కేటాయింపు.. నామమాత్రం | District residents disappointed with budget | Sakshi
Sakshi News home page

కేటాయింపు.. నామమాత్రం

Published Thu, Nov 6 2014 2:16 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

District residents disappointed with budget

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్‌లో జిల్లాకు నామమాత్రంగా కేటాయింపులు జరిగాయి. ప్రత్యేక రాష్ట్రంలోని తొలిపద్దుపై కోటి ఆశలు పెట్టుకున్న జిల్లా వాసులకు కేటాయింపుల్లో ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బడ్జెట్‌పై జిల్లా వాసుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తుండగా.. అధికార పార్టీ నేతల్లో మాత్రం హర్షం వ్యక్తమవుతోంది. రూ.లక్ష కోట్ల బడ్జెట్ బంగారు తెలంగాణకు బాటలు వేస్తుందని టీఆర్‌ఎస్ వాళ్లు అభిప్రాయపడుతుండగా.. అంతా అంకెల గారడీ అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు.

ఈ బడ్జెట్‌లో జిల్లాకు ప్రత్యేక కేటాయింపులను పరిశీలిస్తే..
 బాసర ట్రిపుల్ ఐటీకీ రూ.119 కోట్లు..
 బాసరలోని ట్రిపుల్ ఐటి విద్యా సంస్థకు రూ.119.63 కోట్లు కేటాయించారు. కానీ ఈ సంస్థ నిర్వహణకే సగానికిపైగా నిధులు అవసరమని విద్యా సంస్థ వర్గాలు పేర్కొంటున్నాయి. అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది జీతభత్యాలు, ల్యాబ్‌లు, మెస్‌లు, విద్యుత్ బిల్లులు, నీటి వసతి వంటి అవసరాలకే సుమారు రూ.66 కోట్లు అవసరం ఉంటుంది. ఇక మిగిలేది రూ.54 కోట్లు మాత్రమే. ఈ నిధులు ఈ విద్యా సంస్థలోని అభివృద్ధికి ఏమాత్రం సరిపోవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లైబ్రరీ, ల్యాబ్‌లు, పరిపాలన విభాగాలు, ఫ్యాకల్టీ క్వార్టర్లు వంటి భవనాల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. సుమారు రూ.200 కోట్లు కేటాయిస్తారని విద్యా సంస్థ వర్గాలు భావించాయి.

 జోడేఘాట్ అభివృద్దికి రూ.25 కోట్లు..
 గిరిజన పోరాటయోధుడు కొమురం భీం వర్థంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్టోబర్ 8న జోడేఘాట్‌కు వచ్చిన సీఎం కేసీఆర్ ఈ ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్దికి రూ.25 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు మరునాడు అక్టోబర్ 9న జీవో 87 విడుదల చేశారు. అయితే ఈ నిధులను ఎస్టీ సబ్‌ప్లాన్ నుంచి విడుదల చేశారే తప్ప, ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. తాజాగా ఈ నిధుల మంజూరు అంశాన్ని బడ్జెట్‌లో ప్రస్తావించారు.
 
రోడ్లకు ప్రాధాన్యత.. జిల్లాకు అధికంగా మేలు..
 రాష్ట్ర వ్యాప్తంగా 10,693 కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది. ఈ కేటాయిం పులతో ఇతర జిల్లాలతో పోల్చితే ఆదిలాబాద్ జిల్లాకే ఎక్కువ మేలు జరి గే అవకాశాలున్నాయి. అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి రెండు లైన్ల రహదారిని, అన్ని గ్రామాలకు లింకు రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అత్యధికంగా లబ్ధిపొందేది ఆదిలాబాదే. జిల్లాలో లింకు రోడ్లు గ్రామాలు అధికంగా ఉన్నాయి. జిల్లా కేంద్రానికి రెండు లైన్ల రహదారులు లేని మండలాలు ఎక్కువగా ఉన్నాయి.

 రెండు బ్రిడ్జీలకు మోక్షం..
 జిల్లాలో ప్రధానమైన రెండు వంతెనల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని జిల్లా మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. లోకేశ్వరం మండలం నుంచి నిజామాబాద్ జిల్లాను అనుసంధానించే వంతెనతో పాటు, సిర్పూర్ నియోజకవర్గ పరిధిలోని గూడెం-అహెరి బ్రిడ్జి నిర్మాణానికి సీఎం హామీ ఇచ్చారు. ఈ రెండు వంతెనల నిర్మాణం పూర్తయితే చత్తీస్‌ఘడ్, మహరాష్ట్ర వైపు రాకపోకలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

 ఆదివాసీ మరణాలపై ప్రస్థావన
 ఆదివాసీ మరణాలపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రత్యేకంగా ప్రస్థావించారు. వాటర్ గ్రిడ్, తాగునీటి సరఫరా అంశంపై ప్రసంగిస్తున్నప్పుడు ఆదివాసీలు తాగునీటి కోసం కిలో మీటర్ల దూరం నడవాల్సి వస్తోందని ప్రస్థావించారు. వాటర్ గ్రిడ్‌తో ఆదివాసీలకు తాగునీటి కష్టాల నుంచి విముక్తి లభించనుందని అన్నారు.

 ఇవీ.. సాగునీటి ప్రాజెక్టు కేటాయింపులు
 సాగునీటి రంగానికి రూ.9,356 కోట్లు కేటాయించిన సర్కారు ‘ప్రాణహిత’ ప్రాజెక్టు కేటాయింపులను మినహాయిస్తే.. జిల్లాకు రూ.335.83 కోట్ల నిధులను బడ్జెట్‌లో కేటాయించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రాణహిత ప్రాజెక్టుకు రూ.1,790 కోట్లు కేటాయించగా, ఇందులో కొంత మొత్తాన్ని జిల్లా ప్యాకేజీలకు నిధులు వచ్చే అవకాశాలున్నాయి. ప్రాజెక్టుల వారీగా నిధులను పరిశీలిస్తే.

 ప్రాజెక్టులకు ఇలా..
 ప్రాజెక్టు            కేటాయింపులు
 ఎల్లంపల్లి          రూ.237 కోట్లు
 కడెం                రూ. 3 కోట్లు
 నీల్వాయి         రూ. 54.77 కోట్లు
 సుద్దవాగు       రూ. 2 కోట్లు
 కొమురంభీం    రూ. 25 కోట్లు
 స్వర్ణ                రూ. 10 లక్షలు
 మత్తడివాగు    రూ. 50 లక్షలు
 సాత్నాల         రూ. 10 లక్షలు
 పెద్దవాగు         రూ. 13 లక్షలు
 ర్యాలీవాగు      రూ. కోటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement