
కుక్కకాటుతో గాయపడిన యువతి
పటాన్‌చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలో ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు మొత్తం 48 మందిని కరిచి తీవ్రంగా గాయపర్చింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని మూడు కాలనీలవాసులు భయభ్రాంతులకు గురయ్యారు.కొన్ని గంటల పాటు ఇళ్లల్లోంచి బయటకు రాలేకపోయారు. పటాన్‌చెరు పట్టణంలోని పాత మార్కెట్ రోడ్డు, ముదిరాజ్ బస్తీ, ఎంజీ రోడ్డు, జేపీ కాలనీలో సోమవారం రాత్రి ఓ పిచ్చి కుక్క అకస్మాత్తుగా దారిన పోయేవారిపై దాడి చేసింది.
కొందరు ఇంటి ముందుర కూర్చుని ఉండగా దాడి చేసి కరిచింది. ముదిరాజ్ బస్తీలోని ఈశ్వరమ్మ ఉదయం వాకిలి ఊడుస్తున్న సమయంలో ఎడమ కాలుపై కరిచింది. అదే బస్తీలో ఉషారాణి అనే విద్యార్థిని ఇంటి బయట ముగ్గువేస్తున్న సమయంలో కుడి చేతిపై కరిచింది. మొత్తం 48 మంది పిచ్చికుక్క బారినపడి ప్రభుత్వాస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. స్థానికులు అందరూ కలిసి మంగళవారం ఉదయం పిచ్చికుక్కను కొట్టి చంపేశారు.
Comments
Please login to add a commentAdd a comment