డీకే అరుణపై ఈవ్‌టీజింగ్!
* సభలో అధికారపక్ష సభ్యులు వేధించారు: భట్టి విక్రమార్క
* పైగా ఆమెతోనే క్షమాపణ చెప్పించారు
* ఇది తలదించుకోవాల్సిన విషయం
* అధికారపక్షం భౌతిక దాడికి భయపడే మా సభ్యుడు కుర్చీ ఎక్కాడు
* జాతీయ గీతానికి అగౌరవం పేరుతో అతనితోనూ సారీ చెప్పించారని వ్యాఖ్య
* తీవ్రంగా తప్పుపట్టిన మంత్రులు నాయిని, హరీశ్‌రావు, ఈటెల రాజేందర్
* మైక్ కట్ చేయటంతో నిరసన.. సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్
సాక్షి, హైదరాబాద్: నిండు శాసనసభలో ఎమ్మెల్యే డీకే అరుణపై ఈవ్‌టీజింగ్ జరిగిందని, అధికారపక్ష సభ్యులు ఆమెను వేధించారని అసెంబ్లీలో కాంగ్రెస్ ఉపనేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పైగా ఆమెతోనే సభలో క్షమాపణ చెప్పించారని, ఇది తలదిం చుకోవాల్సిన విషయమని అన్నారు. దీంతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. మంత్రులు సహా అధికారపక్ష సభ్యులు భట్టి విక్రమార్కపై మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. ఇదే సమయం లో భట్టికి ఇచ్చిన గడువు ముగిసిందంటూ స్పీకర్ మైక్ కట్ చేయడంతో.. విపక్షం నిరసనకు దిగింది. తమగొంతు నొక్కుతున్నారం టూ సభ నుంచి వాకౌట్ చేసింది.
అరుణ విషయంలో అది ఈవ్‌టీజింగే..
బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మధ్యాహ్నం అక్బరుద్దీన్ సుదీర్ఘ ప్రసంగం తర్వాత భట్టి విక్రమార్గ ప్రసంగించారు. తొలుత బడ్జెట్ అంకెలు, లెక్కలపై మాట్లాడిన ఆయన తర్వాత గవర్నర్ ప్రసంగం సమయంలో గందరగోళంవైపు మళ్లారు. ‘‘ఇటీవల మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన ‘షీ టీమ్స్’ సమర్థంగా పనిచేస్తున్నాయని, మహిళలపై ఈవ్‌టీజింగ్ తగ్గిందని పేర్కొంటున్నారు. కానీ అసెంబ్లీ సాక్షిగా అది తప్పని నిరూపితమైంది. మా మహిళా ఎమ్మెల్యే డీకే అరుణ మొన్న ప్రసంగిస్తుండగా.. అధికారపక్ష సభ్యులు ఆమెను ఈవ్‌టీజింగ్‌తో వేధించారు. దానిని భరించలేక ఆమె ‘నోరు మూసుకోండి..’ అని అంటే చివరకు ఆమెనే తప్పు చేసినట్టుగా క్షమాపణ చెప్పించారు.
మహిళను టీజ్ చేసిన అధికార పార్టీ సభ్యులపై చర్యలు తీసుకోకుండా ఆమెతోనే సారీ చెప్పిం చారు. ఇది తలదించుకోవాల్సిన విషయం..’’ అని భట్టి పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం సమయంలో ప్రతిపక్ష సభ్యులపై అధికారపక్ష సభ్యులు భౌతికదాడికి దిగడంతో.. ప్రాణభయంతో వారి నుంచి తప్పించుకునేందుకు తమ సభ్యుడు బల్లపైకి ఎక్కాడని చెప్పారు. దీంతో అతనితోనూ క్షమాపణ చెప్పించారని, ఇదేం పద్ధతని నిలదీశారు. ఈ వ్యాఖ్యలపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీ జానారెడ్డి ఆదేశంతోనే మీ సభ్యుడు సారీ చెప్పాడు. అంటే మీ నాయకుడి ఆదేశాన్ని ఇప్పుడు మీరు తప్పుపడుతున్నారు.
డీకే అరుణతో వాగ్వాదం జరిగింది. అది ఈవ్‌టీజింగ్ అని ఎలా అంటారు. పదేళ్లపాటు తిమ్మిని బమ్మి చేసిన తీరుకు కాలం చెల్లింది..’’ అని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన భట్టి.. అన్ని కెమెరాల ఫుటే జీలను పూర్తిగా చూపితే అసలు విషయం తేలుతుందన్నారు. ఇదే సమయంలో మంత్రి హరీశ్‌రావు లేచి.. అరుణ విషయంలో ఈవ్‌టీజింగ్ జరిగిందనే వ్యాఖ్యలను భట్టి ఉపసంహరించుకోవాలన్నారు.
ఎవరో రాసిచ్చిన బడ్జెట్‌ను చదివారు
తాజా బడ్జెట్ అంకెల గారడీలా ఉందని భట్టి విక్రమార్క విమర్శించారు. బ్రిటిష్ ఫిలాసఫర్ స్టువర్ట్ మిల్ చెప్పిన ట్రెడ్‌మిల్ థియరీతో బడ్జెట్‌ను పోల్చారు. ‘‘ట్రెడ్‌మిల్‌పై వేగంగా నడిచేవారు ముందుకు సాగుతున్నామనుకుంటే భ్రమే.. అది ఆగిన తర్వాత తాము అక్కడే ఉన్నామని విషయం తెలుస్తుంది. ఐదేళ్ల తర్వాత కూడా తెలంగాణ ప్రగతి ఇలాగే ఉం టుంది. కానీ గొప్ప పురోగతి ఉందని భ్రమిం చేలా అంకెలతో కేసీఆర్ మాయ చేస్తున్నారు..’’ అని భట్టి పేర్కొన్నారు.
గత బడ్జెట్ సవరించిన అంచనాలను విస్మరించిన ఈటెల రాజేందర్.. వాటిని బడ్జెట్ అంచనాలకు తేడా లేకుండా చూపారని, ఎవరో రాసిచ్చిన పుస్తకాన్ని ఆయన సభలో ప్రవేశపెట్టినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దీంతో ఈటెల తీవ్రంగా మండిపడ్డారు. ‘‘సమగ్ర అవగాహనతో నేను బడ్జెట్ రూపొందించాను. ఎవరో రాసిస్తే నేను చదివానంటే నాకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవగాహన లేదనా మీ అర్థం? ఇలా అనడం భావ్యమా.
రాష్ట్రం విడిపోతే తెలంగాణ కుక్క లు చింపిన విస్తరి అవుతుందన్న ఆంధ్రావాళ్ల మాటలను మీరు ఎండార్స్ చేస్తున్నారా, 60 ఏళ్ల కాంగ్రెస్ ఏలుబడిలో తెలంగాణలో అభివృద్ధి లేదంటే ఆ ట్రెడ్‌మిల్ విధానం మీ పార్టీకే వర్తిస్తుంది. బస్తీని కబ్జా చేసి గాంధీభవన్ కట్టాలనే సిద్ధాంతం ఉన్న మీరు మాకు చెప్తారా..’’ అంటూ ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెప్పపాటు కరెంటు కోత ఉండదంటే ఇలాగేనా..?
రెప్పపాటు కూడా కరెంటు కోత లేకుండా చేస్తామని సర్కారు ప్రకటించిందని... బడ్జెట్ కేటాయింపులు దానికి విరుద్ధంగా ఉన్నాయని భట్టి విమర్శించారు. ఇది మాటలతో పబ్బం గడిపే ప్రయత్నమన్నారు. ఇప్పటికే 796 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్ నీరుగార్చారని విమర్శించారు. ఇతర పార్టీలను పరిగణనలోకి తీసుకోకుండా తసచివాలయ తరలింపు నిర్ణయం తీసుకోవటం అహంభావం, అహం కారపూరితమని విమర్శించారు. ఈ క్రమంలో అధికారపక్ష సభ్యులు మరోసారి ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో భట్టి విక్రమార్కకు కేటాయించిన గడువు పూర్తయిందంటూ స్పీకర్ ఆయన మైక్‌ను కట్ చేశారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ.. సభ నుంచి వాకౌట్ చేశారు.