TRS parties
-
కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ
నల్లగొండ : జిల్లా ప్రణాళిక కమిటీలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జెడ్పీటీసీ కోటా విషయంలో ఓ అవగాహనకు వచ్చిన కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు కౌన్సిలర్లకు సంబంధించి బీసీ, ఓసీ కోటా విషయంలో మాత్రం రాజీ పడకపోవడంతో బుధవారం ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలోఅధికార టీఆర్ఎస్ వ్యూహంతో బీజేపీ రెండు స్థానాలను దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ నాయకులు కంగుతిన్నారు. జిల్లా ప్రణాళిక కమిటీలో మొత్తం 30 మంది సభ్యులకుగాను కలెక్టర్, జెడ్పీ చైర్మన్ మినహాయిస్తే మరో నలుగురు సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. మిగిలిన 24 స్థానాలకు ఎన్నిక నిర్వహించారు. వాస్తవానికి జిల్లా పరిషత్‌లో కాంగ్రెస్‌కు 43, టీఆర్ఎస్కు 13 మంది జెడ్పీటీసీలు ఉన్నారు. అయితే అధికార పార్టీతో పరస్పర సహాయ సహాకారాలు ఉండాలన్న ఉద్దేశంతో జెడ్పీ చైర్మన్ చొరవ తీసుకుని జిల్లా మంత్రితో సంప్రదింపులు జరిపి ఓ అవగాహనకు వచ్చారు. ఈ మేరకు జెడ్పీటీసీ కోటాలో 20 స్థానాలకు కాంగ్రెస్ 13, టీఆర్ఎస్ 7 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఇదే పద్ధతిలో కౌన్సిలర్ల కోటాలో కూడా 4 స్థానాలకు చెరో రెండు స్థానాలు తీసుకోవాల్సి ఉంది. కాగా వీటిలో రెండు స్థానాలు కాంగ్రెస్, టీఆర్ఎస్ ఏకగ్రీవ మయ్యాయి. కానీ బీసీ, ఓసీ కోటాకు వచ్చే సరికి రెండు పార్టీల మధ్య పోటీ ఏర్పడింది. బీసీ కోటాలో నల్లగొండ నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీలో ఉన్న మైనార్టీ కౌన్సిలర్‌కు ఇవ్వాలని ఆ పార్టీ పట్టుబట్టింది. ఓసీ కోటాలో ఉన్న స్థానాన్ని దేవరకొండ నుంచి పోటీలో ఉన్న చైర్మన్ తరఫు అభ్యర్థి (ఎస్టీ)కి ఇవ్వాలని ని ర్ణయించుకున్నారు. కానీ నల్లగొండ స్థానాన్ని టీఆర్ఎస్కు ఇవ్వడానికి వీల్లేదని స్థానిక కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థిని నామినేషన్ ఉపసంహరించుకు నేలా చేశారు. అదే సమయంలో దేవరకొండ నుంచి పోటీలో ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్ కూడా నామినేషన్ ఉపసంహరించుకోవాలని టీఆర్ఎస్ పట్టుబట్టినా కాంగ్రెస్ నాయకులు అందుకు నిరాకరించారు. దీంతో టీఆర్ఎస్ నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి వచ్చింది. ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం కాకుండా జిల్లా మంత్రి, నల్లగొండ టీఆర్ఎస్ నాయకులు ఏకమై చక్రం తిప్పారు. కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ కౌన్సిలర్లు బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఈ ఎన్నికలో సూర్యాపేట, భువనగిరి, నల్లగొండలలో ఉన్న టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ కౌన్సిలర్లు అంతా ఏకమై కాంగ్రెస్ కౌన్సిలర్లను ఓడించారు. దీంతో ఆ రెండు స్థానాలు బీజేపీ వశమయ్యాయి. భువనగిరి, నల్లగొండకు చెందిన బీజేపీ కౌన్సిలర్లు ఎం.దశరథ,రావుల శ్రీనివాస్‌రెడ్డి ఘన విజయం సాధించారు. ‘చే’జారిన విజయం జిల్లా పరిషత్‌లో కాంగ్రెస్‌పార్టీకి మెజార్టీ సభ్యులు ఉన్నందున టీఆర్ఎస్తో అవగాహన లేకుండా నేరుగా ఎన్నికకు వెళ్లినా.. డీపీసీలో కాంగ్రెస్ పైచేయి సాధించి ఉండేది. మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో కూడా కాంగ్రెస్‌కు మెజార్టీ సభ్యులే ఉన్నారు. కానీ టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌తో దోస్తీ కట్టినట్టుగానే కనిపించినప్పటికీ చిట్టచివరకు మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో కాంగ్రెస్‌పార్టీ ఖంగుతినాల్సి వచ్చింది. దీంతో జిల్లా ప్రణాళిక కమిటీలో కాంగ్రెస్‌కు దీటుగానే టీఆర్ఎస్ స్థానం సంపాదించినట్లైంది. నామినేటేడ్ సభ్యులతో కలిపి మొత్తం 28 స్థానాలకు గాను కాంగ్రెస్ 15, టీఆర్ఎస్, బీజేపీలు కలిపి 13 స్థానాలు సొంతం చేసుకున్నాయి. జెడ్పీ చరిత్రలో డీపీసీ కమిటీ కి ఎన్నిక జరగడం ఇదే ప్రథమం. అయితే కమిటీలో మూడు పార్టీలు బలంగా ఉండటంతో రాబోయే కాలంలో జెడ్పీ రాజకీయం మరింత రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. -
ఇ-రిక్షాలకు లోక్‌సభలో భారీ మద్దతు
న్యూఢిల్లీ: బ్యాటరీతో నడిచే ఇ-రిక్షాల క్రమబద్ధీకరణ, వాటి డ్రైవర్లకు లెసైన్సులు జారీ చేసే బిల్లుకు లోక్‌సభలో బుధవారం అన్ని పక్షాల నుంచి మద్దతు లభించింది. అయితే కొందరు సభ్యులు ఆ బిల్లును మరింత విస్తృత సంప్రదింపుల కోసం స్థాయీ సంఘానికి పంపాలని కూడా డిమాండ్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టితోనే బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెడుతోందని విమర్శించిన సభ్యులూ లేకపోలేదు. మోటారు వాహనాల సవరణ బిల్లు,2014ను రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇ-రిక్షాలను నడిపేవారు, వాటిలో ప్రయాణించేవారు పేదలేనని అన్నారు. ఇటీవలి కోర్టు తీర్పు కారణంగా, ఇ-రిక్షాలపై ఆధారపడి జీవిస్తున్న రెండు లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారని అన్నారు. ఈ బిల్లును ఎంత త్వరగా ఆమోదిస్తే వారికి అంత త్వరగా మేలు చేసిన వారమవుతామని మంత్రి చెప్పారు. అధికార ఎన్డీయే పక్ష పార్టీలతో పాటు అన్నా డీఎంకే, టీఎంసీ, టీఆర్ఎస్ పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి. ఇ-రిక్షా డ్రైవర్ల కుటుంబాలపై అంత ప్రేమ ఉంటే ఈ బిల్లును గత సమావేశాల్లోనే ఎందుకు ప్రవేశపెట్టలేదని కాంగ్రెస్ సభ్యుడు రాజీవ్ శంకర్రావు సతవ్ ప్రశ్నించారు. ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈ సమావేశాలను ఎంచుకున్నారని విమర్శించారు. ఢిల్లీ రోడ్లు ఇప్పటికే ఇరుకుగా మారిపోయాయని, మరింత అధునాతన రవాణా విధానం కోసం ప్రభుత్వం ప్రయత్నించి ఉండాల్సిందని బీజేడీకి చెందిన తథాగత సత్పతి అన్నారు. ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి నివేదించాలని సతవ్, సత్పతి డిమాండ్ చేశారు. ఈ బిల్లుపై టీఆర్ఎస్కు చెందిన వినోద్‌కుమార్ బోయినపల్లి, టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. మోటారు వాహనాలుగా ఇ-రిక్షాలు బ్యాటరీతో నడిచే ఇ-రిక్షాలను మోటారు వాహనాలుగా పరిగణించాలని ఓ అధ్యయనం సిఫార్సు చేసింది. రోడ్లపై కొన్ని ఇ-రిక్షాలను పరీక్షించగా, వాటి మోటారు శక్తి 250 వాట్లకన్నా అధికంగా ఉందని, కొన్నింటి వేగం గంటకు 25 కిలోమీటర్లు దాటిందని ఆ అధ్యయనం వెల్లడించింది. ఈ ఫలితాల ఆధారంగా ఇ-రిక్షాలను మోటారు వాహనాలుగా పరిగణించాలని వాటిపై అధ్యయనం చేసిన ‘ది ఎనర్సీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ (తేరీ) సిఫార్సు చేసింది. తమ అధ్యయనంలో భాగంగా 53 ఇ-రిక్షాలను పరీక్షించామని తేరీ తెలిపింది. -
నువ్వా.. నేనా?
రామగుండం మేయర్ పీఠంపై కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు గురిపెట్టాయి. రెండు పార్టీలకు సమాన బలం ఉండడంతో టీఆర్ఎస్లోని అసంతృప్తులను బుజ్జగించి అధికారాన్ని ‘హస్త’గతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచిస్తోంది. తమ వారు పట్టుజారిపోకుండా టీఆర్ఎస్ జాగ్రత్త పడుతోంది. ఇండిపెండెంట్లే ఇక్కడ కీలకం కావడంతో జంప్ జిలానీలతో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. గోదావరిఖని : రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో 19 కాంగ్రెస్, 14 టీఆర్ఎస్, రెండు బీజేపీ, 15 స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. వీరిలో కాంగ్రెస్‌కు ఆరుగురు స్వతంత్రులు, టీఆర్ఎస్కు ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లతోపాటు తొమ్మిది మంది స్వతంత్రులు మద్దతు ప్రకటించారు. దీంతో రెండు పార్టీలు 25 స్థానాలతో సమానంగా నిలిచాయి. ఫలితాలు వెలువడ్డ తర్వాత మే 14 నుంచి క్యాంపులకు వెళ్లిన ఆయా పార్టీల కార్పొరేటర్లు, స్వతంత్రులు వివిధ ప్రాంతాలు తిరగగా... ఖర్చు తడిసి మోపెడవడంతో తిరిగివచ్చారు. తాజాగా మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడడంతో శుక్రవారం తిరిగి రెండు పార్టీల కార్పొరేటర్లు, వారి మద్దతుదారులు క్యాంపులకు తరలివెళ్లారు. జూలై 3న ఎన్నిక ఉండగా 2వ తేదీకల్లా ఇక్కడకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. ఆ రోజు కాంగ్రెస్ పెద్దల సమక్షంలో మేయర్, డెప్యూటీ మేయర్ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలుండగా... 3న 11 గంటలకు నేరుగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు. టీఆర్ఎస్కు మద్దతు తెలుపుతున్న ఇద్దరు బీజేపీ, తొమ్మిది మంది స్వతంత్రులతోపాటు టీఆర్ఎస్ కార్పొరేటర్లు సైతం శిబిరానికి తరలివెళ్లారు. కొందరు క్యాంపునకు రాకపోవడంతో వారికోసం పార్టీ నాయకులు అన్వేషణ మొదలుపెట్టారు. కాంగ్రెస్‌లో ధీమా కాంగ్రెస్‌కు 19 మంది సొంత కార్పొరేటర్లతోపాటు ఆరుగురు స్వతంత్రులు మద్దతు తెలపడంతో మద్దతు సంఖ్య 25కు చేరింది. మాజీ ఎంపీ వివేక్ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు తన అనుచరులకు టీఆర్ఎస్ కార్పొరేటర్ టికెట్లు ఇప్పించుకోగా వారిలో ఇద్దరు గెలుపొందారు. వివేక్ ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరగా ఇద్దరు అనుచరులు కూడా ఆయనతోనే ఉన్నారు. వీరిద్దరూ తమకే మద్దతు ఇస్తారనే ఆశతో కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది. వీరు టీఆర్ఎస్ శిబిరానికి రాకపోవడంతో కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచే అవకాశాలున్నట్లు స్పష్టమవుతోంది. ఇదే జరిగితే కాంగ్రెస్ బలం 27కు చేరుతుంది. విప్‌పై టీఆర్ఎస్ ఆశలు 50 మంది కార్పొరేటర్లతోపాటు ఎంపీ, ఎమ్మెల్యేలకు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు ఉండడంతో మొత్తం 52 స్థానాలవుతాయి. మేజిక్ ఫిగర్ 27 మంది మద్దతు సాధించినవారు మేయర్‌గా ఎన్నికవుతారు. కాంగ్రెస్, టీఆర్ఎస్లు చెరి 25 మంది కార్పొరేటర్లతో సమంగా నిలవగా ఎంపీ, ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వారే కావడంతో మేజిక్ ఫిగర్ 27 అందుకుంటామనే ధీమాలో టీఆర్ఎస్ వారున్నారు. మేయర్ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ కాగా టీఆర్ఎస్ నుంచి సరైన మేయర్ అభ్యర్థులు లేకపోవడంతో స్వతంత్రుడికి ఆ పదవి ఇచ్చేందుకు నాయకత్వం సుముఖత వ్యక్తం చేసింది. దీంతో పార్టీ గుర్తుపై గెలిచినవారిని కాదని స్వతంత్రులకు పట్టం ఎలా కడతారని ఇద్దరు కార్పొరేటర్లు మొదటినుంచీ అసంతృప్తితో ఉన్నారు. డెప్యూటీ మేయర్ పదవి ఆశించి... దక్కే అవకాశం లేదనుకున్నవారు సైతం నిరాశతో ఉన్నారు. వీరంతా వ్యతిరేకంగా పనిచేస్తే... ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లు కలిసినా గెలిచే పరిస్థితి ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో తమ పార్టీ కార్పొరేటర్లకు విప్ జారీచేసేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. విప్‌ను ఉల్లంఘించి ఇతర పార్టీలకు మద్దతు తెలిపితే పదవి కోల్పోయే ప్రమాదముండడంతో... విప్ ధిక్కరించే అవకాశముండదని ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. స్వతంత్రులతోపాటు ఆయా పార్టీల్లో ఉన్న జంప్‌జిలానీలతో మేయర్ ఎన్నిక సీన్ మారే అవకాశముంది. మద్దతుకోసం పాకులాట రామగుండం : కార్పొరేటర్ల మద్దతు కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. టీఆర్ఎస్ నుంచి మేయర్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న స్వతంత్ర కార్పొరేటర్ కొంకటి సత్యనారాయణతోపాటు ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ 50వ డివిజన్ కార్పొరేటర్ షమీమ్ సుల్తానాను కలిసి మద్దతు కోరగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. వీరు వెళ్లిన కాసేపటికే కాంగ్రెస్ మేయర్ అభ్యర్థులు మహంకాళి స్వామి, దొంతుల లింగం వేర్వేరుగా షమీమ్ సుల్తానాను కలిసి మద్దతు కోరారు.