కాంగ్రెస్ పాలనలో రైతులకు తీరని నష్టం
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి
జగిత్యాల అర్బన్ : కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూపీఏ పాలనలో అనేకమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వారందరూ రాహుల్‌గాంధీకి కనిపించలేదా? అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. పట్టణంలోని ఎస్సారెస్పీ గెస్ట్‌హౌస్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. యూపీఏ పదేళ్లపాలనలో ఏం చేశారో చెప్పాలన్నారు. రాహుల్‌గాంధీ పర్యటనపై కాంగ్రెస్ నాయకులే అయోమయంలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
ఉనికి కోసమే రాహుల్ తెలంగాణలో పర్యటిస్తున్నారని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలపై యూపీఏ ప్రభుత్వం అనేక కమిటీలు వేసిందని, అవి నివేదికలు ఇచ్చినా... రైతుల ఆత్మహత్యలు ఎందుకు నిలువరించలేకపోయారని ప్రశ్నించారు. భూసేకరణ చట్టంలో ఎలాంటి మార్పులు లేవన్నారు. ప్రజాసంక్షేమం కోసం నరేంద్రమోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఆర్టీసీ సమ్మెతో రూ.100 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని, ఇందుకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో కుటుంబపాలన సాగుతోందని, ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్, నాయకులు రాజన్న, లింగారెడ్డి, సీపెల్లి రవీందర్, కిశోర్‌సింగ్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.