కేంద్ర ఉద్యోగుల పథకమే మోడల్‌  | Discussion on the changes in the health scheme of state govt employees | Sakshi
Sakshi News home page

కేంద్ర ఉద్యోగుల పథకమే మోడల్‌ 

Published Sat, May 25 2019 2:16 AM | Last Updated on Sat, May 25 2019 2:16 AM

Discussion on the changes in the health scheme of state govt employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగుల ఆరోగ్యపథకంలో మార్పులు, చేర్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. వేతనాలను బట్టి వారి నుంచి కొంత వాటా వసూలు చేయాలని భావిస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పథకమే ఆదర్శం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యపథకాన్ని ఆధారం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్యసేవలు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కేడర్, జీతభత్యాలను ఆధారం చేసుకొని నెలవారీగా కొద్దిమేరకు కోత విధిస్తున్నారు. కొందరి నుంచి రూ.250 మొదలుకొని రూ.650 వరకు వారి వేతనం నుంచి మినహాయించుకుంటున్నారు. అదేవిధంగా తెలంగాణలోనూ అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వ పథకాన్ని అధ్యయనం చేసి దానికి అనుగుణంగానే ఎన్నికల కోడ్‌ పూర్తి అయిన తర్వాత తెలంగాణలోనూ కసరత్తు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.  

పథకం అమలులో ఉన్న సమస్యల వల్లే... 
తెలంగాణలో ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం(ఈజేహెచ్‌ఎస్‌) అమలవుతోంది. దాని ద్వారా నగదు రహిత వైద్యసేవలను ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో ఈ పథకం ప్రారంభమైన సమయంలో ఉద్యోగులు కూడా తమ వాటాగా కొంత చెల్లిస్తామని ముందుకు వచ్చారు. అయినా సర్కార్‌ ఉచిత సేవలు ప్రారంభించింది. అందుకోసం ఆరోగ్యశ్రీ ట్రస్టులో కలపకుండా ప్రత్యేకంగా ఈజేహెచ్‌ఎస్‌ ఏర్పాటు చేశారు. ఆరోగ్యశ్రీలో లేనటువంటి అనేక జబ్బులకు కూడా ఈజేహెచ్‌ఎస్‌లో అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద దాదాపు 5.50 లక్షల మంది ఉద్యోగులు, పింఛన్‌దారులు లబ్ధిపొందుతున్నారు. రాష్ట్రంలో 236 ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆసుపత్రులు, 96 ప్రభుత్వ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు పనిచేస్తున్నాయి.

వీటికితోడు మరో 67 డెంటల్‌ నెట్‌వర్క్‌ ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఉన్నాయి. ఆయా ఆసుపత్రుల్లో 800 రకాల వ్యాధులకు వైద్యం చేస్తారు. దాదాపు 300 నుంచి 400 రకాల వ్యాధులకు వివిధ రకాల ఆపరేషన్లు కూడా చేస్తుంటారు. అయితే, ప్రభుత్వం నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులకు వైద్యసేవలు సరిగా అందించడంలేదు. దీంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దీనిపై సర్కారుకు ఫిర్యాదులు వెళ్లాయి. తమకు ఉచిత వైద్యసేవలు అవసరంలేదని, నెలకు ఎంతోకొంత చెల్లిస్తామని సర్కారుకు తేల్చి చెప్పాయి. ఆ మేరకు లేఖ రాసిస్తామని కూడా ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి.  

నాలుగు లెవల్స్‌లో వాటా..! 
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కేడర్‌వారీగా వాటా సొమ్ము వసూలు చేస్తున్నారు. వారి వేతనం ప్రకారం మొత్తం 12 లెవల్స్‌ ఆపై ఉండ గా, వాటిని నాలుగు వర్గాలుగా విభజించారు. లెవల్‌ ఒకటి నుంచి ఐదు వరకు ఉన్న ఉద్యోగుల నుంచి నెలకు రూ.250, లెవల్‌ ఆరు ఉద్యోగుల నుంచి నెలకు రూ.450, లెవల్‌ 7 నుంచి 11 వరకు ఉన్న ఉద్యోగుల నుంచి రూ.650, లెవల్‌ 12 నుంచి ఆపై ఉద్యోగుల నుంచి నెలకు రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే నిర్దేశిత ప్రభుత్వ వెల్‌నెస్‌ వంటి ఆసుపత్రులకు వెళ్తారు. అక్కడ ప్రాథమిక పరీక్షల అనంతరం ఉన్నతస్థాయి ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తారు. వాటికి అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తోంది.

ఉద్యోగుల నుంచి వాటా సొమ్ముగా తీసుకుంటున్నందున కేంద్రంపై పెద్దగా భారం పడడంలేదని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు అంటున్నాయి. తెలంగాణలోనూ వేతనాలను బట్టి లెవల్స్‌ నిర్దారించి నాలుగు శ్లాబుల్లో ఉద్యోగుల నుంచి వారి వాటాను తీసుకునే అవకాశముంది. తెలంగాణలో తక్కువ వేతనం తీసుకుంటున్న వారి నుంచి రూ. 250 భారీ వేతనం తీసుకునే వారి నుంచి రూ.600 వరకు వసూలు చేసే అవకాశాలపై చర్చ జరుగుతోంది. తాము నెలకు రూ.500 చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నామని టీఎన్‌జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి ఇప్పటికే విన్నవించారు.  అలా ప్రభుత్వం ఏడాదికి రూ.300 నుంచి రూ. 350 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వసూలు చేసే అవకాశముంది. దీనివల్ల తమ సమస్యలు తీరుతాయని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement