మొయినాబాద్: స్వైన్‌ఫ్లూ వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైతును గురువారం వైద్యాధికారులు పరామర్శించారు. అనంతరం బాధితుడి ఇంటికి వెళ్లి ఇంటి పరిసరాలను పరిశీలించారు. మొయినాబాద్‌కు చెందిన రైతు మహ్మద్ ఆసీఫ్(29) స్వైన్‌ఫ్లూ వ్యాధితో బాధపడుతూ నగరంలోని ప్రిమియర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
గురువారం పత్రికల ద్వారా విషయాన్ని తెలుసుకున్న చేవెళ్ల క్లస్టర్ ఎస్‌పీహెచ్‌ఓ చెంచయ్య తమ సిబ్బందితో కలిసి గురువారం ఆస్పత్రిలో ఆసీఫ్‌ను పరామర్శించారు. వ్యాధి నిర్ధారణకు సంబంధించిన రిపోర్టులను పరిశీలించారు. అక్కడి వైద్యులతో మాట్లాడి ఆసీఫ్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ప్రస్తుతం వెంటిలేషన్‌పై చికిత్స అందిస్తున్నారని, అతని ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడుతున్నట్లు వైద్యులు చెప్పారని చెంచయ్య చెప్పారు.
ఆసీఫ్ ఇంటి పరిసరాలు పరిశీలన
మొయినాబాద్ పీహెచ్‌సీ సిబ్బందితో ఎస్‌పీహెచ్‌ఓ చెంచయ్య బాధితుడు ఆసీఫ్ ఇంటికి వెళ్లి కుటుంబీకులతో మాట్లాడి పరిసరాలను పరిశీలించారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా వ్యాధి సోకే అవకాశం ఉందన్నారు. ఎక్కువ ప్రయాణం చేసే సందర్భాల్లో కూడా స్వైన్‌ఫ్లూ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉంటుందని చెప్పారు.
అయితే ప్రస్తుతం ఆసీఫ్ కుటుంబీకులంతా ఆరోగ్యంగానే ఉన్నారని, వారికి ముందు జాగ్రత్తగా వ్యాధి నివారణ మాత్రలు అందజేస్తామని ఎస్‌పీహెచ్‌ఓ చెంచయ్య చెప్పారు. అధిక జ్వరం, దగ్గు, నీరసంగా ఉన్నట్లైతే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఎస్‌పీహెచ్‌ఓ చెంచయ్యతో పాటు సీహెచ్‌ఓ డోరకమ్మ, హెల్త్ సూపర్‌వైజర్ నీరజ, ఏఎన్‌ఎం శోభ ఉన్నారు.
గ్రామస్తుల ఆందోళన...
మొయినాబాద్‌కు చెందిన రైతు ఆసీఫ్‌కు స్వైన్‌ఫ్లూ సోకిందన్న విషయం తెలియడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో పరిసరాలన్నీ అపరిశుభ్రంగా ఉండడం.. వాతవరణంలో మార్పులు రావడంతో వ్యాధి వ్యాపిస్తుందేమోనని భయపడుతున్నారు.
స్వైన్‌ఫ్లూ బాధితుడికి వైద్యాధికారుల పరామర్శ
Published Thu, Nov 13 2014 11:58 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement