* సెప్టిక్ ట్యాంకులో దిగి నలుగురి మృతి
* అపార్ట్‌మెంట్ బిల్డర్ల నిర్లక్ష్యానికి మూల్యం
* దీపావళి రోజు తీరని శోకం
* భవన నిర్మాణాల రద్దు, క్రిమినల్ కేసులు : కలెక్టర్ రోస్
నిజామాబాద్‌అర్బన్/ క్రైం : దీపావళికి ఒక రోజు ముందు మృత్యువు కరాళ నృత్యం చేసింది. సెప్టిక్ ట్యాంకు రూపంలో నలుగురిని బలిగొని వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్ బస్వాగార్డెన్స్‌లో అశోక్‌టవర్స్ పేరిట నూతనంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల్లోని సెప్టిక్ ట్యాంకులోకి దిగిన నలుగురు కార్మికులు ఊపిరాడక మృతి చెందారు. 130 ఫ్లాట్‌లతో రెండు బ్లాకులుగా నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్స్‌లో 12 ఫీట్ల లోతు, 18 ఫీట్ల వెడల్పు గల సెప్టిక్ ట్యాంక్‌ను నిర్మించారు. ఆరు నెలల క్రితమే పైకప్పును పూర్తిగా మూసివేశారు.
బుధవారం సాయంత్రం సెప్టిక్ ట్యాంకులో ఉండిపోయిన కట్టెల తొలగింపు పనులకు కార్మికులు సిద్ధమయ్యారు. మొదట అమీర్ అనే కార్మికుడు ట్యాంక్‌లోకి దిగాడు. ఇతను లోపలికి వెళ్లగానే ఊపిరి ఆడక మరణించాడు. అమీర్ (27) నుంచి స్పందన రాకపోవడంతో తోటి కార్మికుడు ఎస్.కె.సమద్ (45) కూడా ట్యాంక్‌లోకి దిగాడు. ఇతను కూడా ఊపిరి ఆడక మరణించాడు. వీరిద్దరినుంచి స్పందన రాకపోవడంతో అక్కడే ఉన్న భవన నిర్మాణ కాంట్రాక్టర్ తిరుపతిరెడ్డి లోపలికి వెళ్లిన వారి పరిస్థితి తెలుసుకునేందుకు జమీల్(30) అనే కార్మికుడిని పురమాయించాడు.
ఇతను కూడ సెఫ్టిక్ ట్యాంక్‌లో దిగగానే అదే పరిస్థితి నెలకొంది. కొద్దిసేపటి వరకు ఊపిరి ఆడకపోవడంతో కేకలు వేసి జమీల్ మృతి చెందాడు. ఆందోళన చెందిన కాంట్రాక్టర్ అక్కడే విధులు నిర్వహిస్తున్న వాచ్‌మన్ శంకర్‌ను చూడలంటూ సెప్టిక్ ట్యాంకులోకి దించాడు. ఈతను కూడా ఊపిరి ఆడక ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడు. ఇతని పరిస్థితిని గమనించి భవనంలో ఉన్న మరో వ్యక్తి పైకి లాగాడు, చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే శంకర్ మరణించారు. ఆరు నెలలుగా సెప్టిక్ ట్యాంక్ మూసి ఉండడం, నూతనంగా నిర్మాణం చేపట్టి వదిలివేయడంతో లోపల కార్బన్‌డైయాక్సెడ్ , మిథేన్ కలియిక వల్ల విషవాయువులు ఏర్పడ్డాయి.
12 ఫీట్ల లోతులో గాలికూడా లేకపోవడంతో ఊపిరి ఆడక కార్మికులు మరణించారు. ఘటన తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన అపార్టుమెంట్‌కు చేరుకొని ట్యాంక్‌లోని కార్మికుల మృతదేహాలను రెండు గంటల పాటు శ్రమించి వెలికితీశారు. ఫైర్ రిస్క్ టీం రాజిరెడ్డి , అసిస్టెంట్ ఫైర్ జిల్లా అధికారి సతీష్‌ల ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. కాగా కరెంటు లేకపోవడంతో సహాయ చర్యలకు కొంత అంతరాయం ఏర్పడింది. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఘటన స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
భవన నిర్మాణం అనుమతి రద్దు : నలుగురిపై క్రిమినల్ కేసులు
అశోక్ టవర్స్ నిర్మాణానికి అనుమతి రద్దు చేసి, సీజ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ప్రకటించారు. అపార్ట్‌మెంట్ యజమాని , కాంట్రాక్టర్ , ఆర్కిటెక్చర్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ ఘటనా స్థలికి చేరుకుని మృత దేహాలను పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలను తెలుసుకున్నారు. అంతకు ముందు జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపడుతామన్నారు. సెప్టిక్ ట్యాంక్‌లోకి కార్మికులు దిగడానికి ఎవరి ప్రోద్బలమైన ఉందా, పనుల నిమిత్తం వారే దిగారా అన్నది పరిశీలిస్తున్నామన్నారు. భవన నిర్మాణానికి సంబంధించి చర్యలు తీసుకునేందుకు ఉత్తర్వులు సిద్ధం చేయాలని కార్పొరేషన్ టీపీవోను మల్లికార్జున్‌ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
చూసేందుకు వెళ్లి మృత్యువాత
పడ్డ శంకర్
అశోక టవర్స్ అపార్టమెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న శంకర్ ముగ్గురు కార్మికులు సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగి మృత్యువాత పడాగానే ఏమి జరుగుతుందో తెలుసుకోనేందుకు వెళ్లాడు. అక్కడికి వెళ్లిన శంకర్‌ను ట్యాంక్‌లోకి దిగాల్సిందిగా సబ్‌కాంట్రాక్టర్ తిరుపతిరెడ్డి పురమాయించాడు. దీంతో శంకర్‌కు మరణం తప్పలేదు. శంకర్‌ది వరంగల్ జిల్లా పాలకుర్థి మండలం బొమ్మెడ గ్రామం. ఇతనికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. వారు శంకర్ మృతదేహంపై పడి బోరున విలపించడం అక్కడున్న వారిని కలిచి వేసింది. ఘటన స్థలికి నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఫయీమ్ , స్థానిక కార్పొరేటర్ పురుషోత్తం, నగర సీఐ నర్సింగ్‌యాదవ్, నగర ఎస్సైలు చేరుకున్నారు.
రెక్కాడితేగానీ డొక్కాడని కార్మికులు
నిజామాబాద్ క్రైం: సెప్టిక్‌ట్యాంక్‌లో పడి మృతి చెందిన కార్మికులంతా రెక్కడితేగానీ డొక్కడని కార్మికులే. జిల్లా కేంద్రంలోని అజాంకాలనీకి చెందిన సయ్యద్ జమీల్(30), ఎస్‌కే సమద్(45), నిజామాబాద్ మండలం సారంగపూర్ గ్రామానికి చెందిన అమీర్(27)లు మూడు నెలలుగా అశోక్‌రెడ్డి అపార్టుమెంట్‌లో సెంట్రిపనులు చేస్తున్నారు. ఇందులో ఎస్‌కే సమద్‌కు భార్య ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సయ్యద్ జమీల్‌కు భార్య, కొడుకు ఉన్నారు. సారంగపూర్‌కు చెందిన అమీర్‌కు ఇంకా పెండ్లి కాలేదు. ఇతనిపైనే కుటుంబం ఆధారపడి జీవిస్తోంది. ఆస్పత్రి ఆవరణలో మృతుల కుటుంబాల రోదనలు మిన్నంటాయి.
కమిషనర్‌పై మండిపడ్డ కలెక్టర్
నిజామాబాద్‌అర్బన్ : అశోక టవర్స్‌లో అపార్టమెంట్‌లో సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగి కార్మికులు మృతిచెందిన ఘటనా స్థలికి మున్సిపల్ కమిషనర్ మంగతాయారు చేరుకోకపోవడంతో అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ మండిపడ్డారు. పక్కనే ఉన్న మున్సిపల్ డిప్యూటీ డిఈఈ రషీద్‌ను పిలిచాడు. ఘటన జరిగి రెండు గంటలైన కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది ఎక్కడికి వెళ్లారంటూ ప్రశ్నించారు. కమిషనర్ ఎక్కడ ఉంది.. పిలువండి అంటూ ఆగ్రహంతో రషీద్‌ను ఆదేశించారు. కమిషనర్ వస్తుందంటూ రషీద్ సమాధానం చెప్పుకొచ్చారు. జిల్లా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు , పోలీసు సిబ్బంది వచ్చి సహాయక చర్యలు చేపడుతుంటే కార్పొరేషన్ సిబ్బంది ఒక్కరు కూడా అందుబాటులో లేరు.
ఆ కుటుంబాల్లో అమావాస్యే !
Published Thu, Oct 23 2014 2:26 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement