
తవ్వేస్తున్నారు..!
నల్లగొండ : జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. వాగుల్లోంచి ఇసుకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా ప్రధాన రహదారుల వరకు తీసుకెళ్తున్నారు. అక్కడినుంచి గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళలో లారీల్లో రాజధానికి తరలిస్తున్నారు. నడిరేయి జిల్లా సరిహద్దులు దాటుతున్న ఇసుక వాహనాలను పట్టుకుని కేసులు నమోదు చేయాల్సిన రెవెన్యూ, పోలీసు శాఖలు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమ వ్యాపారంతో సంబంధం ఉన్న బడా వ్యక్తులను వదిలిపెట్టి గ్రామాల్లో చిన్నా, చితక అవసరాల కోసం ఇసుకను తరలిస్తున్న వారిపై అధికారులు తమ ప్రతాపాన్ని చూపుతున్న విమర్శలున్నాయి. జిల్లాలో ప్రధానంగా ఆయకట్టు ప్రాంతాలైన మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ ప్రాంతాల్లో కృష్ణా నది తీరం వెంబడి ఇసుకను తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. పాలేరు, మూసీ వాగుల వెంబడి ఇసుక డంప్‌లు భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ కాంట్రాక్టర్లు సిండికే ట్లుగా ఏర్పడి ఇసుక దందా కొన సాగిస్తున్నారు.
నల్లగొండ : కనగల్ మండలంలోని రేగట్టె, శాబ్దులాపురం, కురంపల్లి, పగిడిమర్రి, దోరెపల్లి, పర్వతగిరి, కనగల్, బుడుమర్లపల్లి, బోయినపల్లి, బొమ్మెపల్లి, శేరిలింగోటం, తిమ్మన్నగూడెం, తేలకంటిగూడెం, జి.యడవల్లి తదితర గ్రామాల్లో ఇసుక రవాణా కొనసాగుతోంది. తిప్పర్తి మండలం మామిడాల, గోదోరిగూడెం గ్రామాల మీదుగా వేములపల్లి మండలంలోని చిరుమర్తి, ఆగ మోత్కూరు గ్రామాలలోని పాలేరు వాగు నుంచి ఇసుకను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.
నల్లగొండ మండంలోని నర్సింగ్‌భట్ల వాగు నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లి ఎస్‌ఎల్‌బీసీ కాల్వకట్ల వెంట, దమన్నగూడెం గ్రామంలో డంపులు ఏర్పాటు చేసి లారీల ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. మునుగోడు : మునుగోడువాగు, కొరటికల్‌వాగుల నుంచి రాత్రిపూట ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మునుగోడువాగులో ఇసుకను రాత్రిపూట ట్రాక్టర్లలో నింపి, చిట్యాల, పుట్టపాక, నారాయణపురం, కొరటికల్‌వాగు నుంచి చండూరు, కనగల్ ఏరియాలకు తరలిస్తున్నారు. అక్కడ డంప్ చేసి లారీల్లో ఎత్తి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. చౌటుప్పల్ మండలంలోని తంగడపల్లి, నాగారం చెరువుల్లో ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వుతున్నారు. సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేలువాగు నుంచి కూడా ఇసుక రవాణా అవుతోంది.
మిర్యాలగూడ : మిర్యాలగూడ, వేములపల్లి మండలాల్లో పాలేరు వాగు నుంచి ఇసుక రవాణా సాగుతోంది. దామరచర్ల మండలంలో మూసీ, అన్నమేరు, తుంగపాడు బంధం నుంచి ఇసుక రవాణా అవుతోంది. మిర్యాలగూడ, వేములపల్లి మండలం నుంచి మిర్యాలగూడకు రోజుకు సుమారుగా 80 ట్రాక్టర్ల ద్వారా రవాణా అవుతోంది. వేములపల్లి మండలంలో పాలేరు వాగు లోనే జల్లెడతో ఇసుక పట్టి విక్రయిస్తున్నార. దామరచర్ల మండలంలోని వీర్లపాలెం, కేశవపురం, తాల్లవీరప్పగూడెం పరిసర ప్రాంతాలలో ఇసుక డంపులు ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.
భువనగిరి: వలిగొండ, బీబీనగర్ మండలాల్లో మూసీ వెంట ఇసుకను తరలిస్తున్నారు. బీబీనగర్ మండలంలోని జమీలాపేట, జియాపల్లి, నెమరగోములలో 10 కిపైగా ఇసుక ఫిల్టర్లు నడుస్తున్నాయి. పోలీస్, రెవెన్యూ అధికారుల అండదండలతో ట్రాక్టర్‌లు, లారీల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. భువనగిరి, బస్వాపురం చెరువులు, ముగ్దుపల్లి, ముత్తిరెడ్డిగూడెం, హన్మాపురం, రామకృష్ణాపురం, గచ్చుబావిల వాగులు వంకల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.
హుజూర్‌నగర్ : నేరేడుచర్ల మండలంలోని దాచారం, ఎల్లాపురం, సోమారం,చిల్లేపల్లి, మూసీఒడ్డుసింగారం, శూన్యంపాడ్ వద్ద మూసీ నుంచి గరిడేపల్లి, నేరేడుచర్ల, మిర్యాలగూడ మండలాలకు ఇసుక రవాణా చేస్తున్నారు. మేళ్లచెరువు మండలంలోని క్రిష్ణపట్టె గ్రామాలైన చింత్రియాల, రేబల్లే, కిష్టాపురం,అడ్లూరు, కృష్ణాపరీవాహకప్రాంతంలో వివిధ పార్టీలకు చెందిన కొంత మంది నాయకులు సిండికేట్‌గా ఏర్పడి కృష్ణా నది నుంచి అక్రమంగా ఇసుక తోడి డంపింగ్ చేసి హైదరాబాద్, విజయవాడ,కోదాడ తదితర పట్టణాలకు ఎగుమతి చేస్తున్నారు.
నకిరేకల్ : నకిరేకల్ మండలంలోని చందుపట్ల వాగు నుంచి ప్రతి రోజూ వందలాది ట్రాక్టర్‌ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. చందుపట్ల గ్రామానికి చెందిన పలువురు గ్రూపులుగా ఏర్పడి ఇసుకను అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా సమీప ప్రాంతంలో డంపింగ్ చేసి అక్కడి నుంచి హైదరాబాద్‌కు లారీల ద్వారా తరలిస్తున్నారు. కేతేపల్లి మండలంలోని మూసీ పరీవాహక ప్రాంతాలైన కాసనగోడు, కేతేపల్లి, ఉప్పలపహాడ్, తుంగతుర్తి, కొప్పోలు, బీమారం గ్రామాలలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మూసీ, పాలేరు వాగుల నుంచి ఇసుకను తోడి ట్రాక్టర్ల ద్వారా ఆయా గ్రామాలలోని నిర్మానుష్యప్రాంతాలలో గుట్టలు గుట్టలుగా నిల్వ చేస్తున్నారు. కట్టంగూర్ మండలంలోని పెద్దోనిబావి, మల్లారం, కట్టంగూర్, పరడ, నారెగూడెం, మునుకుంట్ల గ్రామాల్లో రాత్రి వేళల్లో లారీల్లో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.
సూర్యాపేట : పెన్‌పహాడ్, సూర్యాపేటరూరల్, ఆత్మకూర్ (ఎస్) మండలాల్లో జోరుగా ఇసుక అక్రమ రవాణా కోనసాగుతోంది. సూర్యాపేట మండలంలోని కాసరబాద, టేకుమట్ల, కే.టీ అన్నారం, రాయినిగూడెం గ్రామాల సమీపంలోని మూసీ వాగుల నుంచి జోరుగా సూర్యాపేట పట్టణానికి ట్రాక్టర్లలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. కోదాడ : కోదాడ, నడిగూడెం, మోతె మండలాల్లో ఇసుక వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. ఈ మూడు మండలాల్లోని పాలేరువాగు నుంచి ట్రాక్టర్ల ద్వార తీసుకొని వచ్చి కోదాడలో విక్రయిస్తున్నా రు. మేళ్లచెరువు మండలంలోని కృష్ణా నది నుంచి కూడా కోదాడకు ఇసుక రవాణా అవుతోంది.