బ్రాండ్‌ను కాపాడుకుంటున్న బాబు
ఒంగోలు టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో మాదిరిగా తన బ్రాండ్‌ను కాపాడుకుంటున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. గురువారం ఒంగోలు వచ్చిన ఆయన స్థానిక సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చెప్పిన మాటను అమలు చేయకపోవడం, చెప్పనిదానిని చేయడం, ప్రజలు తమ సమస్య చెప్పేందుకు వెళితే వారిపై లాఠీలను ప్రయోగించడం ఆయన తొమ్మిదేళ్ల పాలనలో చూశారని, తిరిగి అధికారంలోకి వచ్చిన ఆయన ఆ బ్రాండ్‌ను పర్మిమెంట్ చేసుకుంటున్నారని తెలిపారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో చంద్రబాబునాయుడుకు ఒక్క అవకాశం ప్రజలు ఇస్తే దానిని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. నేను మారనంటూ పాత చంద్రబాబునే గుర్తుకు తెస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతుల రుణమాఫీని అమలు చేయకుండా వారి నోట్లో పదేపదే మట్టికొడుతున్నారన్నారు. రుణమాఫీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐలు అంగీకరించడం లేదని చంద్రబాబు అనడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని ముందుకు సాగాల్సి ఉన్నా ఆ దిశగా స్పందించడం లేదని విమర్శించారు.
తెలుగుదేశం కార్యకర్తలు మారాలంటూ చంద్రబాబు పదేపదే అంటున్నారని, ముందు ఆయన మారి నాయకుడిగా నిరూపించుకుంటే పార్టీ క్యాడర్ మారుతుందని సలహా ఇచ్చారు. శనగ రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన వారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని శ్రీనివాసరావు తీవ్రంగా ఆక్షేపించారు. అరెస్టులు చేయడానికి వారేమైన గజదొంగలా, ల్యాండ్ మాఫియా వాళ్లా అని ప్రశ్నించారు. 20 మందిని కాదు 200 మందిని అరెస్టు చేసినా తాము భయపడబోమని స్పష్టం చేశారు. రైతులకు ఇచ్చిన హామీని అమ లు చేయకుంటే పుట్టగతులు లేకుండా పోతావని చంద్రబాబును హెచ్చరిం చారు. విలేకరుల సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జాలా అంజయ్య, నగర కార్యదర్శి జీవీ కొండారెడ్డి పాల్గొన్నారు.