రాజకీయాలు తప్ప రైతులు పట్టరా?
సర్కారుపై డీకే అరుణ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రాజకీయాలు, ఎన్నికలు, ఇతర పార్టీల నేతలను ప్రలోభపెట్టడం తప్ప రైతుల సమస్యలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ ధ్వజమెత్తారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ, జూరాల కింద ఏనాడూ పంటలు ఎండిపోలేదని, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అవగాహనలేమి, బాధ్యతారాహిత్యంతో ఈ ఏడాది పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. జూరాల కింద అదనంగా 50 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తామన్న ప్రభుత్వం జనవరిలోనే నీటిని ఇవ్వకుండా ఆపేసిందన్నారు. దీంతో పంటలు ఎండిపోయాయని, పెట్టిన పెట్టుబడులు కూడా రైతులకు వచ్చే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పశుగ్రాసం, తాగునీరు కూడా అందని దుస్థితి గ్రామాల్లో ఉందన్నారు. ఎండిన పంటలపై సర్వే చేయించి, వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. జిల్లాల ఏర్పాటుకు పరిపాలనా సౌలభ్యం, ప్రజల అవసరాలు, అర్హతల ప్రాతిపదికగా ఉండాలని సూచించారు. తెలంగాణలోనే నడిగడ్డ ప్రాంతమైన గద్వాలను జిల్లా కేంద్రంగా చేయాలని డీకే డిమాండ్ చేశారు. ప్రభుత్వ జీఓలను వెల్లడించే వెబ్‌సైట్‌ను మూసేయించడం ద్వారా.. తాను తీసుకునే తప్పుడు నిర్ణయాలను ప్రజలకు తెలియనివ్వకుండా చీకట్లో ఉంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారని ఆమె ఆరోపించారు.