సాక్షి, యాదాద్రి : రాష్ట్రాన్ని ఆకుపచ్చగా మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారాన్ని చేపట్టింది. కోట్ల కొద్దీ మొక్కలు నాటిస్తూ వాటిని పరిరక్షించేందుకు చర్యలు చేపడుతోంది. కానీ మరోవైపు అక్రమార్కుల కక్కుర్తి రాష్ట్రాన్ని ‘నల్ల’బరుస్తోంది. బాగా ఎదిగిన వేలాది చెట్లు ‘బొగ్గు’పాలవుతున్నాయి. పొలాలు, రహదారుల వెంట ఉన్న పెద్ద పెద్ద చెట్లను కొట్టేస్తూ.. వాటి కలపను బొగ్గుగా మార్చి అమ్ముకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధి నుంచే ఏకంగా నెలనెలా వెయ్యి లారీలకుపైగా బొగ్గు ఇతర రాష్ట్రాలు, ప్రాం తాలకు రవాణా అవుతోంది. నల్లగొండ జిల్లా పరిధిలోనే పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తం గా ఎన్ని వేల చెట్లను నరికేస్తున్నారనే ఆందో ళన నెలకొంది. దీంతో పర్యావరణానికి విఘాతం కలగడంతోపాటు.. కలపను కాల్చే బొగ్గు బట్టీల కారణంగా వెలువడే పొగ, విష వాయువులతో భారీగా కాలుష్యం తలెత్తుతోంది.
ఆకుపచ్చని అభివృద్ధికి విఘాతం!
రాష్ట్రంలో అడవుల విస్తీర్ణాన్ని 24 శాతం నుంచి 33 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘తెలంగాణకు హరితహారం’కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలో ఈసారి 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారీ సంఖ్యలో నాటడంతోపాటు వారి సంరక్షణకూ చర్యలు చేపట్టింది. కానీ ఈ స్ఫూ ర్తికి విఘాతం కలిగించేలా పలు జిల్లాల పరిధిలో చెట్ల నరికివేత విచ్చలవిడిగా సాగు తోంది. బొగ్గుబట్టీల కాంట్రాక్టర్లు వాటి కలపను కాల్చి, బొగ్గుగా మార్చేసి అమ్ముకుంటున్నారు. వందల ఏళ్ల వయసున్న చెట్లు కూడా కర్రబొగ్గు కోసం కాంట్రాక్టర్ల గొడ్డలి వేటుకు నేలకూలుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల పరిధిలోని.. అటవీ భూములు, పొలాలు, రహదారుల వెంట ఉన్న చెట్లను విచ్చలవిడిగా నరికేస్తున్నారు. వాటి కలపను బొగ్గుబట్టీల్లో కాల్చి బొగ్గుగా మార్చుతున్నారు.
అధికారుల కమిటీలు ఎక్కడ?
సహజ వనరులను సంరక్షించేందుకు గతంలో రెవెన్యూ, అటవీ, పోలీసు శాఖలు, గ్రామ కమిటీలతో ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. వాల్టా చట్టానికి అనుగుణంగా సహజ వనరులను కాపాడాల్సిన బాధ్యతను ఆయా కమిటీలకు అప్పగించారు. కానీ ఈ కమిటీలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పట్టపగలే పెద్ద సంఖ్యలో చెట్లను నరికివేస్తున్నారు.
చాలా గ్రామాల్లో బొగ్గు బట్టీలు
పలు జిల్లాల్లోని చాలా గ్రామాల్లో బొగ్గు బట్టీలు నడుస్తున్నాయి. సర్కార్ తుమ్మ చెట్లను నరికి.. వాటితో బొగ్గు తయారుచేసుకునేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ సర్కారు తుమ్మతోపాటు చింత, వేప, మర్రి, రాగి, తుమ్మ చెట్ల కలపను కూడా బొగ్గుబట్టీల్లో వాడుతున్నారు. ఇలా విచ్చలవిడిగా నరికేస్తుండడంతో పచ్చదనం మాయమైపోతోంది. గనుల్లోంచి తవ్వి తీసే నేలబొగ్గు (రైల్వే బొగ్గు) కంటే తక్కువ ధరకు, సులువుగా లభిస్తుండడంతో కర్ర బొగ్గుకు భారీగా డిమాండ్ ఉంది. చెట్ల కలపను కాల్చి బొగ్గుగా మార్చాక.. సంచుల్లో నింపి హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, నెల్లూరు తదితర ప్రాంతాలకు లారీల్లో తరలిస్తున్నారు.
నెలకు వెయ్యి లారీలు!
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బొగ్గు తరలింపు కోసం నెల నెలా సగటున వెయ్యి లారీలకు అటవీ శాఖ అధికారులు అనుమతి ఇస్తున్నారు. ఒక్కో లారీలో 135 క్యూబిక్ మీటర్ల బొగ్గును తరలిస్తారు. అంటే జిల్లా పరిధి నుంచే ప్రతినెలా ఏకంగా 1,35,000 క్యూబిక్ మీటర్ల బొగ్గును తరలిస్తున్నారు. ఇందుకోసం వందలాది చెట్లు నరికి కాల్చి బొగ్గుగా మార్చుతున్నారు. ఒక్కో బస్తాలో 40 కిలోల బొగ్గు చొప్పున సుమారు 200 బస్తాలను లారీల్లో నింపి ఒడిశాకు తరలిస్తున్నారు. ఒక పర్మిట్ తీసుకుని దానిపై పదుల సంఖ్యలో లారీల్లో బొగ్గు రవాణా చేస్తున్నారు. ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలో బొగ్గు తరలిస్తున్న లారీని స్థానిక అ«టవీ శాఖ అధికారులు పట్టుకుని విచారించగా.. నల్లగొండ జిల్లా అటవీ శాఖ అధికారులు ఇచ్చిన పర్మిట్ ఉంది. జిల్లాల విభజన జరిగి ఏడాది కావస్తున్నా ఇలా ఇంకా అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి.