సాక్షి, హైదరాబాద్: కరోనా విషయంలో కొందరు ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ ఆస్పత్రిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, వైద్యుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. లక్షణాలు లేనివారు కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ఆస్పత్రులకు రావొద్దని ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. దీనివల్ల కరోనా పేషంట్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. లక్షణాలు ఉంటే ఎంతమందికైనా పరీక్షలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
(చదవండి: కోవిడ్ వ్యర్థాలు @ 100 టన్నులు)
టెస్టుల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోందని అన్నారు. ప్రజారోగ్యం విషయంలో రాజీపడబోమని ఈ సందర్భంగా ఈటల స్పష్టం చేశారు. త్వరలోనే గచ్చిబౌలీలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (టిమ్స్)ను ప్రారంభిస్తామని చెప్పారు. టిమ్స్‌లో 1264 పడకలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. 1000 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం, 50 పడకలకు వెంటిలేటర్ సౌకర్యం ఉందన్నారు. టిమ్స్‌లో ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చాయని, నాలుగైదు రోజుల్లో ఇన్‌పేషంట్‌లకు చికిత్స ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. జిల్లా స్థాయిలో ఏరియా ఆస్పత్రుల్లోనూ ఐసీయూలు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.
(చదవండి: నాలాగా కోవిడ్ బారిన పడకండి : ఎమ్మెల్యే)
Comments
Please login to add a commentAdd a comment