కోటి మొక్కలు.. కొంటె లెక్కలు
ఇదీ భాగ్యనగరంలో హరితహారం కథ
- నాటిన మొక్కల ఆలనాపాలన గాలికి..
- ఎండుతున్న మొక్కలు.. రక్షణ లేక పశువుల పాలు
- నర్సరీల్లోనూ కానరాని నిర్వహణ
- చాలాచోట్ల కలుపు మొక్కలు.. ఖాళీ బ్యాగులే
- హరితహారం మూడో దశ కింద 2.5 కోట్ల
- మొక్కలు నాటుతామంటున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: కాలుష్యం.. భాగ్యనగరాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య ఇది! నానా రకాల కాలుష్య కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్న నగరానికి పచ్చదనం అద్దేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం చేపట్టింది. కోట్లలో మొక్కలు నాటించింది. మూడోదశ హరితహారంలో ఏకంగా 2.5 కోట్ల మొక్కలు నాటుతామని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) చెబుతోంది. కానీ ఇప్పటిదాకా రెండు దశల కింద నాటిన మొక్కల ఆలనాపాలనా మాత్రం గాలికొదిలేసింది! క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను చూస్తుంటే.. అధికారుల ప్రకటనలకు, మొక్కల పెంపకానికి సంబంధమే లేదన్న సంగతి తేటతెల్లమైంది. గతేడాది మిగిలిన మొక్కలతో పాటు ఈ ఏడాది నర్సరీల్లో కొత్తగా పెంచుతున్న 1.5 కోట్ల మొక్కల నిర్వహణ తీరు అధ్వానంగా ఉంది. హెచ్‌ఎండీఏకు చెందిన 22 నర్సరీలను ‘సాక్షి’పరిశీలించింది. వాటిల్లో చాలా నర్సరీల్లో మొక్కల పెంపకం, నిర్వహణ తీరు అధ్వానంగా ఉంది.
హెచ్‌ఎండీఏ పరిధిలో పెద్దదైన జవహర్‌నగర్ నర్సరీలో 35 ఎకరాల్లో 50 లక్షల వరకు మొక్కలున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే అందులో కేవలం తొమ్మిదెకరాల్లోనే మొక్కల పరిస్థితి బాగుంది. మిగతా విస్తీర్ణంలో కలుపు మొక్కలు, ఖాళీ మట్టి బ్యాగ్‌లే దర్శనమిస్తున్నాయి. ఇక్కడ 50 లక్షల వరకు మొక్కలున్నాయని చెబుతున్నా 20 లక్షలకు మించి ఎక్కువ లేవన్న సంగతి స్పష్టమైంది. నర్సరీలో మొక్కల బ్యాగులను ఒకేచోట ఉండకుండా తరచూ మార్చాలి. మొక్కలకు నీళ్లు పట్టాలి. వేర్లు భూమిలో పాతుకుపోకుండా చూడాలి. కానీ హెచ్‌ఎండీఏకు చెందిన అటవీ విభాగం మేనేజర్లు మాత్రం ఇవేం పట్టించుకోవడం లేదు. దీంతో ఎక్కడికక్కడ మొక్కలు వాలిపోతున్నాయి. మరికొన్ని బ్యాగుల్లో కలుపు మొక్కలు ఏపుగా పెరిగాయి.
నాటిన మొక్కల్ని పట్టించుకునేవారేరి?
హరిత హారంలో మొక్కలు నాటినప్పుడు కనిపించిన ఉత్సాహం.. ఆ తర్వాత కనిపించడం లేదు. నాటిన ప్రాంతాల్లో అనేకచోట్ల మొక్కలు ఎండిపోవడమే ఇందుకు నిదర్శనం. నిమ్స్‌లో సీఎం, ఇతర వీఐపీలు నాటిన మొక్కలపై తీసుకున్న శ్రద్ధ ఇతర ప్రాంతాల్లో తీసుకోవడం లేదు. అనేకచోట్ల వీఐపీలు నాటిన మొక్కలు కూడా ఎండిపోతున్నాయి. వాటిలో మచ్చుకు కొన్ని..
– ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజున కుత్బుల్లాపూర్ సర్కిల్‌లో గాజులరామారం చౌరస్తా నుంచి జగద్గిరిగుట్ట పైపులైన్ రోడ్డులో 5 వేల మొక్కలు నాటారు. నేడు అక్కడ పట్టుమని పది మొక్కలు కూడా కనిపించడం లేదు
– చాంద్రాయణగుట్టలో కెప్టెన్ లక్ష్మీకాంత రావు నాటిన మొక్కలు ఆనవాళ్లు లేకుండా పోయాయి
– బొటానికల్ గార్డెన్ జంక్షన్ నుంచి మసీద్‌బండ వరకు రోడ్డు మధ్యలో, ఇరువైపుల మొక్కలు నాటారు. మాధవ మైల్ స్టోన్ జంక్షన్ నుంచి మసీద్‌బండ వరకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాం«ధీ మొక్కలు నాటించారు. వాటిల్లో చాలా మొక్కలు ఎండిపోయాయి.
– నల్లగండ్లలోని చెరువు కట్టపై గతేడాది హరితహరం కింద నాటిన మొక్కలను పశువులు తినేశాయి
– మంత్రి తలసాని జాతీయ రహదారి సలీంనగర్‌లో నాటిన మొక్కకు ఎలాంటి రక్షణ లేదు. శాలివాహననగర్ పార్కులో మేయర్ బొంతు రామ్మోహన్ నాటిన మొక్క బాగా మాత్రం పెరిగింది.
– పార్శిగుట్ట శ్మశానవాటికలో 1200, సీతాఫల్‌మండి ప్రభుత్వ పాఠశాల ప్రాంతంలో 723 మొక్కలు, లాలాగూడ, రైల్వే వర్క్‌షాపు, సీతాఫల్‌మండి, పార్శిగుట్ట, గంగపుత్రకాలనీ, అడ్డగుట్ట, ఈస్ట్ మారేడుపల్లి శ్మశానవాటికల్లో 1040 మొక్కలు నాటించారు. ఈ ప్రాంతాల్లో నాటిన మొక్కలు నామరూపాలు లేకుండా పోయాయి.