ముత్తిరెడ్డి x కడియం | Dispute among deputy cm, mla | Sakshi
Sakshi News home page

ముత్తిరెడ్డి x కడియం

Published Sat, May 16 2015 4:17 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM

Dispute among deputy cm, mla

- అధికారుల నిర్లక్ష్యంపై తీర్మానం చేయూలి : జనగామ ఎమ్మెల్యే
- అక్కర లేదు : డిప్యూటీ సీఎం
- సమావేశంలో నిరసన తెలుపుతానన్న యాదగిరిరెడ్డి
- జెడ్పీలో ఇద్దరి మధ్య సంవాదం
- అధికారుల నిర్లక్ష్యంపై తీర్మానం చేయూలని యాదగిరిరెడ్డి పట్టు
- అక్కర్లేదన్న డిప్యూటీ సీఎం కడియం
- నిరసన తెలుపుతానన్న ఎమ్మెల్యే  
- మంచినీటి సమస్యపై గరం గరం
సాక్షి, హన్మకొండ :
ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అధికారుల వ్యవహార శైలిపై ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహారి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి మధ్య జిల్లా పరిషత్ సమావేశంలో సంవాదం చోటుచేసుకుంది. సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చినా అధికారులు సరైన సమయంలో స్పందించడం లేదని దీనిపై తీర్మానం చేయాలని ముత్తిరెడ్డి యాదరిగిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశంపై తీర్మానం అవసరం లేదంటూ డిప్యూటీ సీఎం సమాధానం ఇచ్చారు. దీనికి ప్రతిగా అధికారుల తీరుపై తీర్మానం చేయకుంటే అధికార పార్టీకి చెందిన శాసనసభ్యుడిని అయినా సరే తాను సభలో నిరసన వ్యక్తం చేస్తానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు. అప్పటి వరకు ప్రశాంతంగా సాగుతున్న సమావేశం దీంతో ఒక్కసారిగా వేడెక్కింది.

వివరాలిలా ఉన్నాయి. జనగామ మండలంలో వడ్లకొండ, గానుగుపాడు గ్రామా ల్లో నెలకొన్న మంచినీటి సమస్యను జనగామ జెడ్పీటీసీ విజ య లేవనెత్తారు. ఆ తర్వాత జనగామ నియోజకర్గంలో మం చినీటి సమస్య వివరించేందుకు ముత్తిరెడ్డి మైకు తీసుకోగానే కడియం అడ్డుపడుతూ ‘ముత్తిరెడ్డిని మాట్లాడమంటే గోదావరి నీళ్లు కావాలంటడు.. వార్తల్లా కాకుండా సమస్యను క్లుప్తంగా చెప్పాలి’ అని సూచించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. ‘మా నియోజకర్గంలో మంచినీటి కొరత తీర్చేందుకు కొత్త బోర్లు వేయడంతోపాటు 24 గంటల పాటు కరెంటు సరఫరా చేయాలని గత సమావేశంలో అడిగాను. రూ. 3.5 కోట్లు చెల్లిస్తే ప్రత్యేక కరెంటు లైన్లు నిర్మించి నియోజకర్గం పరిధిలో 24 గంటల కరెంటు ఇస్తామని ఎన్పీడీసీఎల్ అధికారులు హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా మా నియోజకర్గ పరిధిలో ఉన్న జెడ్పీటీసీలు, ఎంపీపీలు తమ నిధులు ఈ పథకం  కోసం తమ నిధులు కేటాయించారు.

నేను కూడా కోటి రూపాయలు ఎమ్మెల్యే నిధులు జత చేసి మొత్తం రూ 3.5 కోట్లు కూడబెట్టాం. ఇందుకు సంబంధించి వేసవికి ముందే కలెక్టర్‌కు నివేదిక సమర్పించగా, ఒక్క రోజులోనే ఈ ఫైలుకు కలెక్టర్ ఆమోదం తెలిపారు. కానీ కమిషనర్ కార్యాలయం, హైదరాబాద్‌లో ఈ ఫైల్‌ను రెండు నెలలుగా పెండింగ్‌లో పెట్టారు. మరో 15 రోజుల్లో వేసవి ముగుస్తుంది. మంచినీటి సమస్య పరిష్కారం కోసం మా ప్రజాప్రతినిధులు నోరు కట్టుకుని నిధులన్నీ కేటాయిస్తే అధికారులు రెండు నెలలుగా ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టడంతో మా సమస్య తీరలేదు’ అని అన్నారు. వేసవికాలం ముగుస్తున్నా తగు చర్యలు తీసుకోని అధికారుల తీరును నిరసిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. దీనికి తీర్మానం అవసరం లేదంటూ ఉపముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. తీర్మానం పెట్టకపోతే తాను అధికార పార్టీలో ఉన్నా సరే నిరసన తెలుపుతానంటూ ముత్తిరెడ్డి ధీటుగా స్పందిం చారు. చివరికి తీర్మానం చేస్తామంటూ అప్పటి వరకు చర్చను ముగించారు. చివరకు జిల్లా పరిషత్ తీర్మానాల్లో ముత్తిరెడ్డి డిమాండ్‌ను చేర్చకపోవడం కొసమెరుపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement