
సాక్షి, హైదరాబాద్ : రెణ్నెళ్లపాటు అనారోగ్యం బారినపడ్డ సినీ రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి కోలుకున్నారు. ఆపరేషన్ అనంతరం ఇన్‌ఫెక్షన్ సోకడంతో ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. యశోద ఆస్పత్రిలో డాక్టర్ కేఈ రావు మెరుగైన వైద్యసేవలతో ప్రాణాలతో బయటపడ్డానని వెల్లడించారు. సోషల్ మీడియాలో తన ఆరోగ్యం బాగోలేదని తప్పుగా వార్తలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘హెర్నియాకు యశోద ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగింది. అయితే, ఇన్‌ఫెక్షన్ సోకడంతో విపరీతమైన జ్వరం వస్తుండేది. డాక్టర్లు గుర్తించలేక పోయారు.
కానీ, అదే ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్ కేఈ రావుని సంప్రదించా. ఆయన చొరవ తీసుకుని.. ఇన్‌ఫెక్షన్ కారణాలను కనుక్కొని నయమయ్యేలా చేశారు. రెండు రోజుల్లోనే మామూలు మనిషినయ్యా. ఆయన నాకు పునర్జన్మనిచ్చారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నా. బహుశా సినీ రంగంలో.. రాజకీయ రంగంలో చేయాల్సిన పనులు ఇంకా ఉండి ఉంటాయి. ట్రీట్‌మెంట్ సమయంలో.. 10 కిలోల బరువు తగ్గి.. బక్కపలుచగా తయారయ్యా. తీవ్రమైన జ్వరం వస్తుండటంతో.. ఒక సమయంలో చచ్చిపోతాననుకున్నా’అన్నారు.
పదవి ఇస్తే కాదనను..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం చాలా సంతోషకరమని పోసాని అన్నారు. సీఎంగా వైఎస్ జగన్ సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని కొనియాడారు. అధికారాన్ని చేపట్టిన నాటినుంచే మేనిఫెస్టోలో ఉన్న హామీల అమలు దిశగా అడుగులేయడం గొప్ప విషయమన్నారు. ప్రాధాన్యాల్ని బట్టి పథకాలకు నిధులు కేటాయిస్తున్నారని, సినీ పరిశ్రమను కూడా ఆయన ఆదరిస్తారని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తనవంతుగా సేవలందించానని పోసాని గుర్తు చేశారు. పదవుల కోసం పార్టీకి సేవలందించలేదని స్పష్టం చేశారు. తన సేవల్ని గుర్తించి ఏదైనా పదవి ఇస్తే చేపడుతానని వెల్లడించారు. కానీ, ఫలానా పదవి కావాలని ఎప్పుడూ.. ఎవరినీ అడగనని పేర్కొన్నారు. రాజకీయంగా ఏదైనా పదవి వచ్చినప్పుడు.. ఆ బాధ్యతల్లో పూర్తిస్థాయిలో పనిచేయడానికి సినిమాలకు విరామం ఇస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment