సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమెరికాలో పెరిగిన నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు విదేశీ వృత్తి నిపుణులకు జారీ చేసే హెచ్1బీ సహా అన్ని రకాల వర్క్ వీసాలను తాత్కాలికంగా నిలిపేయాలని అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వేలాది మంది భారతీయ టెకీల్లో గుబులు రేపుతోంది. అమెరికాలో ఉన్నతవిద్యను అభ్యసించిన భారతీ య గ్రాడ్యుయేట్లు సైతం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) వర్క్ పర్మిట్‌తో ఉద్యో గం చేస్తున్న దాదాపు 25 వేల మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఈసారి హెచ్1బీ వీసా రానిపక్షంలో స్వదేశానికి తిరుగుముఖం పట్టాల్సి ఉంటుంది.
ట్రంప్ తీసుకున్న అసాధారణ నిర్ణయం వారి పాలిట అశనిపాతంగా మారబోతోంది. హెచ్1బీ సహా అన్ని రకాల వర్క్ వీసాల రద్దుపై ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువరిస్తానని ట్రంప్ ఓ టీవీ ఇంటర్వూ్యలో వెల్లడించడం తెలిసిందే. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడితే ఓపీటీపై పనిచేస్తూ చివరి అవకాశంగా హెచ్1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న దాదాపు 40 వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. వారిలో ఎల్–1పై అమెరికా వెళ్లిన 15 వేల మంది ఐటీ నిపుణులు కూడా ఉన్నారు.
ఎల్–1 గడువు ముగుస్తున్న దశలో ఈ ఏడాది మార్చిలో హెచ్1బీకి దరఖాస్తు చేశారు. వారి దరఖాస్తులు లాటరీలో ఎంపికై పరిశీలన దశలో ఉన్నాయి. ఇప్పుడు హఠాత్తుగా ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వారిని చిక్కుల్లో పడేసింది. కొత్తగా వెలువడనున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎలా ఉండబోతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం అమెరికాలో హెచ్1బీ వీసాపై పనిచేస్తున్న ఐటీ నిపుణుల రెన్యువల్ దరఖాస్తుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నప్పటికీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వెలువడే దాకా చెప్పలేమని, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ట్రంప్ ఎంతటి కఠిన నిర్ణయాలనైనా తీసుకొనే ప్రమాదం ఉందని భారతీయ ఐటీ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
ఈ ఏడాది 70 వేలకు పైగా హెచ్1బీ వీసాలు...
ఈ ఏడాది మార్చిలో దాదాపు 1.67 లక్షల మంది భారతీయ ఐటీ నిపుణులు హెచ్1బీ వీసాలకు దరఖాస్తు చేయగా వారిలో 70 వేల మంది లాటరీలో ఎంపికయ్యారు. వారికి వీసాలు జారీ చేసే ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. మామూలుగా అయితే జూన్ నుంచి లాటరీ ద్వారా ఎంపికైన వారికి హెచ్1బీ వీసాలు జారీ చేస్తారు. అయితే ఈసారి కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలోని పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ కార్యాలయాలు మూతపడ్డాయి. అయినా దాదాపు 8 వేల మందికి హెచ్1బీ వీసాలు మంజూరయ్యాయి. మిగిలిన వారి దరఖాస్తులు పరిశీలిస్తున్న సమయంలో కొత్త తంటా వచ్చిపడింది.
‘లాటరీలో ఎంపికైన వారికి సెప్టెంబర్‌లోగా వీసాలు జారీ చేయడమన్నది మామూలుగా జరుగుతున్న వ్యవహారం. కానీ ఈసారి ట్రంప్ తీసుకురాబోతున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో ఏయే నిబంధనలు ఉంటాయో చెప్పలేని పరిస్థితి. అన్ని రకాల వర్క్ వీసాలు రద్దయితే లాటరీలో ఎంపికైన దరఖాస్తులను పరిశీలించే అవకాశం లేదు. అలాంటి పరిస్థితిలో ఇంకా ఓపీటీ గడువు మిగిలి ఉన్న ఇంజనీర్లకు పెద్దగా ఇబ్బంది ఉండదు. గడువు ఈ ఏడాది జూన్ ఆఖరు నుంచి డిసెంబర్‌తో ముగియబోతున్న వారు మాత్రం తాత్కాలికంగా అయినా అమెరికా వదిలిపెట్టక తప్పదు’అని అట్లాంటా కేంద్రంగా ఐటీ ఔట్‌సోర్సింగ్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న భారతీయ అమెరికన్ ఒకరు చెప్పారు.
రెన్యువల్ పరిస్థితి ఏమిటో?
అన్ని రకాల వర్క్ వీసాలు రద్దు చేస్తూ వెలువడబోయే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో ఇప్పటికే అక్కడ ఉద్యోగాలు చేస్తున్న హెచ్1బీ వీసాదారులకు సంబంధించి స్పష్టమైన నిబంధనలు ఉండాలి. అలా లేని పక్షంలో జూలై నుంచి రెన్యువల్ అయ్యే వారి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. ‘నాకు తెలిసినంత వరకు రెన్యూవల్ ఇంజనీర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. వారికి కూడా వర్క్ వీసా రెన్యువల్ చేయకపోతే వచ్చే ఏడాదిలోపే అమెరికాలోని ఐటీ కంపెనీలన్నీ మూసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఇంజనీర్లలో భయాందోళనలు తీవ్రంగా ఉన్నాయి’అని శాన్‌జోస్ కేంద్రంగా పనిచేస్తున్న టీసీఎస్ హెచ్‌ఆర్ విభాగం సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment