
ఆ వేంకటేశుడే రప్పించాడు
సుభాష్‌నగర్ : గ్రామంతో దాదాపుగా సంబంధాలను తెంచుకున్న తనను ఆ వేంకటేశ్వర స్వామే ఆలయ నిర్మాణానికి పురికొల్పి, తిరిగి గ్రామానికి రప్పించాడని ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు పేర్కొన్నారు. మా పల్లె చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుల ప్రోత్సాహంతో, గ్రామ ప్రజల సహకారంతో ఆలయూన్ని నిర్మించామన్నారు. శనివారం నర్సింగ్‌పల్లిలోని ఇందూరు తిరుమల ఆలయ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. భగవంతుడికి అందరూ సమానులేనని, ఒకరు తక్కువ, మరొకరు ఎక్కువ కాదని పేర్కొన్నారు.
స్వామి దర్శనార్థం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం నర్సింగ్‌పల్లిలో ఆలయూన్ని నిర్మించామన్నారు. గతేడాది మార్చి 12వ తేదీన ఆలయంలో వేంక టేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించామన్నారు. ఏడాది పూర్తవుతున్నందున బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఆలయంలో ప్రతి సోమవారం ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారని, నాలుగు జంటలకు మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన దలచినవారు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆలయం వద్ద ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందరి సహకారంతో త్వరలో వాకింగ్ ట్రాక్‌తోపాటు వృద్ధులకోసం కుటీరం నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు అంతిరెడ్డి రాజిరెడ్డి, నాగేశ్వరరావు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.