సంగారెడ్డి క్రైం: బడ్జెట్ సమావేశాల అనంతరం ఉద్యోగులు ఆశించిన రీతిలోనే మెరుగైన పీఆర్ సీ రానుందని టీఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్ తెలిపారు. సంగారెడ్డిలోని టీఎన్జీఓ భవన్‌లో బుధవారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో పాటు మెరుగైన పీఆర్‌సీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
హెల్త్ కార్డుల విషయంలో ఉద్యోగులు ఆందోళన చెందొద్దని సూచించారు. ఏ రాష్ర్ట్రంలో లేని విధంగా పరిమితి లేని చెల్లింపులతో కూడిన హెల్త్ కార్డులు ఇవ్వడం హర్షణీయమన్నారు. కానీ కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రం రేట్లు పెంచాలని హెల్త్ కార్డులు తీసుకోవడం లేదన్నారు. వాటిపై తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అత్యవసరంగా శస్త్ర చికిత్సలు జరిగినట్లయితే రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందని చెప్పారు.
సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల విభజన వెంటనే పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ర్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 65 సంవత్సరాలు దాటిన రిటైర్డ్ ఉద్యోగులకు 65 శాతం పెన్షన్ ఇవ్వాలని కోరారు. అనంతరం టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా శ్యామ్‌రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో అసోసియేట్ అధ్యక్షుడు ఎం.రాజేందర్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్యామ్‌రావు, విజయలక్ష్మి, మనోహర, జయరామ్ నాయక్, సుశీల్‌బాబు, జావెద్ అలీ, సుధాకర్, మంజులత, రవి, సిద్ధి రాములు తదితరులు పాల్గొన్నారు.
త్వరలోనే మెరుగైన పీఆర్సీ
Published Wed, Nov 12 2014 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM
Advertisement
Advertisement