ఎన్నికా..ఏకగ్రీవమా? | DPC Election TRS Unanimous | Sakshi
Sakshi News home page

ఎన్నికా..ఏకగ్రీవమా?

Published Wed, Dec 10 2014 3:46 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

ఎన్నికా..ఏకగ్రీవమా? - Sakshi

ఎన్నికా..ఏకగ్రీవమా?

 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) ఎన్నికపై రాజకీయపక్షాలు దృష్టి సారించాయి. డీపీసీ సభ్యుల నియామకానికి షెడ్యూల్ వెలువడడం, 12న నామినేషన్లు వేయాల్సి ఉండడంతో ఏం చేయాలన్న దానిపై అటు అధికార టీఆర్‌ఎస్, ఇటు విపక్ష కాంగ్రెస్  మల్లగుల్లాలు పడుతున్నాయి. జిల్లాపరిషత్‌లో కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలో అధికారపక్షం ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండేలా మంత్రి జగదీష్‌రెడ్డి పావులు కదుపుతున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ నేతలు కూడా తమ అనుచర జెడ్పీటీసీ సభ్యులకు డీపీసీలో చోటు దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఎన్నిక జరిగితే పెద్దఎత్తున రాజకీయ సమీకరణలు చేయాల్సి ఉంటుందని, మిగిలిన పార్టీలకు జెడ్పీలో పెద్దగా బలం లేకపోవడంతో ‘రాజీ’ మార్గంలో పదవులు పంచుకుంటే సరిపోతుందనే యోచనలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలున్నట్టు తెలుస్తోంది. నామినేషన్లకు మరో రెండు రోజుల సమయమున్న నేపథ్యంలో డీపీసీకి ఎన్నిక అనివార్యమవుతుందా? లేక ‘రాజీ’కుదిరి ఏకగ్రీవమవుతుందా అనేది బుధవారం రాత్రికి తేలే అవకాశముంది.
 
 పంపకాలు ఎలా?
 వాస్తవానికి జిల్లా పరిషత్ లో కాంగ్రెస్‌కు 43 మంది సభ్యుల బలముంది. టీఆర్‌ఎస్ పక్షాన 13, టీడీపీకి 2, సీపీఐకి 1 సభ్యుడున్నారు. దీంతో జెడ్పీటీసీ సభ్యుల తరఫున ఎన్నుకునే 20 మంది సభ్యుల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ప్రాతినిధ్యం దక్కే అవకాశముంది. అయితే, టీఆర్‌ఎస్‌కు కూడా 13 మంది సభ్యులు ఉండడంతో తమకు కూడా డీపీసీలో ప్రాతినిధ్యం కావాల్సిందేనని ఆ పార్టీ నేతలు పట్టుపడుతున్నారు. ఇరుపార్టీలు కచ్చితంగా ఒక అవగాహనకు వస్తేనే ఇది సాధ్యమవుతుంది. దీనికి తోడు ఎన్నిక జరిపిన దాని కన్నా రెండు పార్టీల ఏకాభిప్రాయంతో డీపీసీ ఎన్నికను ఏకగ్రీవం చేస్తేనే మంచిదనే యోచనలో జెడ్పీ చైర్మన్ బాలునాయక్ ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు మంత్రితో పాటు కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలతో కూడా ఆయన ఇప్పటికే ప్రాథమిక సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది.
 
 ఈ సంప్రదింపులు ఫలిస్తే టీఆర్‌ఎస్‌కు  జెడ్పీటీసీ సభ్యుల నుంచి 5-8, కౌన్సిలర్ల నుంచి 2 స్థానాలు ఇస్తామనే ప్రతిపాదనలు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వస్తున్నాయని సమాచారం. అయితే, ఇందులో మంత్రి నిర్ణయమే కీలకం కానుంది. కాంగ్రెస్ ప్రతిపాదించిన విధంగా ఆయన అంగీకరిస్తారా లేక ఎక్కువ స్థానాల కోసం పట్టుబట్టి ఎన్నికలకు వెళ్లి రాజకీయ ‘సమీకరణ’లు మారుస్తారా అన్నది  ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఆయన కూడా డీపీసీ సభ్యుల ఎన్నిక, రిజర్వేషన్ల కేటాయింపుపై  పార్టీనేతలు, అధికారులతో  మంగళవారం చర్చించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చి పదవుల పంపకాలకు అంగీకరిస్తారా? టీఆర్‌ఎస్ వ్యూహం ఎలా ఉండబోతోంది? డీపీసీ సభ్యుల ఎన్నిక అనివార్యమవుతుందా? ఏకగ్రీవమవుతుందా? అనేది జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement