హైదరాబాద్: తమ పాలనను చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని, గవర్నర్ అబద్దాలు చెబితే చర్చలో పాల్గొని దమ్ముంటే ఆ విషయాలు చెప్పాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిలదీశారు. విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు మదన్‌లాల్, కనకయ్య, మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణలతో కలిసి ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ అంతర్గతంగా చేసుకున్న సర్వేపై కాంగ్రెస్‌కు ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. కావాలంటే మీరు 66 సర్వేలు చేసుకోండి ఎవరు వద్దన్నారు అని అన్నారు.
గవర్నర్ ప్రసంగాన్ని మొత్తం వినకుండానే కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేయడం రాజ్యాంగాన్ని అవమానపరచడమే అవుతుందన్నారు. తెలంగాణ ప్రజలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆస్వాదిస్తున్నారన్నారు. కాంగ్రెస్ జన ఆవేదన సభ, టీడీపీ ప్రజాపోరు యాత్ర ప్రజలు దూరంగా ఉన్నారని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో తెలంగాణాకు వచ్చింది 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులు కాగా తమ రెండేళ్ల పాలనలో 2700 కిలోమీటర్లు వచ్చాయన్నారు.
పక్కా ఇళ్ల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు విమర్శించారు. వ్యవసాయం గురించి తెలియని పెద్దమనిషి వ్యవసాయం సంక్షోభంలో ఉందనటం హాష్యాస్పదం ఉందని ఎద్దేవా చేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ హౌసింగ్ మంత్రిగా కట్టని ఇళ్లకు బిల్లులిచ్చి డబ్బులు నొక్కేయలేదా అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బతుకు బజారే అవుతుందని విమర్శించారు.