కాంట్రాక్ట్ కిడ్నాపేనా?
హుజూరాబాద్‌లో క్లినిక్ నిర్వహిస్తున్న పిల్లల వైద్యుడు సురేందర్‌రెడ్డి కిడ్నాప్.. విడుదల ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. డాక్టర్‌ను కిడ్నాప్ చేసి రూ.35 లక్షలు డిమాండ్ చేసి చివరకు రూ.16 లక్షలు తీసుకుని విడుదల చేసినట్లు ప్రచారం జోరందుకుంది. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. వైద్యుడికి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తున్న ఫోన్ నంబర్ ఆధారంగా 20 మంది కాల్‌డాటా సేకరించినట్లు సమాచారం. పోలీసులు 10 మందిపై అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో పాత నేరస్తులూ ఉన్నట్లు సమాచారం.
హుజూరాబాద్ : వైద్యుడి కిడ్నాప్ వ్యవహారంలో ఫోన్ కాల్‌డాటా ఆధారంగా ఎల్కతుర్తి మండలం దండెపల్లికి చెందిన ఒక ఆటోడ్రైవర్, వల్భాపూర్‌కు చెందిన ఒకరు, కేశవాపూర్‌కు చెందిన ఓ వ్యక్తితోపాటు జీల్గులకు చెందిన మరొకరిని పోలీసులు ప్రధాన నిందితులుగా అనుమానిస్తున్నట్లు తెలిసింది. విచారణ అనంతరం హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన ఒక మాజీ నక్సలైట్ పేరు, ఎల్కతుర్తి మండలానికి చెందిన ఒక నాయకుడి పేరును సందేహిస్తున్నట్లు సమాచారం. ఎవరి పాత్ర ఎంత అని ఇంకా స్పష్టంకాలేదు. అనుమానితుల ఫోన్‌నంబర్లకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పెట్టి సిమ్‌కార్డులు పొందినట్లు తెలిసింది. దీంతో గుర్తింపుకార్డులు లేకుండా సిమ్‌కార్డులు ఇస్తున్న పలువురిని సైతం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం.
ఒప్పందమేనా?
డాక్టర్ సురేందర్‌రెడ్డి కిడ్నాప్ ఉదంతం వెనుక పాత నేరస్తుల పేర్లు వినిపిస్తుండడంతో పోలీసులు కొత్త కోణంలో విచారణ జరుపుతున్నారు. కిడ్నాప్ జరిగిన తీరు, వైద్యుడికి చేసిన హెచ్చరికలు, డబ్బులు డిమాండ్ చేసిన పద్ధతి చూస్తుంటే దీని వెనుక ప్రొఫెషనల్ కిడ్నాపర్లు ఉండచ్చనే అనుమానాలు లేకపోలేదు. సదరు వైద్యుడిపై కక్ష, కోపాలతో ఎవరైనా కిడ్నాప్‌కు వ్యూహరచన చేశారా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి.
వైద్యుడిని చంపినా.. చంపకున్నా డబ్బులు వస్తాయని కిడ్నాపర్లు మాట్లాడినట్లు తెలుస్తుండటంతో ఇటు వ్యూహరచన చేసిన వ్యక్తుల నుంచి వచ్చే డబ్బులతోపాటు అటు బాధిత వైద్యుడు ఇచ్చే డబ్బుల కోసం కూడా ఆశపడ్డట్లు అర్థమవుతోంది. చివరకు సగం డబ్బులతోనే వ్యూహం బెడిసికొట్టడంతో వారు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. పక్కా కాంట్రాక్ట్‌తోనే ఈ కిడ్నాప్ జరిగిందనే చర్చ జరుగుతోంది. ఈ ఉదంతంపై పోలీసుల విచారణ ఒక కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. రెండురోజుల్లో సస్పెన్స్‌కు తెరదించుతామని ఖాకీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ‘సాక్షి’లో వరుసగా వస్తున్న కథనాలతో జిల్లా పోలీస్‌బాస్ సైతం ఈ విషయంపై ఆరా తీసినట్లు తెలిసింది.