
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు పాఠశాలల్లోనూ స్పోర్ట్స్ పీరియడ్‌ను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. అకడమిక్ కేలండర్‌లో పేర్కొన్న ఆ పీరియడ్ సమయంలో మరో సబ్జెక్టు బోధన చేపడితే చర్యలు తప్పవని పేర్కొంది. ఆట స్థలాలులేని పాఠశాలలు ఇండోర్ గేమ్స్ నిర్వహించాల్సిందేనని తెలిపింది. విద్యార్థులపై ఒత్తిడి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై తల్లిదండ్రుల కమిటీలు, కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో ఇటీవల పాఠశాల విద్యా శాఖ సమావేశం నిర్వహించింది.
ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మార్గదర్శకాలు జారీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. స్టేట్ సిలబస్, ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ తదితర అన్ని రకాల సిలబస్‌ను అనుసరించే పాఠశాలలన్నీ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నిర్దేశించిన అకడమిక్ కేలండర్‌ను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. హైదరాబాద్ జంట నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలకు విద్యాశాఖ జారీచేసిన నిర్దేశిత వేళలనే అమలు చేయాలని, హాస్టళ్ల పేరుతో అర్ధరాత్రి వరకు చదివిస్తూ విద్యార్థులను ఒత్తిడికి గురి చేయవద్దని స్పష్టం చేసింది. అలాగే పుస్తకాల బ్యాగు బరువును తగ్గించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. అపార్ట్‌మెంట్లలో ఉన్న స్కూళ్లలో పరిస్థితులపైనా తనిఖీలు చేసేందుకు సిద్ధం అవుతోంది. విద్యాశాఖ నిబంధనల అమలుపైనా ఆకస్మిక తనిఖీలను చేపట్టే ఆలోచనలు చేస్తోంది.
చర్యలు చేపట్టాల్సిన మరిన్ని అంశాలు..
- స్కూళ్లలో కార్పొరల్ పనిష్‌మెంట్ ఉండకూడదు.
- డ్రగ్స్‌వంటి దురలవాట్లను దూరం చేసేందుకు స్కూళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.
- ఇప్పటికే కొన్ని పాఠశాలలు వచ్చే ఏడాది వసూలు చేయబోయే ఫీజుల వివరాలను నిర్ణయించాయని, రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ, ఫీజుల విధానం ఖరారు అయ్యాకే ఆ నిబంధనలకు లోబడి ఫీజులను ఖరారు చేయాలి
- గైడ్స్, స్టడీ మెటీరియల్‌ను పాఠశాలల్లో నిషేధించాలి.
Comments
Please login to add a commentAdd a comment