
ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెట్టాలి...
అప్పుడే హామీలు నేరవేరుస్తారు: డీకే అరుణ
మెదక్: ప్రజలకు ఇచ్చిన హామీలను మరచిన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మెదక్ ఉప ఎన్నికలో కర్రుకాల్చి వాతపెట్టాలని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. మెదక్ ఎంపీ ఉప ఎన్నిక సందర్భంగా ఆదివారం మెదక్ మండల పరిధిలోని బాలానగర్, తిమ్మక్కపల్లి, రాజ్‌పల్లి తదితర గ్రామాల్లో ఆమె ప్రచారాన్ని నిర్వహించారు. ప్రభుత్వం రైతు రుణాలను మాఫీచేసేందుకు షరతులను విధిస్తూ అయోమయంలో పడేస్తోందన్నారు.
వ్యవసాయం కోసం కరెంట్ లేక పంటలు ఎండిపోయిన రైతులు నిరసన చేస్తే వారిపై లాఠీదెబ్బలను కురిపించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. రూ. 3.50 లక్షలతో ఇల్లు, వృద్ధులకు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ 1500 ిపింఛన్, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అంటూ అరచేతిలో స్వర్గం చూపిస్తున్న ఆయన ప్రజలను నట్టేట ముంచటం ఖాయమని ఆరోపించారు. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ కోసం పోరాటాలు చేస్తున్న ఇక్కడి ప్రజల పోరాట పటిమను చూసి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు.