పల్లె ప్రగతి కోసం దాతలు ముందుకు వస్తున్నారు. లక్షలాది రూపాయలు విరాళంగా అందిస్తున్నారు. అయితే దాతలు ఇచ్చిన సొమ్మును ఇష్టానుసారం ఖర్చు చేస్తే కుదరదు. విరాళాలు ఇచ్చిన వారు సూచించిన పనులే చేపట్టాల్సి ఉంటుంది. లేకపోతే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తప్పవు.
సాక్షి, మోర్తాడ్(నిజామాబాద్): పల్లె ప్రగతి రెండో విడత కార్యక్రమంలో భాగంగా ఆదివారం డోనర్స్ డే, పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు నిర్వహించారు. పల్లెల అభివృద్ధి కోసం దాతలు చాలామంది ముందుకు వచ్చారు. మొదట గ్రామాల అభివృద్ధి కోసమే విరాళాలు సేకరించాలని ప్రభుత్వం భావించినా.. ఆ తర్వాత పాఠశాలల్లో సమస్యల పరిష్కారంపైనా దృష్టి సారించారు. ఆయా పాఠశాలల్లో గతంలో చదువుకున్నవారితో పూర్వ విద్యార్థుల సమ్మేళనాలను నిర్వహించాలని నిర్ణయించి అన్ని గ్రామాల పరిధిలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఆదివారం నిర్వహించిన డోనర్స్ డే, పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో దాతలనుంచి విరాళాలు ఆహ్వానించారు. కొంత మంది వస్తు రూపంలో సాయం అందించగా.. మరికొందరు నగదు సాయం చేశారు. ఇలా ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో రూ. 50 వేల నుంచి రూ.10 లక్షల వరకు విరాళాలు వచ్చినట్లు తెలుస్తోంది.
పల్లె ప్రగతి రెండో విడత కార్యక్రమం ఈనెల 12వ తేదీ వరకు కొనసాగనుంది. ఈలోపు మరికొందరు దాతలు ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఇలా వచ్చిన విరాళాల సొమ్ము వినియోగం విషయంలో స్పష్టత లేకపోవడంతో కొంత గందరగోళం నెలకొంది. దీనికి ప్రభుత్వం ఫుల్‌స్టాప్ పెట్టింది. దాతలు ఇచ్చిన విరాళంతో వారు సూచించిన పనులను చేపట్టాలని సూచించింది. అలాగే పాఠశాలల అభివృద్ధికి వచ్చిన విరాళాలనూ పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. దీంతో విరాళం ఇచ్చిన సొమ్మును ఎందుకోసం ఖర్చు చేయాలి అని పంచాయతీ ఉద్యోగులు స్పష్టత తీసుకుంటున్నారు. దాతలు ఫలానా పని చేయాలని సూచిస్తే ఆ పనే చేయాల్సి ఉంటుంది. వారు ఏ పనీ సూచించకపోతే పంచాయతీ తీర్మానం ప్రకారం సొమ్మును ఖర్చు చేయాలి.
కలెక్టర్ ఖాతాకు చేరిన నిధులు పంచాయతీలకు..
పల్లెల అభివృద్ధి కోసం ముందుకు వచ్చేవారు విరాళం ఇవ్వడానికి కలెక్టర్ ఖాతా నంబర్‌ను ప్రకటించారు. కలెక్టర్ ఖాతాకు చేరిన నిధులను దాతలు సూచించిన పంచాయతీ ఖాతాకు బదలాయించనున్నారు. విరాళం సొమ్ము పక్కదారి పడితే అభాసు పాలయ్యే ప్రమాదం ఉండడంతో పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు.
లెక్కలు పక్కాగా ఉంటాయి
గ్రామ పంచాయతీలకు ఇచ్చిన విరాళాల లెక్క పక్కాగా ఉంటుంది. పాఠశాలలకు ఇచ్చిన విరాళాలు కూడా పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలి. దాతలు సూచించిన పనులకే నిధులను ఖర్చు చేయనున్నాం.
– పీవీ శ్రీనివాస్, డీఎల్‌పీవో, ఆర్మూర్
Comments
Please login to add a commentAdd a comment