
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భవతి ఆటోలోనే ప్రసవించింది. వివరాలు..కొత్తగూడెం జిల్లాకేంద్రం మేదరబస్తీకి చెందిన పూజ డెలివరీ నిమిత్తం జిల్లా ఆసుపత్రికి శుక్రవారం ఉదయం పదిన్నర సమయంలో వచ్చింది. ఆసుపత్రికి వచ్చి అర్ధ గంట అయినా డాక్టర్లు పట్టించుకోకపోవడంతో నొప్పులు ఎక్కువై ఆటోలోనే ప్రసవించింది. తల్లీ, బిడ్డా ఆరోగ్యంగానే ఉన్నారు.
మీడియా అక్కడికి రావడంతో హడావిడిగా వైద్య సిబ్బంది బాలింతను చేతులతోనే ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. బాలింతను తీసుకువెళ్లడానికి కనీసం ఓ స్ట్రెచర్ లేకపోవడం గమనార్హం. వైద్యుల నిర్లక్ష్యం పట్ల గర్భిణీ బంధువులు విస్మయం వ్యక్తం చేశారు. పూజకు ఇది రెండో కాన్పు. రెండో కాన్పులో మగబిడ్డ జన్మించాడు.