sundaraiah bhavan
-
డాక్టర్ విఠల్.. ధన్యజీవి
హైదరాబాద్ : జీవించినంత కాలం ప్రజల కోసమే పనిచేసిన ధన్యజీవి డాక్టర్ ఏపీ విఠల్ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కొనియాడారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అభ్యుదయ వాదుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కమ్యునిస్టు మేధావి, ప్రజా వైద్యుడు డాక్టర్ ఏపీ విఠల్ సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా విఠల్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ.. విధానాలు, సిద్ధాంతాల పట్ల ఆయనకి ఉన్న అవగాహన ఎవరికీ లేదన్నారు. ఆయనతో స్నేహం చేయని వారు ఉండరని పేర్కొన్నారు. గురువుగా, సిద్ధాంత కర్తగా భావిస్తున్న తరుణంలోనే ‘నీవు మాస్ లీడర్‌వి’అని తనకు సర్టిఫికెట్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. డాక్టర్ విఠల్ చనిపోయేంత వరకు సీపీఎంని ప్రేమించారని పేర్కొన్నారు. మార్క్స్‌ని మార్క్సిస్టుగా పని చేయకుండా ఏ శక్తీ ఆపలేదని చెప్పడానికి డాక్టర్ విఠల్ ఒక ఉదాహరణ అని తమ్మినేని కొనియాడారు. కొండపల్లి పవన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె.రామచంద్రమూర్తి, ప్రముఖ గేయ రచయితలు గోరేటి వెంకన్న, జయరాజు, టఫ్ అధ్యక్షురాలు విమలక్క, తెలంగాణ లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు మన్నారం నాగరాజు, అంబేడ్కర్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ బహుదూర్, ప్రముఖ నవల రచయిత కె.వి.కృష్ణ కుమారి, మోదుగుపూల ఎడిటర్ భూపతి వెంకటేశ్వర్లు, జి.రాములు, సీపీఐ నాయకుడు కందిమల్ల ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బ్రాండ్‌ను కాపాడుకుంటున్న బాబు
ఒంగోలు టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో మాదిరిగా తన బ్రాండ్‌ను కాపాడుకుంటున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. గురువారం ఒంగోలు వచ్చిన ఆయన స్థానిక సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చెప్పిన మాటను అమలు చేయకపోవడం, చెప్పనిదానిని చేయడం, ప్రజలు తమ సమస్య చెప్పేందుకు వెళితే వారిపై లాఠీలను ప్రయోగించడం ఆయన తొమ్మిదేళ్ల పాలనలో చూశారని, తిరిగి అధికారంలోకి వచ్చిన ఆయన ఆ బ్రాండ్‌ను పర్మిమెంట్ చేసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో చంద్రబాబునాయుడుకు ఒక్క అవకాశం ప్రజలు ఇస్తే దానిని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. నేను మారనంటూ పాత చంద్రబాబునే గుర్తుకు తెస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతుల రుణమాఫీని అమలు చేయకుండా వారి నోట్లో పదేపదే మట్టికొడుతున్నారన్నారు. రుణమాఫీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలు అంగీకరించడం లేదని చంద్రబాబు అనడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని ముందుకు సాగాల్సి ఉన్నా ఆ దిశగా స్పందించడం లేదని విమర్శించారు. తెలుగుదేశం కార్యకర్తలు మారాలంటూ చంద్రబాబు పదేపదే అంటున్నారని, ముందు ఆయన మారి నాయకుడిగా నిరూపించుకుంటే పార్టీ క్యాడర్ మారుతుందని సలహా ఇచ్చారు. శనగ రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన వారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని శ్రీనివాసరావు తీవ్రంగా ఆక్షేపించారు. అరెస్టులు చేయడానికి వారేమైన గజదొంగలా, ల్యాండ్ మాఫియా వాళ్లా అని ప్రశ్నించారు. 20 మందిని కాదు 200 మందిని అరెస్టు చేసినా తాము భయపడబోమని స్పష్టం చేశారు. రైతులకు ఇచ్చిన హామీని అమ లు చేయకుంటే పుట్టగతులు లేకుండా పోతావని చంద్రబాబును హెచ్చరిం చారు. విలేకరుల సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జాలా అంజయ్య, నగర కార్యదర్శి జీవీ కొండారెడ్డి పాల్గొన్నారు.