సాక్షి, హైదరాబాద్: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం కాంగ్రెస్ పార్టీలో అసమ్మతిని రాజేస్తోంది. పార్టీలో కీలక నేతలుగా గుర్తింపు పొందినవారు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ప్రముఖుల అనుచరులకు డీసీసీ అధ్యక్ష నియామకాల్లో పెద్దపీట వేయడంతో పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను ప్రకటించిన అనంతరం ఖమ్మం, రంగారెడ్డి, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో అసంతృప్తి జ్వాలలు బహిరంగంగానే ఎగసిపడుతున్నాయి. మిగిలిన జిల్లాల్లో కూడా డీసీసీ నియామకాల పట్ల విమర్శలు వస్తున్నాయి.
ఆ నాలుగు జిల్లాల్లో
ముఖ్యంగా ఖమ్మం, రంగారెడ్డి, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో అసమ్మతి తీవ్రంగా కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాలోడీసీసీతో పాటు సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అనుచరులకే కేటాయించడం పట్ల ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి గుర్రుమంటున్నారు. డీసీసీ ఎంపికలో సమతుల్యం లోపించిందని, ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అండదండలతో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా చల్లా నర్సింహారెడ్డిని నియమించడం పట్ల ఆ పార్టీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ అసంతృప్తిగా ఉన్నారు. ఆయన త్వరలోనే పార్టీ మారాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా ఈర్లకొమురయ్యను నియమించడంతో ఆ పదవిని ఆశించిన మరికొందరు నేతలు అసమ్మతి భేటీ నిర్వహించారు. అధిష్టానం నిర్ణయాన్ని మార్చుకోవాలని లేదంటే రాజీనామాలకూ సిద్ధమని ప్రకటించారు. కొమురయ్య మాత్రం 30 ఏళ్లుగా పార్టీకి సేవ చేసిన బలహీన వర్గాల నేతగా తనకు అవకాశం లభించిందని అంటున్నారు. నిజామాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కేశవేణు నియామకాన్ని నిరసిస్తూ కొందరు నేతలు కాంగ్రెస్‌కు గుడ్‌బై కొట్టినట్లు తెలుస్తోంది.
పీసీసీ మాజీ అధ్యక్షుడి అలక..!
జనగామ డీసీసీ అధ్యక్షుడి నియామకం విషయంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అలకబూనారని తెలుస్తోంది. తనను సంప్రదించకుండానే జంగా రాఘవరెడ్డిని ఆ పదవిలో నియమించడం పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు పూర్వ వరంగల్ జిల్లాలోని నాలుగు డీసీసీ అధ్యక్ష పదవులు ఒకే సామాజిక వర్గానికి కేటాయించడం కూడా అక్కడి కేడర్ మండి పడుతోంది.వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇటీవలే పార్టీలో చేరిన పైలట్ రోహిత్‌రెడ్డిని నియమించడం పట్ల సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో చేరిన వెంటనే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని, డీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో కూడా ప్రధాన నేతలు వారి అనుచరులను డీసీసీ అధ్యక్షులుగా నియమించుకోవడం పట్ల స్థానిక కేడర్‌లో, ఆ పదవులు ఆశించి భంగపడిన వారిలో నిరాశ కనిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ అసంతృప్తిని అలాగే వదిలేయకుండా నేతలను పిలిపించి మాట్లాడాలని, లేదంటే ఈ ప్రభావం లోక్‌సభ ఎన్నికల్లో ఖచ్చితంగా ఉంటుం దని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.
అనుచరులే అధ్యక్షులు
పార్టీలో సీనియర్లుగా గుర్తింపు పొందిన నేతలంతా డీసీసీ నియామకాల్లో చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. కామారెడ్డిలో షబ్బీర్‌అలీ శిష్యుడు కైలాశ్ శ్రీనివాస్, గద్వాలలో డీకేఅరుణ విధేయుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి, మెదక్‌కు సునీతా లక్ష్మారెడ్డి అనుచరుడు తిరుపతిరెడ్డి, సూర్యాపేటలో దామోదర్‌రెడ్డి అనుచరుడు చెవిటి వెంకన్న, నల్లగొండలో జానారెడ్డి ప్రధాన అనుచరుడు శంకర్‌నాయక్, మంచిర్యాలలో ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు సతీమణి సురేఖ, ఆసిఫాబాద్‌లో ఆయన అనుచరుడు, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నిర్మల్, ఆదిలాబాద్‌లలో డీసీసీ మాజీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి అనుచరులు రామారావు పటేల్, దేశ్‌పాండే, భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర సతీమణి జ్యోతి, సంగారెడ్డిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల, వనపర్తిలో చిన్నారెడ్డి అనుచరుడు శంకర్‌ప్రసాద్‌లను డీసీసీ అధ్యక్షులుగా నియమించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment