విమానాల్లో ఇక దూరం దూరం | Domestic Flights Will Be Limited To Major Cities From Hyderabad | Sakshi
Sakshi News home page

విమానాల్లో ఇక దూరం దూరం

Published Tue, May 5 2020 1:06 AM | Last Updated on Tue, May 5 2020 1:06 AM

Domestic Flights Will Be Limited To Major Cities From Hyderabad - Sakshi

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బోర్డింగ్‌ గేట్‌ వద్ద ప్రయాణికులు భౌతికదూరం పాటించేందుకు వీలుగా మార్కింగ్‌ చేసిన అధికారులు

సాక్షి,హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ అనంతరం హైదరాబాద్‌ నుంచి ప్రధాన నగరాలకు మాత్రమే డొమెస్టిక్‌ విమానాలు పరిమితంగా రాకపోకలు సాగించనున్నాయి. వాటిలోనూ అతి తక్కువమంది ప్రయాణికులను అనుమతిస్తారు. ప్రయాణికుల మధ్య భౌతిక దూరం తప్పనిసరి చేసేలా చర్యలు తీసుకుంటారు. గమ్యస్థానం చేరేవరకు ప్రయాణికులు విధిగా మాస్కులను ధరించవలసి ఉంటుంది. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా హైదరాబాద్‌ నుంచి కొన్ని మహానగరాలకు మాత్రమే పరిమిత సంఖ్యలో డొమెస్టిక్‌ విమానాలను నడిపేందుకు పలు ఎయిర్‌లైన్స్‌ సన్నద్ధమవుతున్నాయి. ఈ నెల 17తో మూడో దశ లాక్‌ డౌన్‌ ముగియనుంది. దీంతో 18 నుంచి పలు రాజధాని నగరాలకు మాత్రమే విమానాలను నడుపనున్నారు.


ఎయిర్‌పోర్టులోని ఈ సీట్లలో కూర్చోవద్దని సూచిస్తూ స్టి్టక్కర్లు అతికించిన దృశ్యం

హైదరాబాద్‌ నుంచి మొదటి దశలో ఢిల్లీ, బెంగళూర్, చెన్నై, ముంబయి వంటి ముఖ్యమైన నగరాలకు విమానాలు అందుబాటులోకి రానున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ విమానాలను సైతం కేవలం 33% ఆక్యుపెన్సీతో నడుపుతారు. ఇక లాక్‌డౌన్‌ అనంతర సేవలకు హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా సిద్ధమైంది. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి సుమారు 60 వేల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. 450కి పైగా డొమెస్టిక్, ఇంటర్నేషనల్‌ సర్వీసులు రాకపోకలు సాగిస్తాయి. ఈ నెల 18 నుంచి డొమెస్టిక్‌ సర్వీసులకు మాత్రమే అనుమతి లభించనుంది. కానీ అత్యవసర ప్రయాణికులు మాత్రమే రాకపోకలు సాగిస్తారు. జూన్‌ నుంచి దశలవారీగా జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను విస్తరించే అవకాశం ఉంది.  

దశలవారీగా విస్తరణ...: లాక్‌డౌన్‌ తరువాత ఈ నెల 18 నుంచి విమానాలను నడిపేందుకు కొన్ని ఎయిర్‌లైన్స్‌ సిద్ధంగా ఉన్నప్పటికీ ఇంకా బుకింగ్‌లను మాత్రం ప్రారం   భించలేదు. మరో వారం, పది రోజుల తరువాత ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా బుకింగ్‌లను తెరిచే అవకాశం ఉంది. హైదరాబాద్‌ నుంచి ఇండిగో, స్పైస్‌జెట్, గో ఎయిర్‌ తదితర సంస్థలు పెద్ద ఎత్తున సర్వీసులను అందజేస్తున్నాయి. ఎయిర్‌ ఇండియా మాత్రం జూన్‌లోనే సేవలను ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

లగేజీ చెకిన్‌ పాయింట్‌ వద్ద శానిటైజేషన్‌ చేస్తున్న మహిళ

లాక్‌డౌన్‌ అనంతరం ప్రయాణం ఇలా 
లాక్‌డౌన్‌ అనంతర సేవల కోసం విమానాశ్రయాన్ని పూర్తిగా శానిటైజ్‌ చేశారు. ప్రయాణికులు, ఎయిర్‌పోర్టు సిబ్బంది భౌతిక దూరాన్ని పాటించేవిధంగా అన్ని చోట్ల మార్కింగ్‌ చేశారు. ఈ మేరకు సిటీ సైడ్, చెకిన్‌ హాల్స్, సెక్యూరిటీ చెక్, బోర్డింగ్‌ గేట్స్, తదితర ప్రాంతాల్లో క్యూలైన్‌లు ఏర్పాటు చేశారు. కుర్చీల మధ్య ఖాళీ స్థలం వదిలారు. ఈ మేరకు స్టిక్కర్లను సైతం అతికించారు. ఎయిర్‌పోర్టులోని 7 అంతస్తుల్లో శానిటైజేషన్, ఫ్యూమిగేషన్‌ చేశారు.

టెర్మినల్‌లో పనిచేసే సిబ్బంది, ప్రయాణికుల కోసం పలు చోట్ల సెన్సర్‌ ఆధారిత ఆటోమేటిక్‌ హ్యాండ్‌ శానిటైజర్‌ డిస్పెన్సింగ్‌ మెషీన్లను ఏర్పాటు చేశారు. అన్ని చెకిన్‌ కౌంటర్ల వద్ద బోర్డింగ్‌ కార్డు,బ్యాగ్‌ ట్యాగ్‌ డిస్పెన్సర్లు సరాసరి ప్రయాణికులకే అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు. ఫుడ్‌ కోర్టులు, ఔట్‌ లెట్లు, లాంజ్‌లు, రిటైల్‌ షాపుల వద్ద కూడా భౌతిక దూరం తప్పనిసరి. మొబైల్‌ వ్యాలెట్‌లతో జరిపే కొనుగోళ్లనే ప్రోత్సహిస్తారు. ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరిని థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement