సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆదివారం అసెంబ్లీలో చర్చ జరగనుంది. శాసనసభ, శాసనమండలిలో వేర్వేరుగా చర్చ కొనసాగుతుంది. ఉభయ సభలు ఆదివారం ఉదయం 10.30 గంటలకు మొదలవుతాయి. గవర్నర్ నరసింహన్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను అసెంబ్లీలో ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ప్రారంభిస్తారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి బలపరుస్తారు. అనంతరం కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ బలాలా, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చర్చను కొనసాగిస్తారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అవకాశం ఇచ్చిన మేరకు అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు మాట్లాడతారు. చివరగా ప్రభుత్వం తరఫున సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రసంగించడంతో పాటు పంచాయతీ రాజ్ ఆర్డినెన్స్‌ను బిల్లు రూపంలో సభ ఆమోదానికి ప్రవేశపెట్టనున్నారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలుపుతుంది.
మండలిలో పల్లాతో మొదలు..
ఇటు శాసనమండలిలోనూ అదేరకంగా జరగనుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను మండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మొదలుపెడతారు. మరో ఎమ్మెల్సీ బోడికుంటి వెంకటేశ్వర్లు తీర్మానాన్ని బలపరుస్తారు. తర్వాత కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ సభ్యులు ప్రసంగిస్తారు. హోంమంత్రి మహమూద్ అలీ చివరగా ప్రభుత్వం తరుఫున ప్రసంగిస్తారు. మండలి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆమోదిస్తుంది. తీర్మానం ఆమోదం అనంతరం రెండు సభలు నిరవధికంగా వాయిదా పడతాయి.
పక్షపాతం లేకుండా సభ నిర్వహిస్తా: స్పీకర్ పోచారం
శాసనసభను హుందాగా, పక్షపాతం లేకుండా, సజావుగా నడిపించే బాధ్యత తనపై ఉందని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సభ నియమ నిబంధనల ప్రకారం ప్రతిపక్ష పార్టీల సభ్యులకు మాట్లాడే స్వేచ్ఛనిస్తానని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు సూచనలు, సలహాలను స్వీకరించి సభ సంప్రదాయాలను పాటిస్తామన్నారు. స్పీకర్ పోచారం అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పూల మాల వేసి నివాళులు అర్పించారు. అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మీడియాతో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీజీ, రాజ్యాంగ రచయిత అంబేడ్కర్‌లను స్పీకర్‌గా గౌరవించుకోవడం తనకు లభించిన అదృష్టమని అన్నారు.
వచ్చే సమావేశాల్లోపు బీఏసీ...
శాసనసభ నిర్వహణ వ్యవహారాలను నిర్ణయించే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) ఏర్పాటుపై జాప్యం జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపు బీఏసీ ఏర్పాటు కానుంది. కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత ఎన్నికపై ఆ పార్టీ శనివారం సమావేశాలు ముగిసిన తర్వాత స్పీకర్‌కు లేఖ ఇచ్చింది. ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇంకా ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయలేదు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ శనివారమే ప్రమాణం చేశారు. బీఏసీలో ఉండాల్సిన వారిలో ఇద్దరు ఇంకా ప్రమాణం చేయకపోవడం, సీఎల్పీ నేతలపై శనివారం అధికారికంగా స్పష్టత రావడంతో బీఏసీ ఏర్పాటు కాలేదు. అయితే త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే మండలి బీఏసీ విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంది. మండలిలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా గల్లంతైంది. దీంతో బీఏసీలో మార్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కారణాలతో శాసనసభ, శాసనమండలి బీఏసీ సమావేశాలు జరగలేదు.
రాజాసింగ్ ప్రమాణం...
బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ (గోషామహల్) శాసనసభలో శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తన చాంబర్‌లో రాజాసింగ్‌తో ప్రమాణం చేయించారు. రాజాసింగ్ హిందీలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఇటీవల అసెంబ్లీలోని కొత్త ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంఐఎంకు చెందిన అహ్మద్‌ఖాన్ స్పీకర్ స్థానం లో ఉన్నప్పుడు తాను ప్రమాణం చేయబోనని ప్రకటించారు. పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టడంతో ప్రమాణం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment