కలికంగా పనిచేస్తున్న ఎస్‌కె.రషీద్ చొరవ కూడా ఎంతో ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అందరి సమష్టి కృషి వల్లనే నగరంలోనే ఉన్నా..ప్రైవేట్ స్కూల్‌కు వెళ్లకుండా ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో చదువుకుంటున్నారని స్థానికులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment