న్యూఢిల్లీ: బ్యాటరీతో నడిచే ఇ-రిక్షాల క్రమబద్ధీకరణ, వాటి డ్రైవర్లకు లెసైన్సులు జారీ చేసే బిల్లుకు లోక్‌సభలో బుధవారం అన్ని పక్షాల నుంచి మద్దతు లభించింది. అయితే కొందరు సభ్యులు ఆ బిల్లును మరింత విస్తృత సంప్రదింపుల కోసం స్థాయీ సంఘానికి పంపాలని కూడా డిమాండ్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టితోనే బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెడుతోందని విమర్శించిన సభ్యులూ లేకపోలేదు. మోటారు వాహనాల సవరణ బిల్లు,2014ను రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇ-రిక్షాలను నడిపేవారు, వాటిలో ప్రయాణించేవారు పేదలేనని అన్నారు. ఇటీవలి కోర్టు తీర్పు కారణంగా, ఇ-రిక్షాలపై ఆధారపడి జీవిస్తున్న రెండు లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారని అన్నారు. ఈ బిల్లును ఎంత త్వరగా ఆమోదిస్తే వారికి అంత త్వరగా మేలు చేసిన వారమవుతామని మంత్రి చెప్పారు.
అధికార ఎన్డీయే పక్ష పార్టీలతో పాటు అన్నా డీఎంకే, టీఎంసీ, టీఆర్‌ఎస్ పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి. ఇ-రిక్షా డ్రైవర్ల కుటుంబాలపై అంత ప్రేమ ఉంటే ఈ బిల్లును గత సమావేశాల్లోనే ఎందుకు ప్రవేశపెట్టలేదని కాంగ్రెస్ సభ్యుడు రాజీవ్ శంకర్‌రావు సతవ్ ప్రశ్నించారు. ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈ సమావేశాలను ఎంచుకున్నారని విమర్శించారు. ఢిల్లీ రోడ్లు ఇప్పటికే ఇరుకుగా మారిపోయాయని, మరింత అధునాతన రవాణా విధానం కోసం ప్రభుత్వం ప్రయత్నించి ఉండాల్సిందని బీజేడీకి చెందిన తథాగత సత్పతి అన్నారు. ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి నివేదించాలని సతవ్, సత్పతి డిమాండ్ చేశారు. ఈ బిల్లుపై టీఆర్‌ఎస్‌కు చెందిన వినోద్‌కుమార్ బోయినపల్లి, టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు మాట్లాడారు.
మోటారు వాహనాలుగా ఇ-రిక్షాలు
బ్యాటరీతో నడిచే ఇ-రిక్షాలను మోటారు వాహనాలుగా పరిగణించాలని ఓ అధ్యయనం సిఫార్సు చేసింది. రోడ్లపై కొన్ని ఇ-రిక్షాలను పరీక్షించగా, వాటి మోటారు శక్తి 250 వాట్‌లకన్నా అధికంగా ఉందని, కొన్నింటి వేగం గంటకు 25 కిలోమీటర్లు దాటిందని ఆ అధ్యయనం వెల్లడించింది. ఈ ఫలితాల ఆధారంగా ఇ-రిక్షాలను మోటారు వాహనాలుగా పరిగణించాలని వాటిపై అధ్యయనం చేసిన ‘ది ఎనర్సీ అండ్ రిసోర్స్ ఇన్‌స్టిట్యూట్ (తేరీ) సిఫార్సు చేసింది. తమ అధ్యయనంలో భాగంగా 53 ఇ-రిక్షాలను పరీక్షించామని తేరీ తెలిపింది.
ఇ-రిక్షాలకు లోక్‌సభలో భారీ మద్దతు
Published Wed, Dec 17 2014 11:18 PM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM
Advertisement
Advertisement