- అభినందించిన డీఐజీ మల్లారెడ్డి
ఖమ్మంక్రైం : ఎస్పీ షానవాజ్ ఖాసిం పర్యవేక్షణలో జిల్లా పోలీసు సిబ్బంది పనితీరు భేష్‌గా ఉందని వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం ఆయన ఖమ్మం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా సరిహద్దులో మావోయిస్టు కార్యకలాపాలు అదుపులో ఉన్నాయన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం భారీగా పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయనుందని తెలిపారు. నేరాల నియంత్రణలో పోలీస్ శాఖ పనితీరు మెరుగు పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, పెండింగ్ ఫైళ్లను పరిష్కరించాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పోలీస్ శాఖ రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. నేరాల నియంత్రణకు నగరంలో మరికొంత మందితో బ్లూకోర్ట్స్ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఫ్రెండ్లీ పోలీస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎస్పీ షానవాజ్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
మొదట పోలీస్ అతిథి గృహం చేరుకున్న డీఐజీకి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆయన ఫైళ్లు పరిశీలించారు. వాచర్ కౌంటర్‌లోని రిజిష్టర్‌ను ప్రత్యేకంగా చూశారు. సీఐ రమణమూర్తి పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. డీఐజీ వెంట ఎస్పీ షానవాజ్ ఖాసిం, అదనపు ఎస్పీ సాయికృష్ణ, డీఎస్పీ దక్షిణమూర్తి, సీఐ రమణమూర్తి, ఎస్సైలు కరుణాకర్, భాను ప్రకాష్, పూర్ణచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.