హైదరాబాద్ : జీవించినంత కాలం ప్రజల కోసమే పనిచేసిన ధన్యజీవి డాక్టర్ ఏపీ విఠల్ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కొనియాడారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అభ్యుదయ వాదుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కమ్యునిస్టు మేధావి, ప్రజా వైద్యుడు డాక్టర్ ఏపీ విఠల్ సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా విఠల్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ.. విధానాలు, సిద్ధాంతాల పట్ల ఆయనకి ఉన్న అవగాహన ఎవరికీ లేదన్నారు. ఆయనతో స్నేహం చేయని వారు ఉండరని పేర్కొన్నారు. గురువుగా, సిద్ధాంత కర్తగా భావిస్తున్న తరుణంలోనే ‘నీవు మాస్ లీడర్‌వి’అని తనకు సర్టిఫికెట్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.
డాక్టర్ విఠల్ చనిపోయేంత వరకు సీపీఎంని ప్రేమించారని పేర్కొన్నారు. మార్క్స్‌ని మార్క్సిస్టుగా పని చేయకుండా ఏ శక్తీ ఆపలేదని చెప్పడానికి డాక్టర్ విఠల్ ఒక ఉదాహరణ అని తమ్మినేని కొనియాడారు. కొండపల్లి పవన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె.రామచంద్రమూర్తి, ప్రముఖ గేయ రచయితలు గోరేటి వెంకన్న, జయరాజు, టఫ్ అధ్యక్షురాలు విమలక్క, తెలంగాణ లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు మన్నారం నాగరాజు, అంబేడ్కర్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ బహుదూర్, ప్రముఖ నవల రచయిత కె.వి.కృష్ణ కుమారి, మోదుగుపూల ఎడిటర్ భూపతి వెంకటేశ్వర్లు, జి.రాములు, సీపీఐ నాయకుడు కందిమల్ల ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment