ముగిసిన రీ పోస్టుమార్టం | Disha Case 4 Accused Second Autopsy Completed In Gandhi Hospital | Sakshi
Sakshi News home page

ముగిసిన రీ పోస్టుమార్టం

Published Tue, Dec 24 2019 3:05 AM | Last Updated on Tue, Dec 24 2019 7:53 AM

Disha Case 4 Accused Second Autopsy Completed In Gandhi Hospital - Sakshi

సోమవారం రీపోస్టుమార్టం అనంతరం ఉస్మానియా ఆస్పత్రి నుంచి బయటకు వస్తున్న ఎయిమ్స్‌ వైద్యుల బృందం

సాక్షి, హైదరాబాద్‌/బన్సీలాల్‌పేట: పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించిన దిశ నిందితుల మృతదేహాలకు హైకోర్టు ఆదేశాల ప్రకారం ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్య బృందం సోమవారం గాంధీ ఆస్పత్రిలో రీ పోస్టుమార్టం నిర్వహించింది. మహమ్మద్‌ ఆరిఫ్, జొల్లు శివ, నవీన్‌ కుమార్, చెన్నకేశవుల మృతదేహాలను అనువణువు పరిశీలించింది. డాక్టర్‌ సుధీర్‌ గుప్తా, ఆదర్శ్‌ కుమార్, అభిషేక్‌ యాదవ్, వరుణ్‌ చంద్రాలతో కూడిన వైద్య బృందం సుమారు నాలుగు గంటలపాటు ఈ ప్రక్రియ చేపట్టింది. పోలీసు బందోబస్తు, కుటుంబ సభ్యుల సమక్షం లో నిర్వహించిన పోస్టుమార్టం ప్రక్రియను వీడియోలో చిత్రీకరించింది. రీ పోస్టుమార్టం నివేదిక ను రెండు రోజుల్లో కోర్టుకు అందజేయనుంది.

గాంధీ వైద్యులను దూరంగా ఉంచి...
హైకోర్టు ఆదేశాల మేరకు ఎయిమ్స్‌ వైద్య బృందం సోమవారం ఉదయం హైదరాబాద్‌ చేరుకుంది. తొలుత గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రవణ్‌తో సమావేశమై మొదటి పోస్టుమార్టం నివేదికపై ఆరా తీసింది. అయితే ఆ నివేదిక తమ వద్ద లేదని, కోర్టుకు సమర్పించినట్లు డాక్టర్‌ శ్రవణ్‌ చెప్పిన విషయాన్నీ రికార్డు చేసుకుంది. అలాగే మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి అభ్యంతరాలను తెలుసుకుంది. పోస్టుమార్టంలో ఏ మృతదేహానికి ఎన్ని గాయాలున్నాయి? 

ఏ భాగంలో ఎన్ని బుల్లెట్లు తగిలాయి? ఇతర గాయాలేమైనా ఉన్నాయా? వంటి అంశాలను గుర్తించేందుకు ఆయా మృతదేహాలకు వైద్య బందం ఎక్సరే తీసింది. మధ్యాహ్నం 2.30 గంటలకు రీ పోస్టుమార్టం పూర్తయింది. పోస్టుమార్టం సమయంలో ఎయిమ్స్‌ వైద్యులు ఎవరినీ లోపలకు రానివ్వలేదు. పోస్టుమార్టం ప్రక్రియ అనంత రం మృతదేహాలను పోలీసులకు అప్పగించగా వారు మృ తుల బంధువులకు అప్పగించారు. ఆపై నాలుగు పోలీసు వా హనాల్లో మృతదేహాలను వారి స్వగ్రామానికి తరలించారు. 

గంటన్నరలో అంత్యక్రియలు పూర్తి...
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ‘దిశ’నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు వారి స్వస్థలమైన నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్ల, జక్లేర్‌ గ్రామాల్లో ముగిశాయి. ఎన్‌కౌంటర్‌లో మరణించిన దాదాపు 18 రోజుల తర్వాత ఇళ్లకు చేరుకున్న తమ బిడ్డల మృతదేహాలను చూసి మృతుల తల్లిందండ్రులు, కుటుంబీకులు కన్నీంటి పర్యంతమయ్యారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మృతదేహాలు వారి ఇళ్లకు చేరగా అప్పటికే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్న కుటుంబీకులు అరగంటలోపే శవయాత్రలు ప్రారంభించారు. రాత్రి ఏడున్నర గంటలకు మృతదేహాలను వారివారి పొలాల్లోనే ఖననం చేశారు. 

అవివాహితులైన శివ, నవీన్‌ ఇళ్ల ముందు పందిళ్లు వేసిన వారి కుటుంబ సభ్యులు ముందుగా తమ సంప్రదాయాల ప్రకా రం కత్తితో పెళ్లి చేశారు. తర్వాత మృతదేహాలను ట్రాక్టర్లలో వారి పొలాలకు తరలించారు. చెన్నకేశవులు మృతదేహానికి పాడె కట్టి శవయాత్ర నిర్వహించారు. శివ, నవీన్, చెన్నకేశవులును గుడిగండ్లలో... ఆరీఫ్‌ను జక్లేర్‌లో ఖననం చేశారు. చెన్నకేశవులు భార్య రేణుక తన భర్త మృతదేహాన్ని పట్టుకొని భోరున విలపించింది. ఆరీఫ్‌ ఇంటి పక్కనే ఉన్న మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేసిన కుటుంబసభ్యులు, గ్రామస్తులు.. ముస్లింల శ్మశాన వాటిక (ఖబ్రస్తాన్‌)లో ఖననం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement