నువ్వా.. నేనా?
రామగుండం మేయర్ పీఠంపై కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు గురిపెట్టాయి. రెండు పార్టీలకు సమాన బలం ఉండడంతో టీఆర్‌ఎస్‌లోని అసంతృప్తులను బుజ్జగించి అధికారాన్ని ‘హస్త’గతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచిస్తోంది. తమ వారు పట్టుజారిపోకుండా టీఆర్‌ఎస్ జాగ్రత్త పడుతోంది. ఇండిపెండెంట్లే ఇక్కడ కీలకం కావడంతో జంప్ జిలానీలతో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది.
గోదావరిఖని : రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో 19 కాంగ్రెస్, 14 టీఆర్‌ఎస్, రెండు బీజేపీ, 15 స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. వీరిలో కాంగ్రెస్‌కు ఆరుగురు స్వతంత్రులు, టీఆర్‌ఎస్‌కు ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లతోపాటు తొమ్మిది మంది స్వతంత్రులు మద్దతు ప్రకటించారు. దీంతో రెండు పార్టీలు 25 స్థానాలతో సమానంగా నిలిచాయి. ఫలితాలు వెలువడ్డ తర్వాత మే 14 నుంచి క్యాంపులకు వెళ్లిన ఆయా పార్టీల కార్పొరేటర్లు, స్వతంత్రులు వివిధ ప్రాంతాలు తిరగగా... ఖర్చు తడిసి మోపెడవడంతో తిరిగివచ్చారు. తాజాగా మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడడంతో శుక్రవారం తిరిగి రెండు పార్టీల కార్పొరేటర్లు, వారి మద్దతుదారులు క్యాంపులకు తరలివెళ్లారు. జూలై 3న ఎన్నిక ఉండగా 2వ తేదీకల్లా ఇక్కడకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. ఆ రోజు కాంగ్రెస్ పెద్దల సమక్షంలో మేయర్, డెప్యూటీ మేయర్ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలుండగా... 3న 11 గంటలకు నేరుగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు. టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతున్న ఇద్దరు బీజేపీ, తొమ్మిది మంది స్వతంత్రులతోపాటు టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు సైతం శిబిరానికి తరలివెళ్లారు. కొందరు క్యాంపునకు రాకపోవడంతో వారికోసం పార్టీ నాయకులు అన్వేషణ మొదలుపెట్టారు.
కాంగ్రెస్‌లో ధీమా
కాంగ్రెస్‌కు 19 మంది సొంత కార్పొరేటర్లతోపాటు ఆరుగురు స్వతంత్రులు మద్దతు తెలపడంతో మద్దతు సంఖ్య 25కు చేరింది. మాజీ ఎంపీ వివేక్ టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు తన అనుచరులకు టీఆర్‌ఎస్ కార్పొరేటర్ టికెట్లు ఇప్పించుకోగా వారిలో ఇద్దరు గెలుపొందారు. వివేక్ ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరగా ఇద్దరు అనుచరులు కూడా ఆయనతోనే ఉన్నారు. వీరిద్దరూ తమకే మద్దతు ఇస్తారనే ఆశతో కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది. వీరు టీఆర్‌ఎస్ శిబిరానికి రాకపోవడంతో కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచే అవకాశాలున్నట్లు స్పష్టమవుతోంది. ఇదే జరిగితే కాంగ్రెస్ బలం 27కు చేరుతుంది.
విప్‌పై టీఆర్‌ఎస్ ఆశలు
50 మంది కార్పొరేటర్లతోపాటు ఎంపీ, ఎమ్మెల్యేలకు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు ఉండడంతో మొత్తం 52 స్థానాలవుతాయి. మేజిక్ ఫిగర్ 27 మంది మద్దతు సాధించినవారు మేయర్‌గా ఎన్నికవుతారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు చెరి 25 మంది కార్పొరేటర్లతో సమంగా నిలవగా ఎంపీ, ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ వారే కావడంతో మేజిక్ ఫిగర్ 27 అందుకుంటామనే ధీమాలో టీఆర్‌ఎస్ వారున్నారు. మేయర్ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ కాగా టీఆర్‌ఎస్ నుంచి సరైన మేయర్ అభ్యర్థులు లేకపోవడంతో స్వతంత్రుడికి ఆ పదవి ఇచ్చేందుకు నాయకత్వం సుముఖత వ్యక్తం చేసింది.
దీంతో పార్టీ గుర్తుపై గెలిచినవారిని కాదని స్వతంత్రులకు పట్టం ఎలా కడతారని ఇద్దరు కార్పొరేటర్లు మొదటినుంచీ అసంతృప్తితో ఉన్నారు. డెప్యూటీ మేయర్ పదవి ఆశించి... దక్కే అవకాశం లేదనుకున్నవారు సైతం నిరాశతో ఉన్నారు. వీరంతా వ్యతిరేకంగా పనిచేస్తే... ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లు కలిసినా గెలిచే పరిస్థితి ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో తమ పార్టీ కార్పొరేటర్లకు విప్ జారీచేసేందుకు టీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది. విప్‌ను ఉల్లంఘించి ఇతర పార్టీలకు మద్దతు తెలిపితే పదవి కోల్పోయే ప్రమాదముండడంతో... విప్ ధిక్కరించే అవకాశముండదని ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. స్వతంత్రులతోపాటు ఆయా పార్టీల్లో ఉన్న జంప్‌జిలానీలతో మేయర్ ఎన్నిక సీన్ మారే అవకాశముంది.
మద్దతుకోసం పాకులాట
రామగుండం : కార్పొరేటర్ల మద్దతు కోసం టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. టీఆర్‌ఎస్ నుంచి మేయర్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న స్వతంత్ర కార్పొరేటర్ కొంకటి సత్యనారాయణతోపాటు ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ 50వ డివిజన్ కార్పొరేటర్ షమీమ్ సుల్తానాను కలిసి మద్దతు కోరగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. వీరు వెళ్లిన కాసేపటికే కాంగ్రెస్ మేయర్ అభ్యర్థులు మహంకాళి స్వామి, దొంతుల లింగం వేర్వేరుగా షమీమ్ సుల్తానాను కలిసి మద్దతు కోరారు.